గురువుల ఆశీస్సులు---బీఈడీ చదువుతున్న వారికి మాజీ ఇంగ్లీష్ ప్రొఫెసర్ జయంతిశ్రీ బాలకృష్ణన్ తో ఓ ఉపన్యాసం ఇప్పించారు. నిన్న రాత్రి పడుకునే ముందు ఆమె చెప్పిన మాటలు విన్నాను. వాటలో ఒకటి రెండు ఇక్కడ ఉదహరిస్తాను. దేశభక్తి లేదా టీచర్ ఉద్యోగానికి తగవు.తెలుగు తల్లి గీతం పాడలేవా అయితే టీచర్ ఉద్యోగానికి తగవు. (ఇక్కడ ఆమె చెప్పిన గీతం తమిళుల కోసం తప్పనిసరిగా ఆలపించే తమిళ తల్లి గీతం. కానీ నేనిక్కడ దానిని నేటివిటీ కోసం తెలుగు తల్లి అని మార్చాను).విద్యార్థుల పట్ల ద్వేషం తగదు. వారిని సక్రమంగా తీర్చిదిద్దే శక్తి ఉంటేనే టీచర్ ఉద్యోగానికి రావాలి. లేకుంటే రాకూడదు.ఆమె చదువుకుంటున్న రోజుల్లో టైలరింగ్ టీచర్ చెప్పిన ఓ విషయం చెప్పారు. ఆమె దగ్గర ఉన్న సూదులు కావాలంటే అయిదు రూపాయలు ఇచ్చి తీసుకోవాలి. అలా ఇచ్చేటప్పుడు సూది మొన ఇచ్చే వారివైపుండాలి. మరొక అంచు తీసుకునే వారి వైపుండాలి. ఎందుకుంటే తీసుకునే వారి ధ్యాస ఎటో ఉండొచ్చు. అటువంటప్పుడు సూది మొన ఉన్న తీసుకునే వారిస్తే పరధ్యాన్నంలో తీసుకునేటప్పుడు వారి వేలికి గాయమవచ్చు. సూది మాత్రమే కాదు కత్తి కత్తెర ఏదైనాసరే ఇచ్చేటప్పుడు ఇదే పద్ధతి పాటించాలి.పిల్లల చేతి రాత కుదురుగా ముత్యాల్లా ఉండేటట్లు చూడవలసిన బాధ్యత టీచర్లదే.అలాగే వారి నోటు పుస్తకాలుకానీ పాఠ్యపుస్తకాలుకానీ ఏడాది పొడవునా కొత్తగానే ఉండాలి. ఇప్పుడే కొనుక్కొచ్చిన కొత్త పుస్తకంలా ఉండాలి ఆ ఏడాది చదువు ముగిసేవరకూ.పిల్లలలో కొందరు గుండీలు పెట్టుకోరు. మొరటుగా మాట్లాడొచ్చు. అటువంటి వారిలో మంచి మార్పు తీసుకురాగలగాలి. అంతేతప్ప వాళ్ళెట్లా పోతే నాకేం అన్నట్లుగా వారిని విడిచిపెట్టకూడదు. స్టాఫ్ రూములో మిగిలిన టీచర్లతో తన విద్యార్థుల గురించి తప్పుగా మాట్లాడకూడదు.రెండో ప్రపంచ యుద్ధమప్పుడు ముస్సోలిని ఓ చిన్న గ్రామాన్ని ఓడించి స్వాధీనం చేసుకోవలసిందిగా తన అనుయాయులను పంపుతాడు. కానీ వెళ్ళిన ఆ సైనికులు గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చి ఆ గ్రామాన్ని హస్తగతం చేసుకోవడం కష్టమని అంటారు. కానీ ముస్సోలిని ఊరుకోడు. మళ్ళీ మళ్ళీ దాడికి పంపుతాడు. అయితే వెళ్ళిన అన్నిసార్లూ ఓడిపోతారు. తలలు వేలాడేసి తమ నేత దగ్గరకు వస్తారు. అప్పుడు ముస్సోలిని అడుగుతాడు...ఆ గ్రామ జనాభా ఎంతని. ఓ డెబ్బయ్ ఎనబై మంది ఉంటారంటారు. గ్రామమంతా ఒకరి వెంబడే నడుస్తోందంటారు.ఇంతకూ అతనేమో చేస్తుంటాడు అని ముస్సోలిని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు చెప్తారు, ఆయనొక టీచర్ అండీ అని. వయస్సు అరవై ఏళ్ళుంటాయంటారు. ఆ మాటలు వినడంతోనే ముస్సోలిని "అలాగైతే ఆ గ్రామాన్ని ఎవరూ గెలవలేరంటాడు. ఇక ఆమె దగ్గర చదువుకున్న విద్యార్థులలో ఇద్దరు కాశ్మీర్ సరిహద్దులో విధులు నిర్వహిస్తుంటారు. వారు క్రమం తప్పక ఈ టీచర్ కి ఫోన్ చేసి నమస్సులు చెప్తూ కొన్ని విషయాలు చెప్తుంటారు. అప్పుడు ఈమె మీరిద్దరి గురించి అందరితోనూ గొప్పగా చెప్పుకుంటున్నానని అంటారు. ఆ మాటలకు విద్యార్థుల స్పందన ఇలా ఉంటుంది - "టీచర్ మీరు మమ్మల్ని గొప్పగా చెప్పకండి మిస్. మేం లేకపోయినా సైన్యముంటుంది దేశాన్ని కాపాడటానికి. కనుక మీరు కొనియాడవలసింది సైన్యాన్నే తప్ప మమ్మల్ని కాదు మిస్ అని అన్నారు. అవీ ఇవీ మాట్లాడిన తర్వాత ఆ విద్యార్థులు కోరేదిదే.... " మిస్ మేము బాగుంటామని ఒక్క చెప్పండి మిస్ " అని. ఎందుకంటే టీచర్ ఆశీస్సులకున్న శక్తి మంత్రాలకన్నా శక్తిమంతమైనద అని ఆ విద్యార్థుల గట్టి అభిప్రాయం. ఇలా ఆమె బోలెడంత చెప్పారు. నాకు ఆమె మాటలంటే ఎంతో ఇష్టం. అందుకే కొన్ని మాటలు మీతో పంచుకుంటున్నాను ఇలా.- యామిజాల జగదీశ్


కామెంట్‌లు