ఆలోచన, ఆలోచనే!!---నాకొక మిత్రుడున్నాడు. పేరు సాదిక్. ఉదయంలో సహ ఉద్యోగులమే. ఉదయం పత్రిక లేకపోవచ్చు కానీ మా పరిచయ స్నేహం ఇప్పటికీ ఉంది. ఇద్దరి దారులు వేరైనా బంధమేమీ మారలేదు. అఫ్ కోర్స్ చూసుకోకపోవచ్చు. దీర్ఘకొలం తర్వాత ఉన్నట్లుండి ఇద్దరం ఎదురుపడినప్పుడు యోగక్షేమాలు చెప్పుకుంటాం. సాదిక్ అనే కన్నా "తోపుడుబండి" సాదిక్ అంటే ఠకీమని స్ఫురణకు వస్తారు. తోపుడుబండిమీద రకరకాల పుస్తకాలు పెట్టుకుని వివిధ ప్రాంతాలకు వెళ్ళి అమ్మిన సాదిక్ ప్రయోగం వినూత్నమే. పుస్తకాలంటే ప్రాణం. అటువంటి సాదిక్ తో ఓ రోజు కవిత గురించి నేనే ప్రస్తావించాను. ఏముందీ ఈనాటి కవిత్వం? ఓ పెద్దవాక్యాన్ని పదాలుగా విడగొట్టి ఇష్టమొచ్చినన్ని లైన్లలో పేర్చి దాన్ని కవితనుకోమంటే ఎలా అని ప్రశ్నించేసరికి చివుక్కుమంది. కానీ ఆలోచించి చూడగా సాదిక్ అన్న మాటతో ఏకీభవించాను. అప్పటివరకూ ఏవేవో రాసి వాటిని కవితలుగా ఊహించుకున్న నేను ఈ సంఘటన తర్వాత నేను రాసేవి కవితలని అనుకోవడం మానేశాను. అయినా నాకు కవిత స్వరూపం తెలీదు. వేటిని కవితనాలి అనేదీ తెలీదు. ఇప్పటికీ తెలీదు. కానీ కవితలని వెలువడుతున్న దానిని చదివి బాగుంటే ఆస్వాదిస్తున్న రోజుల్లో ఓసారి పుస్తకప్రియులు రామడుగు రాధాకృష్ణగారిని కలిసాను. అప్పుడు ఆయన ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారి ఆలోచన పుస్తకం చదవమని ఇచ్చారు. ఆయన ముందే అటూ ఇటూ కొన్ని పేజీలు తిప్పినప్పుడు ఆది అదివి ఇవ్వడంకన్నా నేనే సొంతంగా ఓ పుస్తకం కొనుక్కుంటే బాగుంటుందనుకుని "నవోదయ" కోటేశ్వరరావుగారికి ఫోన్ చేస్తే స్టాక్ ఉందన్నారు. మరో రెండు రోజుల తర్వాత నవోదయకెళ్ళి కొని ఆలోచనతో ఏకమయ్యాను. ఇది చదివేకొద్దీ "కవితలంటే ఏమిటి" అని ప్రశ్నించుకునే వారికి ఉపయోగపడే పుస్తకమనిపించింది.ఇది సాహిత్య వ్యాసాల సంపుటి. ఈ వ్యాసాలన్నీ ముక్తక స్వభావం కలిగినవే. ముక్తక వ్యాసాలను సంపుటీకరించే సందర్భంలో రెండు పద్ధతులు అనుసరించదగి ఉన్నాయి. ఒకటి, ప్రస్తుతం, రచయిత విశ్వాసాలకు అనుగుణంగా లేని వాటిని మార్చడం. రెండు దేనికి దాని (వ్యాస) ముక్తక స్వభావాన్ని, కాలసందర్భాలలో అభిప్రాయ స్వభావాన్ని మన్నించి ఉంచడంమని చెప్పిన శర్మగారు ఈ సంపుటి ప్రచురణలో రెండవ పద్ధతినే అనుసరించారు. ముప్పయ్ ఆరేళ్ళలో ఆయనకున్న పుస్తక పరిజ్ఞానంతో మూడు తరాల కవిమిత్రుల పరిచయాలతో చర్చల ద్వారా కలిగిన అనుభవాలతో వివిధ సాహిత్య సిద్ధాంతాల అనుశీలనంతో సమన్వయించుకున్న ఆలోచనల సమాహారమే ఈ పుస్తకం. ముప్పయ్ నాలుగు వ్యాసాలున్న ఈ పుస్తకం "తెలుగు పద్యం" అనే వ్యాసంతో మొదలై "తెలుగు కవిత్వంతో బాపు" అనే వ్యాసంతో ముగిసింది. ప్రబంధకవులు మొదలుకుని ఆధునిక కవులు సాగించిన పద్య, వచన కవితలను స్పృశిస్తూ సమర్పించిన ఈ వ్యాసాలన్నీ చదువుతుంటే ఎంతో ఆసక్తికరంగా అనిపించాయి. తెలుగు పద్యం జీవశక్తి గొప్పదని, తెలుగు పద్యాన్ని కోల్పోతే ఓ గొప్ప అందాన్ని మనం కోల్పోయినట్టేనని చెప్పిన శర్మగారుగేయ రచనా ప్రక్రియల గురించీ వివరంగా ఇచ్చిన సమాచారం బాగుంది.తంజావూరు యక్షగానాలు, జావళీ సొగసుల గురించి చెప్పిన విషయాలన్నీ తెలుసుకోతగినవే. సినిమా పాట వ్యాసంలో ఎన్ని సాహిత్య ప్రక్రియలుంటే ఏమి, ఓ మంచి పాట రెక్క విప్పి శ్రోత మనస్సు మీద వాలి కలిగించే అనుభూతికి అవి సాటిరావంటూ పాట మనిషంత పాతదే కాదు, అంతే కొత్తది కూడానూ అనే మాట అక్షరసత్యమేగా!భావకవిత్వంపై పోతన ప్రభావం, భావకవిత్వ వారసత్వం చెప్తూ ఓ పద్యాన్ని ప్రస్తావించారు..... మెరుగు కళ్ళజోళ్ళు గిరిజాల సరదాలు భావకవికి లేని వేవి లేవు? కవితయందు తప్ప గట్టి వాడన్నింట విశ్వదాభిరామ! వినురవేమ! - ఈ పద్యం చదువుతుంటే వేమన ఎప్పుడిలాంటి పద్యం రాసేడా అనిపిస్తుంది. కానీ ఇది వేమన పద్యం కాదు. భావకవి చక్రవర్తిగా ప్రసిద్ధి పొందిన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు రాసిన పద్యమిది. వేమన మకుటంతో రకరకాల చమత్కారాలతో ఆయన మూడు వందల వరకూ పద్యాలు రాసారని తెలిసిందట. ఈ పద్యంలో దేవులపల్లివారు తన మీద తనే ఛలోక్తి విసురుకోగలిగారు. తన్ను తానే కాదు తన చుట్టూ జీవితాన్ని అంచనా వేయడంలో అర్థం చేసుకోవడంలో సమర్థుడని గ్రహించాలి. సాహిత్య శిల్పం పెద్ద పరిధి. కవిత్వ శిల్పం అందులో అంతర్వలయమే అంటూ విభిన్న కవితలతో శర్మగారు సింగారించిన ఈ పుస్తకం కవిమిత్రులకు ఉపకరిస్తుందనే నా వ్యక్తిగత అభిప్రాయం.విన్నకోట రవిశంకర్ రాసిన జ్ఞాపకం కవితతో ఈ ముచ్చట ముగిస్తాను.... అమ్మా, నీ జ్ఞాపకం ఫోటోలా దుమ్ముపడుతోంది ఒకప్పుడు వేల చిత్రాలై నన్ను ఉక్కిరిబిక్కిరి చేసిన జ్ఞాపకం అంతులేని చలన చిత్రమై నా కళ్ళలో కదలాడిన జ్ఞాపకం ఒకే ఒక గమనింపబడని పటంగా మారి మనసులో ఏ మారుమూల గోడకో వ్రేలాడుతోంది అనుక్షణం ఆకాశంలా నోరువిప్పిన జ్ఞాపకం ఇప్పుడు ఏ మాటల మంత్ర ధ్వనికో గుహ తలుపులా తెరుచుకుంటోంది. ఒకప్పుడు జలపాతంలా కళ్ళలోంచి ఉరికిన జ్ఞాపకం అపుడపుడు ఒక అశ్రుకణం మాత్రమై కనుకొనల్లో నిలుస్తోంది నీ మాటై నీ చూపై నీ నడకై విశ్వరూపం దాల్చిన జ్ఞాపకం ఎప్పుడో నీ గురించిన మాటగా మరుగుజ్జు రూపంలో దర్శనమిస్తోంది మృత్యువు నీ స్పర్శతో తన మార్మికతను కోల్పోయింది. ఇప్పుడు మాకది జీవితంలో భాగంగా అలవాటైపోయింది. అందుకే నీ గురించిన జ్ఞాపకం మరణించినా కూడా అమ్మా అది మేం గమనించమేమో!- - యామిజాల జగదీశ్


కామెంట్‌లు