జహంగీర్ ---నిన్న రాత్రి ఓ తమిళ పుస్తకంలో కొన్ని పేజీలు చదివాను. పుస్తకం పేరు - వందార్గల్...వెండ్రార్గల్. తెలుగులో వచ్చారు - గెలిచారు అని అర్థం. ఈ పుస్తకాన్ని తెలుగులో రాసే అవకాశం వచ్చింది. వజ్ఘల వేంకట రమణగారిచ్చిన పని చెయ్యలేకపోయాను. కారణం ఇంటి పరిస్థితులు. వాతావరణం ప్రశాంతంగా ఉంటే ఎంత పనైనా చేయవచ్చు. కానీ మానసిక ఒత్తిడీ, క్షోభ నలిపేస్తున్నాయి. నా తీరువల్ల రమణగారికి నామీద నమ్మకం పోయిందని గ్రహించగలను. ఆ తమిళ పుస్తకంలోని మొఘల్ చక్రవర్తులలో ఒకడు జహంగీర్. ఈయన మొదటి వివాహం 1585 ఫిబ్రవరి 13వ తేదీ జరిగింది. ఆమె మరెవరో కాదు...ప్రథమ దళపతులలో ఒకరైన భగవాన్ దాస కుమార్తె. పేరు మాన్ బాయ్. ముస్లిం - హిందు సంప్రదాయాలతో ఈ పెళ్ళయ్యింది. ఈ పెళ్ళి తర్వాత. పన్నెండేళ్ళల్లో జహంగీర్ ఇరవై మంది యువతులను పెళ్ళాడాడు. అనంతరం అతని అంతఃపురంలో అనేకమంది రాణులు ఉండేవారు. ఆయన అనేక రకాల పక్షులు, జంతువులతో ఓ చిన్నపాటి జంతుప్రదర్శనశాలను ఏర్పాటు చేసుకున్నారు.మన్సూర్ తదితర ఆస్థాన చిత్రకారులతో జహంగీర్ పక్షులు, జంతువుల బొమ్మలు గీయించేవాడు.ప్రత్యేకించి పక్షులంటే జహంగీరుకి ఎంతో ఇష్టం. వాటి బాగోగుల గురించి ఎంతో శ్రద్ధ తీసుకునే వాడు. ఆయన ఎంతో ఇష్టంతో పెంచుకున్న పక్షుల బొమ్మలు గీయించి ఓ ఆల్బమ్ తయారు చేశాడు. ఆ ఆల్బం జహంగీరుకి ప్రాణం. అది ఇప్పటికీ భద్రంగానే ఉంది. జహంగీర్ పాదుషా ఓ పుస్తకంలో పక్షుల గురించి అనేక వివరాలు రాసుకున్నాడు. ఆయన ఎంతో ముద్దుగా పెంచుకున్న కొంగలకు లైలా, మజ్ను అని పేర్లు పెట్టాడు. అతనెక్కడకు వెళ్తే అక్కడికి వాటినీ తీసుకుపోయేవాడు. వాటికి అతనే ఆహారం పెట్టేవాడు. ఈ రెండు ప్రేమపక్షులకోసం జహంగీర్ ఓ ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు.--- జయా


కామెంట్‌లు