మానేరు ముచ్చట్లు - రామ్మోహన్ రావు తుమ్మూరి --మిత్రుల ఆసక్తి గమనిస్తుంటే ఇంకా కొన్ని రోజులు ఈ ముచ్చట్లు ఇలాగే కొనసాగించే ప్రయత్నం చేద్దామనిపించింది.ఎలాగూ కరోనా కాళ్లు కట్టి పడేసింది.శాఖా చంక్రమణం కాకుండానే మరిన్ని విషయాలు వింగండించు కుందాం.నిన్న మహారాజా సర్ కిషన్ (ప్రసాద్) పెర్షాద్ ఆరవ నిజాము దివాన్ ఎ ఖాస్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిందని దాంట్లో భాగంగానే ఎలగందుల నుండి జిల్లా కేంద్రాన్ని కరీంనగరుకు మార్చారని తెలుసుకోవడం జరిగింది.సూర్య వంశ క్షత్రియుడైన కిషన్ ప్రసాద్ ఆరవ నిజాము కంటే రెండేండ్ల పెద్దవాడు.తాత నిర్లక్ష్యం చేస్తే సాలార్జంగ్ చేరదీయగా ఆయన పిల్లలతో పడమటి బడిలో చదువుకున్నవాడు.అక్కడ గణనశాస్త్రము,వైద్యము,జ్యోతిశ్శాస్త్రము, మతము, సూఫీయిజం గురించి చదువుకున్నాడు.ఇవి కాక యుద్ధవిద్యలు,మొగలుల రీతి రివాజుల గురించి కూడా అతనికి తెలుసు.ఇతను ఆరవ నిజాము మహబూబ లీఖాన్ కు చిన్ననాటి మిత్రుడే కాక,చచ్చేవరకు అత్యంత విశ్వాసపాత్రుడై మెలగిన వాడు.అందుకే నిజాము కుడి భుజమనే బిరుదును పొందాడు.1892 నుండి 1901 దాకా పేష్కారు గా పని చేసి తన ప్రతిభ చూపుకున్నాడు.తత్ఫలితంగా 1902 లో దివాన్ ఎ ఖాస్ గా నియమింపబడ్డాడు.1908 సెప్టెంబరు 28 మూసీ నది వరదలు వచ్చిన సమయంలో వరద ప్రాంతాలలో స్వయంగా పర్యటించి వారి బాగోగులు పట్టించుకున్న వాడు.దాదాపు 50,000 మందిని పొట్టను పెట్టుకున్న ఆ దురంతము హైదరాబాదు చరిత్రలో అతి ఘోరమైన విషాద ఘట్టము.ఆ సమయంలో కొన్ని రోజులపాటు నిస్సహయస్థితిలో ఉన్నవారిని సురక్షిత స్థలాలకు తరలించి భోజన వసతి ఏర్పాటు చేయటంలో కిషన్ ప్రసాదు కీలక పాత్ర వహించాడు.అప్పట్లో ఆయన పేరు ఎంతగా మారుమోగి పోయేదంటే మహారాజ్ అంటే కిషన్ ప్రసాద్ తప్ప ఇంకెవరూ కాదన్నంతగా.అతనికి చిత్రలేఖనము,సంగీతము,శిల్ప నిర్మాణము,ఫోటోగ్రఫీ మరియు కవిత్వములు మంచి ప్రావీణ్యముండేదట.అతడు గంగా జమునా తెహజీబ్ ను సమర్థించిన వారిలో ఒకరు.గంగా జమునా తెహజీబ్ ఆనేది ఆప్పట్లో హిందూ ముస్లిం సామరస్యవాదము ఒక కవితలో ఇలా అంటాడతను “నేను హిందువునూ కాను ముస్లిమునూ కాను నా విశ్వాసము అన్ని మతాలలో స్వాస్థ్యంగా ఉంటుంది షాద్ కే తెలుసు అతని మతవిశ్వాసమేమిటో స్వేచ్ఛకు తప్ప స్వాతంత్ర్యపు లోతు ఎవరికీ తెలియదు “ షాద్ ఆయన కలం పేరు.అనేక మంది కవులూ కళాకారులను ఆదరించే వాడట. ఇంకో విచిత్రమైన విషయం ఆయన గురించి ఆయన కుటుంబ సభ్యుల వల్ల తెలిసిందేమిటంటే అంతటి నియంతృత్వ నిజాము కాలంలో తానో ఆగ్ర కులజుడే కాకుండా ఒక ముఖ్య సచివుని హోదాలో ఉండి కూడా ఒక మామూలు బిచ్చగాడిని తన సోఫాలో కూర్చో బెట్టుకుని చాయ అందించే వాడట.అదేమిటని ఎవరైనా అడిగితేఏమో ఎవరికి తెలుసు భగవంతుడు ఏ రూపంలో వస్తాడో అని.మరో గమ్మత్తైన విషయం ఆయన క్షత్రియుడు.ఆయనకు అడుగులు భార్యలైతే అందులో ముగ్గురు బ్రాహ్మణ స్త్రీలు,నలుగురు ముస్లిం స్త్రీలు .అందరికీ కలిపి పదహారు మంది పిల్లలు.పిల్లలు తల్లుల సంప్రదాయానుసారం పెరిగారు.ముస్లిం స్త్రీని వివాహమాడటానికి అతడు ముస్లింగా మారటానికైనా సిద్ధపడితే నిజాము ఒప్పుకోలేదట.తనకు హిందువే దివానుగా ఉండాలని కోరిక అన్నాడట.ఇదండీ మన కిషన్ పెర్షాద్ సంగతి.అయితే ఆరవ నిజాము 1911లో మరణించిన తరువాత ఏడవ నిజాముగా గద్దెనెక్కిన చివరి నిజాము ఉస్మానలీఖాన్ వద్దుర సంవత్సరం వరకు దివాను గా పనిచేసి 1912లో రాజీనామా చేశాడు.అప్పుడు మూడవ సాలార్జంగ్ దివానుగా నియమితుడయ్యాడు.కానీ 1926 లో కిషన్ ప్రసాదు మళ్లీ దివాన్ అయ్యాడు.ఏడో నిజాము గురించి, మూడో సాలార్జంగ్ గురించి,ఆయన మ్యూజియమ గురించి తరువాతి ముచ్చట్లలో.(సశేషం)


కామెంట్‌లు