తెలుగు కవులలో ప్రాచీన కవి అని చెప్పబడుతున్న నన్నెచోడుడు "కుమారసంభవం" అనే పండ్రెండు ఆశ్వాసములు గల గ్రంథమును రచించాడు . ఈయన ప్రాచీన కవి అయినప్పటికీ వెలుగులోకి రాలేదు. ఈయన అందరికీ తెలిడానికి కారణం ఏమిటంటే 1909వ సంవత్స రమునందు బ్రహ్మశ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారు తన పుస్తకము మొదటి భాగమును ప్రకటించి ఆంధ్ర లోకానికి మహోపకారం చేశారు. వారు ఆ పుస్తకము యొక్క పీఠికలో నన్నెచోడ కవి కవిత్వం ప్రౌఢిమను బట్టి "కవిరాజ శిఖామణి" అనియు దిగ్విజయమును బట్టి టెంకనాదిత్యుడని బిరుదములు కలవని తెలియజేశాడు. చం. అడరు నవాంబు ధారలు జటాటవిలోబడి విభ్రమించె / వెల్వడి చనుదెంచి రాలుగొని పక్ష్మములన్ వెడనిల్చి మోవిపై/ బడి కుచఘట్టనం జెదరి పాఱి రయంబున ముత్తరంగలన్/ మడుఁగులు వారి నాభి కెడమానక చొచ్చె ననుక్రమంబుగన్/ ఈ పద్యం నన్నెచోడ కవి రచించిన కుమార సంభవము అనే కావ్యం లోనిది. కాళిదాసు కుమారసంభవం బాగా ప్రసిద్ధమైనదే, కానీ ఈ కావ్యం మాత్రం కాళిదాసు కావ్యానికి అనువాదం కాదు. వ్యాసభారతానికి కవిత్రయం చేసిన అనువాదం లాంటిది కాదు. అసలు అనువాదమే కాదు. స్వతంత్రంగా రాసిన చక్కని ప్రబంధం ఈ నన్నెచోడుని కుమార సంభవం. ఈ పద్యాన్ని గురించి మాట్లాడుకొనే ముందు కవిని గూర్చి కొంచెం ప్రస్తావన అవసరం.నన్నెచోడ మహారాజు కావేరీ తీరమున గల నొరయూరను పట్టణము రాజధానిగా చేసుకొని క్రీ.శ.940లో పాలించాడు. ఇతడు గోదావరి సింహళముల మధ్య గల ప్రాంతాన్ని పరిపాలించినట్లు తెలుస్తుంది. ఈ రాజు కవిరాజశిఖామణి అనే పేరును తానే స్వయంగా పెట్టుకున్నాడు. ఈ రాజునకు ఆత్మస్తుతి అనిన కాస్త ఇష్టం. అవతారపీఠికలో నున్న ఈ పద్యం వలన ఈ విషయం అర్థము కాగలదు. సూర్యవంశపు రాజులైన భగీరథుడు, రాఘవుడు మొదలైన పూర్వులతో తాను సమానమని తన కుమార సంభవంలో చెప్పుకున్నాడు. కుతలంబు నడు కొన గొలకొండగా నిల్పి/ శరనిధిగ్రొచ్చిరి సగరసుతులు/ మిన్నులపై బారుచున్నయే రిల తెచ్చి /వారాశి నించె భగీరథుండు/ గోత్రాచలము లెత్తి కొని వచ్చి కడ చన్న/ రత్నాకరము గట్టె రాఘవుండు/జలధి మహీపతి మొలనూలుగా జుట్టి/ పాలించె గరి గరి కాలచోడు/ గీ. వరుస నిట్లు సూర్యవంశాధిపతు లంబు/ నిధి య మేరా గాగ నిఖిలజగము/నేలి చనినవారి కెన వచ్చు సుశ్లాఘ ధనుడ నన్నెచోడ జనవిభుండ// ఈ పై పద్యం ద్వారా అతడు రాజులతో సమానమని చెప్పుకున్నాడు. క్రింది పద్యము ద్వారా కవితాను నొరయూర పురాధీశుడనని కథ చెప్పుకుని యున్నాడు. క. కలుపొన్న విరుల పెరుగం/ గలుకోడిరవంబు దిశలగలయగ జలగన్ / బొలుచు నొరయూరి కథిపతి/ నలఘు పరాక్రము డ డెంకణాదిత్యుండన్// ఈ పద్యము అద్భుతముగా కనబడుతున్నది. ఆ ఊరిలో రాతి పొన్న చెట్లు పువ్వులతో పెరుగుతున్న వట రాతి కోళ్ళు దిశలు మారు మ్రోగుతున్నట్లుగా కూయుచున్నవట ఆహా ఏమి మా ఊరి మహత్యము! పూర్వము ఆ చోళ రాజులు ఎవరో కావేరీ తీరమున తిరుచనాపల్లికి సమీపమున ఉన్న నొరయూరు రాజధానిగా రాజ్యపాలనము చేసినందున తర్వాత చోళరాజుల శాఖలోని వారందరూ ఒరయూరు పురా ధీశులమని చెప్పుకొనుట ఆచారమైనది. ఆ విధముగానే నన్నెచోడుడు చెప్పుకొనెను. కాని దీనికి ఎటువంటి ఆధారములు చరిత్రలో కనిపించుటలేదు. ఏది ఏమైనా ఇతడు తెలుగు కవి అనుటకు సందేహము లేదు. ఈయన కుమారసంభవంలో పండ్రెండు ఆశ్వాసములు, మరి కొన్ని కావ్యములను తెలుగులో రచించెను. కాళిదాసు సంస్కృతములో రాసిన కుమార సంభవమునకు ఇది అనువాదముకాదు. తెలుగులో రాసిన స్వతంత్ర రచన అని చెప్పవచ్చును.నన్నయకు ముందు వాడని కొందరు అనగా 1915-16 కాలము వాడంటారు. మరికొందరు నన్నయ కాలం నాటి వాడని చెబుతారు. ఇంకా నన్నయ తరువాత కాలంలోని వాడని కూడా విమర్శకులు వివరిస్తారు. ఈ కవి కాలాదులను నిర్ణయించుటకు తగిన ఆధారాలు లేవు. ఏది ఏమైనా క్రీ.శ. 940 మొదలు క్రీ.శ 1300 వరకు గల మధ్య కాలము వాడిని ఊగిశలాడుతూ చెప్పవలసి వస్తున్నది.మన తెలుగు సాహిత్యంలో గల ప్రాచీన కవులలో నన్నెచోడుడ మహారాజు ఒకరని చెప్పుటలో సందేహ పడ నవసరము లేదు. (ఇది 42వ భాగం) -బెహరా ఉమామహేశ్వరరావుసెల్ నెంబర్:9290061336


కామెంట్‌లు