ఈశ్వరమహల్ అలియాస్ రాధా టాకీసు-- భరద్వాజ రంగా వఝల - మేం కాకినాడ నుంచీ బెజవాడ మకాం మార్చినప్పుడు ... మాచవరం డౌను లో మా ఇంటి దగ్గర కుర్రాళ్లతో అప్పుడప్పుడే స్నేహం చేస్తూ వాళ్లు ఆడుతున్నాదొంగాట లో పాలు పంచుకుంటూండగా .మా నాయనమ్మ పిల్చి ఏరా సినిమాకెళ్తాం వస్తావా అని అడిగింది. నాకు బోల్డు హుషారొచ్చేసి ... వస్తానన్నాను. ఆవిడ త్వరగా రడీ అవు అన్నారు.నేను చాలా హడావిడిగా చొక్కా లాగూ వేసుకుని బయల్దేరేశాను. డౌను బస్టాపు దగ్గర రిక్షా ఎక్కి ఈశ్వరమహల్ కు పోనీ అందీవిడ. ఆ హాలులో అప్పుడు ఆడుతున్న సినిమా పేరు ఆది పరాశక్తి. కె.ఆర్. విజయ తెర మీద నటిస్తున్నారు . నాకు ఏడుపు తన్నుకొస్తోంది. ఇదెక్కడి సినిమారా అనుకుంటూ ఈ సినిమాలో ఫైట్లు ఉండవా అని అడిగాను మా నాయనమ్మని ...గొడవ చేయకుండా చూడు అని గసురుకుంది.పైగా నాకు టిక్కెట్టు కొనకపోవడంతో అని వార్యంగా ఆవిడ ఒళ్లో కాసేపు ... ఎదురు కుర్చీకి ఆనుకుని కొంచెం సేపూ సినిమా చూసే ప్రయత్నం చేశాను.అప్పటికి నేను రెండో తరగతి చదుతున్నప్పటికిన్నీ ... ఒళ్లో కూర్చోపెట్టుకుంటాను అని హామీ ఇచ్చి టిక్కెట్టు కొనలేదావిడ.మంచి ఆట నడుస్తుండగా ... ఈవిడ ఈ దిక్కుమాలిన సినిమాకు తీసుకొచ్చిందని నాకు చాలా కాలం పాటు ... కోపం ఉండేదావిడ మీద.అలా తొలి సారి ఈశ్వరమహల్ అనే థియేటరు చూశాను నేను.ఇదంతా 1971 - 72 ప్రాంతాల ముచ్చట.ఆ తర్వాత ఆ హాలు మూతపడింది.చాలా కాలానికి రాధా టాకీసు అనే పేరుతో తిరిగి తెరిచారు.అలా పునః ప్రారంభ సందర్భంగా వేసిన సినిమా కృష్ణ గారి కురుక్షేత్రం.అలా కొత్త సినిమాతో ప్రారంభమైన తర్వాత కొంత కాలం ఫస్టు రిలీజులు వేసేవారు.కృష్ణ నటించిన చెప్పింది చేస్తా లాంటి సినిమా ఈ హాల్లోనే విడుదలయ్యింది.తెలుగు వారికి అయ్యప్ప అనే దేవుణ్ణి పరచయం చేసిన స్వామి అయ్యప్ప సినిమా కూడా రాధా టాకీసులోనే విజయోత్సవాలు జరుపుకుంది.అయితే ఆ తర్వాత నెమ్మదిగా కొత్త రిలీజులు ఆగిపోయి సెకండ్ రిలీజులు ఈ థియేటర్ లో వేసేవారు.విశ్వనాథ్ తీసిన కాలం మారింది, శారద లతో పాటు చాలా పాత సినిమాలు ఈ హాలులో చూశాను నేను.ఆ తర్వాత ఉన్నట్టుండి ఓ శుభముహుర్తాన రాధా టాకీసు రూటు మార్చింది.వరసగా మళయాళ డబ్బింగులతో పాటు ఇంగ్లీషు బూతు చిత్రాల ప్రదర్శన మొదలైంది.అప్పటి వరకు రాదా టాకీసును నమ్ముకుని పాత సినిమాలు చూస్తూ కాలక్షేపం చేసిన సత్యనారాయణపురం ప్రేక్షకులకు ఈ మార్పు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.ఇలా కొంత కాలం నడిచిన తర్వాత మళ్లీ రాధా టాకీసు తన తప్పు దిద్దుకుని పాత సినిమాలు ఆడడం మొదలెట్టింది.బెజవాడలో రిక్రియేషన్ కు మరో అవకాశం లేకపోవడంతో సినిమాల మీదే జనాలు ఎక్కువగా ఆధారపడ్డారనీ అలా అది సినిమా రాజధాని అనే పేరు సంపాదించుకుందనీ కూడా అంటారు.ఇలా ఉండగా ..వైఎస్ రాజ్యం చేస్తున్న రోజుల్లో ఓ సారి బెజవాడ వెళ్లాను.ఊర్వశీ ఎదురుకుండా ఉండే కూల్ డ్రింకు షాపులో సుగంధి పాలు తాగడం నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ బెజవాడ వెడితే ఎలాగోలా బస్సెక్కేలోగా ఆ సెంటరుకు వెళ్లి సుగంధి పాలు తాగి వస్తాను.అలాగే అప్పుడూ ఊర్వశీ సెంటరుకు వెళ్లాను.సుగందిపాలు తాగుతూ తలదిప్పి చూస్తే రాధా టాకీసు పగలకొట్టేస్తున్నారు.అయ్యో అనిపించింది.చాలా కాలం పాటు అటు పెద్దల్నీ ఇటు పిల్లల్నీ మరో వైపు కొద్దికాలమే అయినా యవ్వనులనీ మురిపించిన రాధా టాకీసు పగలగొట్టేయడం కొంచెం బాధనిపించింది.


కామెంట్‌లు