43. నా మొదటి గేయకథ:--కథను గేయ రూపంలో చెబితే అది గేయకథ అవుతుంది. గేయ లక్షణాలతోనే చరణాలు సాగుతుంటాయి.కథ ఆ చరణాల వెంబడి నడక సాగిస్తోంది. బాలజ్యోతి ,తెలుగు విద్యార్థి, వారపత్రికలలో గేయకథలు ఆ రోజుల్లో ఇస్తుండే వారు.బాలజ్యోతి లో గేయకథను రంగు రంగులబొమ్మలతో ప్రచురించేవారు.గేయానికి కూడా బొమ్మ వేసేవారు. గురుతుల్యులనదగిన శ్రీ పాయల సత్యనారా యణ , శ్రీ అలపర్తి వెంకటసుబ్బారావు, శ్రీ ఈదుబిల్లి వేంకటేశ్వర రావు, కవిరావు,డా.మహీధర నళినీ మోహన్ గారల గేయకథలు బాలజ్యోతి పత్రికలో తరచుగా వస్తుండేవి.అవి చదివి స్ఫూర్తి చెందాను.ఆ రోజులలోనే శ్రీ మసూనా గారి బాలప్రపంచం గేయాలు ఆయన రచించిన గేయకథలు చదివాను. మసూనా గారి బాలప్రపంచం గేయసంపుటి జాతీయస్థాయిలో బహుమతి అందుకుంది. శ్రీ తాళ్ళపూడి వెంకట రమణ గారి గుజ్దనగూళ్ళు గేయసంపుటి చదివాను. తెలుగు విద్యార్థి లోవస్తుండే శ్రీ రెడ్డి రాఘవయ్య గారి గేయకథలు పరిశీలిస్తుండేవాడను.గేయాలు రాయగలుగుతున్నాను.పత్రికలలో అవి వస్తున్నాయి. ఆ ఆత్మవిశ్వాసం తో గేయకథకుసిద్ధపడ్డాను.కథ కుదరాలి.గేయం లా నడవాలి.మూడు నాలుగు సార్లు తిరిగి రాస్తే గాని గేయకథ తయారు కాలేదు. అది రాసే సమయంలో కొత్త వలస పురపాలక సంఘ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్నాను.గేయకథ పిల్లలకిచ్చి చదివించాను.వారు పలకలేని పదాలను అర్థం చేసుకోలేని పదాలను మార్చి గేయకథను బాలజ్యోతి కి పంపించాను. వారం పది రోజుల్లో గేయకథ ప్రచురణకు అంగీకరించామని బాలజ్యోతి నుంచి కార్డు అందింది.అమ్మయ్య! గేయకథను గెలిచాననుకున్నాను.అదే నా మొదటి గేయకథ. పేరు: సుబ్బిశెట్టి - బంగారం. //రామవరము లోన కలడు/సుబ్బిశెట్టి అనే అతడు/బంగారం అమ్ముచూను/కోట్లు కోట్లు గడించేను//ఎంత డబ్బు ఉన్న నేమి?/పేదలన్న మిగుల రోత/పేదవాళ్ళు అనగానే/చులకనగా చూడ సాగె!//ఒక రోజున సుబ్బిశెట్టి/వ్యాపారం చేయబూని/పసిడి తోడ పోవుచుండె/ఓడ నెక్కి సంద్రమున!//సగము త్రోవ దాట లేదు/హోరుమని తుఫాను వచ్చె/అలల దెబ్బ తగిలి ఓడ/ముక్కలు గా చీలిపోయె!//అదృష్టం బాగుండీ/పడవ ముక్కసాయంతో/సుబ్బిశెట్టి ఒడ్డు చేరె/బంగారం పెట్టె తోడ!!//ఉప్పు నీటి దెబ్బ తోను/ఒడలంతా నొప్పులాయె!/కదల శక్తి లేక పోయి/ఒడ్డునతడు మూర్ఛపోయె!//ఘడియ లెన్నో గడిచెనంత/ సుబ్బిశెట్టి మేలుకొనియె/చుట్టు నున్న మనుజులను/ అచ్చెరువున చూడ సాగె//ఒడలునిండ గుడ్డ లేక/దీనముగా కనిపించిన/చుట్టు నున్న వారి నెల్ల/పేదలుగా తలపోసెను//కీడునంత మదిని తలచి/బంగారం ! బంగారం!!/అనుచు గోల పెట్టె నతడు/లేవబోయె కష్టపడుతు//కాలు కదప లేక పోయె/చేయి తీయ లేక పోయె/ఉస్సురనీ కూలి పోయె/నొప్పులతో సోలిపోయె// సుబ్బిశెట్టి మనసు నెరిగి/చుట్టు నున్న వారంతా/మూలనున్న పెట్టె తెచ్చి/లోన ఉన్న పసిడి జూపె//"బంగారం భద్రమయ్య!/మా వలన వెరవకయ్య/బ్రతుకులకు బీద గాని/గుణములకు పేద కాదు!"నీదు పసిడి మాకు వద్దు/నీదు బాగు మాకు చాలు/కోలు కొనుము వేగరమున/పసిడి తోడ పోదువులే!//ఆ మాటలు విని శెట్టి/అమితముగాసిగ్గు పడియె!/నాటి నుండి బీదలను/చులకనగా చూడమానె!//(బాలజ్యోతి మార్చి 1983)ఆ నెల బాలజ్యోతి లో గేయకథవచ్చిందని నాకు తెలియదు.ఎప్పటిలా పుస్తకం కొని పేజీలు తిరగేశాను.నా గేయకథ కనిపించింది.10 బొమ్మలు వేశారు. అవి రంగుల చిత్రాలు!నాకళ్ళు జిగేల్ మన్నాయి!నా ఆనందం చూసి పుస్తకాలు అమ్ముతున్నతను మీ కథ పడిందాఅని అడిగారు.ఔనన్నాను.గేయకథ పేజీలుచూపించాను.ఇది చదివాను బాగుంది అన్నారు. ఆ మధ్య వచ్చిన ఇద్దరు దొంగలు కథ కూడాబాగుంది అని అన్నారు. ఆయన అప్పటి నుంచి మిత్రులయ్యారు.నా శ్రేయోభిలాషు లయ్యారు.నా ప్రతి రచన చదివి సద్విమర్శ చేసేవారు. ఆయనపేరు అనంతపంతుల సామవేది! తెలుగు సాహిత్యంలో ప్రముఖ కవులుగా ప్రసిద్ధి కెక్కినశ్రీ అనంతపంతుల రామలింగ స్వామి గారిసోదరుని కుమారుడు!ఇదండీ నా మొదటిగేయకథ వివరాలు!!(సశేషం) బెలగాం భీమేశ్వరరావు 9989537835


కామెంట్‌లు