సోమసుందరం గ్రౌండ్ వైఎస్ సిఎ క్రికెట్---మనం అప్పుడప్పుడూ పత్రికలలో చదువుతుంటాం కదూ కూతవేటుదూరంలో అనే మాట....అవును అలాంటి కూతవేటుదూరంలోనే నా చిన్నప్పుడు మా ఇంటికి అతి సమీపంలో ఓ గ్రౌండ్ ఉండేది. దాని పేరు సోమసుందరం కార్పొరేషన్ గ్రౌండు. తిలక్ స్ట్రీటుకి దగ్గర్లో ఉన్న గ్రౌండుకి అటూ ఇటూ ఉన్న వీధులు రాజాచారి స్ట్రీట్. సోమసుందరం స్ట్రీట్. హనుమంత్ స్ట్రీట్. రామా స్ట్రీట్. మద్రాసు నగరంలో ఉన్న మైదానాలలో దీనికంటూ ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రౌండుకి చుట్టుపక్కలున్న యువకులందరూ ఇక్కడికి వచ్చి ఆట్లాడుకోవడాలు సర్వసాధారణం. ఈ మైదానంలో క్రికెట్ ఆడటానికున్న పిచ్ లు చాలానే ఉన్నాయి. ఇవికాక బాస్కెట్ బాల్ కోర్ట్, ఫుట్ బాల్ ఆడేందుకు చోటు, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ ఆడేందుకు ప్రత్యేక కోర్టులున్నాయి. పిల్లలు ఊగేందుకు ఉయ్యాలలు, కిలికూండు (తెలుగులో ఏమంటారో నాకు తెలీదు), సీసా వంటివాటితోపాటు శారీరక వ్యాయామాలు చేసుకోవడానికి కూడా అవసరమైన ఏర్పాట్లున్నాయి. బరువులెత్తడాలు, రోమన్ రింగ్స్, పులప్స్ వంటివి ఉన్నాయి. సెలవురోజుల్లో ఈ మైదానం కిటకిటలాడుతుంటుందనడం అతిశయోక్తి కాదు.నేను క్రమం తప్పకుండా ఇక్కడికి వెళ్ళి మిత్రులతో క్రికెట్ ఆడుతుండేవాడిని.చాలా మందికి సోమసుందరం గ్రౌండనేది రెండో ఇల్లులాగే. నాకీ గ్రౌండులో హీరో కృపా అనే క్రికెటర్. ఆయన రిజర్వ్ బ్యాంకులో పని చేసేవారు. గ్రౌండు ఎదురిల్లే ఆయనది. బ్యాటింగ్ బాగా చేసేవారు. కృపా మ్యాచ్ ఆడుతున్నారనో తెలిస్తే మిస్సవకుండా చూసేవాడిని. ఆయనకెందరభిమానులో ఉండేవారు.అయితే ఈ గ్రౌండుని వేదికగా ఎం.ఎస్. గురుమూర్తి అనే తెలుగతను యంగ్ స్టార్స్ క్రికెట్ అసోసియేషన్ స్థాపించి ఓ నాలుగు జట్లని గుర్తు... సీనియర్స్ జూనియర్స్ గా ఈ జట్లలో చేర్పించి తర్ఫీదు ఇచ్చేవారు. వైఎస్ సిఎ బాగా ప్రసిద్ధి చెందిన పేరు. గురుమూర్తి మొదలుపెట్టిన వైఎస్ సిఎ అనేది స్కూలులాగే. అటెండన్స్ తీసేవారాయనే. ఆయన దగ్గర ఆడితే భవిష్యత్తు బాగుంటుందనడంతో నేను మా పక్కింట్లో ఉండిన లక్ష్మణ్ ద్వారా గురుమూర్తి క్రికెట్ స్కూల్లో చేరాను. లక్ష్మణ్ అప్పటికే ఆయన జట్టులో ఆడుతున్నాడు. టైమ్ కచ్చితంగా పాటించేవారు. ఆదివారాలు మ్యాచ్ లు ఉండేవి.ఓ వారం రోజులు బాగానే వెళ్ళాను. కానీ ఒక రోజు వెళ్ళడం కుదరలేదు. ఎందుకు రాలేదో లెటర్ ఒకటి రాసి తీసుకురమ్మన్నారు. పైగా మా నాన్నగారితో సంతకం చేయించి తీసుకురావాలనేసరికి అటువైపు వెళ్ళడం మానేశాను. మళ్ళీ నాకంటూ ఉన్న మిత్రులతో క్రికెట్ ఆడుతూ వచ్చాను. గురుమూర్తిని "గురు"గా బాగా ప్రసిద్ధి. ఆయన పర్యవేక్షణలో తమిళనాడు రాష్ట్రం తరఫున ఆడిన క్రికెటర్లున్నారు. టి.ఎ. శేఖర్ అనే ఫాస్ట్ బౌలర్ భారత క్రికెట్ జట్టుకి ఆడారు. శేఖర్ మా రామాకృష్ణ మిషన్ మెయిన్ స్కూల్లోనే చదువుకున్నాడు. అతను తమిళ మీడియంలో చదివాడు. నేను తెలుగు మీడియంలో చదివాను. ఇద్జరం ఒకటే ఏడాది ఎస్ ఎస్ ఎల్ సీ రాసి ప్యాసయ్యాం. తర్వాతి రోజుల్లో శేఖర్ ఎఫ్ ఫౌండేషన్ ప్రతినిధిగా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీతో కలిసి బౌలింగ్ లో మెళకువలు నేర్పించే వాడు.గురు నేతృత్వంలో ఆడి పైకెదిగిన ఎస్. సురేష్ అనే అతను తమిళనాడు థంజీ జట్టుకు కెప్టన్ అయ్యాడు.వి. సురేష్ అనే ఐతను కూడా గురు జట్టు నుంచి ఎదిగిన వాడే. అతను ఫ్యూచర్ స్టార్స్ క్రికెట్ అకాడమీకి కోచ్ అయ్యాడు. ఎన్. గౌతం అనే యువకుడు ఈ సోమసుందరం గ్రౌండ్లో క్రికెట్ ఆడినవాడే. ఇతను కొంతకాలం తమిళనాడుకి, కొంతకాలం గోవా జట్టుకీ ఆడాడు. ఇతనూ గురు జట్టులో తర్ఫీదు పొందినవాడే.గురు క్రికెట్ స్కూల్లో ఆడితే ఆటతోపాటు క్రమశిక్షణకూడా అలవడేది.గురు తను స్థాపించిన వైఎస్ సిఎ పేరిట ఓ క్రికెట్ టోర్నమెంటునీ భారీ ఎత్తున నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ క్రికెటర్లు పాల్గొనడం విశేషం. టీ. నగర్లో ప్రత్యేకించి సోమసుందరం గ్రౌండ్ కేంద్రంగా చేసుకుని గురుమూర్తి ఎందరినో మంచి ప్లేయర్లుగా తీర్చిదిద్దారు.- యామిజాల జగదీశ్
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి