మానేరు ముచ్చట్లు-రామ్మోహన్ రావు తుమ్మూరి . -నాలుగవ నిజామ్ నసీరుద్దౌలా ఆసఫ్జా అనంతరం గద్దెనెక్కిన అతని కుమారుడు అఫ్జలుద్దౌలా ఆసఫ్జా V క్రీ.శ.1857 నుండి క్రీ.శ.1869 వరకు పాలించాడు.ఇతడు అధికారంలోకి వచ్చి నెలరోజులు దాటిందో లేదో ఉత్తర భారతదేశంలో ఆంగ్లేయులచే సిపాయిల తిరుగుబాటుగా పేర్కొనబడ్డ ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామమ మొదలైంది.అది ఔరంగాబాద్ ,హైదరాబాదులకు కూడా వ్యాపించింది.ఔరంగాబాద్ లో చీతాఖాన్ నాయకత్వంలో కొందరు తిరుగుబాటు వీరులుఆంగ్లేయులనుండి తప్పించుకొని, అఫ్జలుద్దౌలాను ఆశ్రయించగా, దివాన్ సాలార్జంగ్ I సలహా మేరకు వారిని ఆంగ్లేయులకు అప్పగిస్తాడు.వారిని ఆంగ్లేయులు అప్పటి వారి స్థావరమైన రెసిడెన్సీ (ఇప్పటి ఉమెన్స్ కాలేజీ) లో బంధిస్తారు. వారిని విడిపించడానికి స్ధానిక రొహిల్లా వీరుడు తుర్రేబాజ్ ఖాన్ మహమ్మదు అలీఖాన్ సహాయంతో రెసిడెన్సీ మీద దాడి చేస్తాడు.ఆంగ్లేయుల మరఫిరంగు ల దాడికి చాలా మంది బలి కావడం చూసు తుర్రేబాజ్ ఖాన్ తప్పించు కుంటాడు.అతని అరెస్టుకు ఆజ్ఞలు జారీ అవుతాయి. తుర్రేబాజ్ ఖాన్ మారువే షంలో తప్పించుకొని బెంగుళూరు వెళ్లే దారిలో అతని కంటి క్రింది మచ్చను చూసి మహబూబ్ నగర్ పోలీసులు కాలికి గాయం చేసి బంధిస్తారు.ఆ తరువాత హైదరాబాదులో జైలులో నిర్బంధించి అండమాన్ జైలుకు పంపించాలని నిర్ణయిస్తారు.ఈలోగా అతడు జైలునుండ తప్పించుకునే ప్రయత్నంచేయగా దారుణంగా కాల్చి చంపుతారు.తుర్రేబాజ్ ఖాన్ బేగంబజార్ కు చెందిన రుస్తుం ఖాన్ కొడుకు,ఆంగ్లేయుల క్రైస్తవ ప్రచారానికి వ్యతిరేకంగా నడిచే ’వాహబీ’ ఉద్యమ ప్రభావం అతని పైన అదివరకే ఉన్నది.దాని ప్రభావంతోనే రోహిల్లా నాయకుడుగా ఎదిగాడు తుర్రేబాజ్ ఖాన్.ఇది ఇలా ఉండగా అక్కడ ఢిల్లీలో ఆంగ్లేయులు తమ సైనిక బలంతో తిరుగుబాటు దారుల నణచివేసి మొగలు చక్రవర్తిని ఓడించి బందీని చేసి దేశాన్ని తమహస్తగతం చేసుకుంటారు. అఫ్జలుద్దౌలాను స్వతంత్రుణ్ని చేసి బహదూర్ షా పేరును నాణెములపై తొలగించమంటారు.అంతవరకు మొగలు చక్రవర్తుల సుబేదారులుగా ఉన్న నిజాములు హైదరాబాదు నవాబులయ్యారు. కుత్బా నిజాంపేరిట చదవటం ఐదవ నిజాముతో మొదలవుతుంది.ఇతని కాలములో దివాన్ సాలార్జంగ్ I నిజాము రాజ్యాన్ని ఐదు సుబాలుగా,పదహారు జిల్లాలుగా విభజించాడు.అఫ్లలుద్దౌలా పేరుమీద అఫ్జల్ గంజ్ బజారు, అఫ్జల్ గంజ్ మసీదు, అఫ్జల్ గంజ్ బ్రిడ్జి నిర్మించ పడ్డాయి .సాలార్జంగ్ I మూసీపై చాదర్ ఘాట్ వంతెన నిర్మించాడు.ఈ సమయంలోనే క్రీ.శ.1858 కాళయుక్తి నామ సంవత్సర కార్తీక బహుళదశమి మంగళవారం ధర్మపురి దేవాలయాన్ని రోహిల్లాలు నానా భీభత్సం చేసి ధ్వంసం చేయడం బాధాకరమైన విషయం.నాటి ప్రజల ఆక్రందలను లను,పరిస్థితులను రోహిల్లా పాట లో ధర్మపురి నృసింహ కవి రూపుగట్టాడు.గ్రామీణ ప్రాంతాల్లో అప్పట్లో సరియైన భద్రత ఉండేది కాదని ఈ ఉదంతం తెలియజేస్తున్నది.క్రీ.శ:1869లో అఫ్జలుద్దౌలా మరణానంతరం బాలుడైన మీర్ మహబూబలీఖాన్ ను ఆసఫ్జా VI గా సింహాసనం మీద కూచోబెట్టాడు దివాన్ సాలార్జంగ్ I.క్రీ.శ.1883 లో సాలార్జంగ్ మరణించాడు. అంత దాకా అతను దివాను గా ఉండి రాజ్యవ్యవహా రాలు చూసుకున్నాడు.ఆరవ ఆసఫ్జా కాలంలో సాలార్ జంగ్ దివాన్ గా ఉన్న సమయంలో ఎలగందుల ఖిలేదారుగా ఉన్న మునవ్వర్ ఖాన్ మరణిస్తాడు.అతని కుటుంబం హైదరాబాదు మొగల్పురాలో ఉండేది.మునవ్వర్ ఖాన్ కు సంతానం లేకపోవడంతో అతని భార్యఎలగందుల బాధ్యతలను స్వీకరించే తనవారెవరూ లేరని సాలార్జంగ్ నిర్ణయానికి వదిలేసింది ఆమె కుటుంబానికి భరణం ఏర్పాటు చేసి ఎలగందుల సర్కారును నైజాం ఖాల్సాలో కలిపివేసాడు. అంతటితో ఎలగందులలో సర్కారుల పాలన అంతమై తాలుక్ దార్ల చేతిలోకి వచ్చింది.సాలార్జంగ్ మరణానంతరం అతని కుమారుడు మీర్ లాయక్ అలీ సాలార్జంగ్ II ఆరవ నిజాము కు దివానుగా నియమితుడౌతాడు. క్రీ.శ.1885 లోబ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ హైదరాబాదుకు వచ్చి మహబూబలీఖాన్ కు సంపూర్ణ పాలనాధికారాలు ఇస్తాడు.ఆ సమయంలో ఆరవనిజాం మీర్ మహబూబలీఖాన్ తన రాజ్యములోని కోటి మంది ప్రజలకు సుఖశాంతులు కలిగే విధంగా పాలిస్తానని ప్రకటించా డట. కాని అంతర్గత కుట్రలవల్ల క్రీ.శ. 1887లో రెండవ సాలార్జంగ్ తన పదవికి రాజీనామా చేస్తాడు. (సశేషం)


కామెంట్‌లు