ఉదయరాగం--- రామోమోహన్ రావు తుమ్మూరి చీకటి గర్భం నుండి ఉషస్సు వెలుగుల సంకేతాలతో ఉదయ దిశను సూచించడం మరో కొత్త జీవితపు నాంది లేలేత కిరణాలతో ఆకసం వాకిలిపై ఎగబాకుతున్న అరుణబాలుడు నిన్ను నీ బాల్యానికి లాగుతూ తాను వెలుగు నిచ్చెన లెక్కుతూ నీ నిక్కరు బాల్యం నుండి నిన్ను నూనూగు మీసాల/లేలేత కౌమారానికి కదిలిస్తూ నట్టనడి ఆకాశంలో నిలబడి నీ నీడను నీ కాలికిందకు తెచ్చే నిండు యౌవనదశలో నీ ఘర్మజలసిరిని నీ బాధ్యతా భార తాపాన్ని నీ శ్రమజీవన సౌందర్యాన్ని నీకు చూపిస్తూ వంగిన ఆకాశం నుండి అవరోహిస్తూ తనతోపాటు నిన్నూ విరామకేంద్రానికి తీసుకెళుతూ పండుబారిన మలిసంజ మననతీరంలో ఆగి పలు రంగుల నీ జీవనగ్రంథ పుటల్ని నీ చే తిరగేయిస్తూ బడలిన దేహాన్ని కడిగేందుకు పడమటి కడలిలో దిగుతూ నీకు రేపటి చుక్కల చూరును చూపించి వెన్నెల జోలను ప్రసాదించి నీ జీవితానికి మరో ఉదయాన్ని తొడగటానికి మరో హృదయాన్ని పొదగడానికి మళ్లీ తూరుపు సంద్రంలో బాలార్కుడై జన్మించడానికి నిష్క్రమిస్తూ ప్రతిరోజూ ఒకజీవిత కాలపు ప్రతీకగా నిలుస్తూ.........


కామెంట్‌లు