జయతీర్ధుని ధ్యానం---సుజాత.పి.వి.ఎల్.:--మంచాల గ్రామంలో జయతీర్ధుడనే భక్తుడుండేవాడు. అపార శ్రీ కృష్ణ భక్తుడైన జయతీర్ధుడు నిత్య తుంగభద్రా నదిలో స్నానమాచరించి స్వామికి కండ చక్కెరను , తులసీదళాలను సమర్పిస్తుండేవాడు. ఒకరోజు స్నానం ముగించు కున్న జయతీర్ధుడు చేతిలో ఉన్న కండచక్కెరను పక్కన పెట్టి తులసి దళాలను తుంచుకుని, క్రిష్ణుడిి ధ్యానం లో చక్కెరను అక్కడే మరచి పోయి, తులసి దళాలను మాత్రమే పూజకు తీసుకెళతాడు. అప్పుడు జయతీర్ధుడి ముందు ప్రత్యక్షమైన శ్రీ కృష్ణుడు, '' జయతీర్దా! ప్రతిరోజూ చక్కెర తెచ్చే నీవు, ఈ రోజు ఎందుకు తీసుకు రాలేదు? '' అని అడిగాడు.స్వామి దర్శనంతో పరవశుడైన జయతీర్ధుడు , 'అపచారం జరిగిపోయింది స్వామీ..నన్ను క్షమించండి, చక్కెర మరచి వచ్చాను ఇప్పుడే తీసుకొస్తాను'' అని పరుగు పరుగున ఆ వైపుకు వెళ్ళబోయాడు. ''జయా...నువ్వు మరిచావని తెలిసి, నేనే అక్కడకు వెళ్లి తిని వచ్చానులేి'' అన్నాడు స్వామి.'నాది ఎంత భాగ్యం స్వామీ! ఇన్నాళ్లకు నాపై దయ కలిగిందా?' అని కన్నీళ్ల పర్యంతమయ్యాడు జయతీర్ధుడు. 'పిచ్చివాడా! చక్కెర తీసుకు రావడం మరిచావంటే నాలో పూర్తిగా ఐక్యమయ్యావని అర్థం..నేను తప్ప నీకు వేరే ఆలోచన లేదని అర్థం. బాహ్య ప్రపంచాన్ని మరిచి నన్ను ధ్యానించావు. నన్నే సర్వస్వంగా తలచావ్. అంతకు ముందు నువ్వు చేసిన ధ్యానం సామాన్యం. అందుకే నా దర్శనం ఆలస్యమైంది.' అని చెప్పి శ్రీకృష్ణుడు అదృశ్యమయ్యాడు. 'ధన్యుడనయ్యాను స్వామీ' అనుకుంటూ పరమానంద భరితుడయ్యాడు జయతీర్ధుడు.


కామెంట్‌లు