అలెగ్జాండర్--గ్రీకు వీరుడు అలెగ్జాండర్ వీరుడిగా ఎదగడానికి తోడ్పడింది అతని గురువైన అరిస్టాటిల్. అలెగ్జాండర్ తల్లిదండ్రులది నేటి పరిభాషలో చెప్పుకోవాలంటే కులాంతర వివాహం. ఇద్దరిదీ వేర్వేరు తెగలు. వారికి పుట్టిన అలెగ్జాండరుని అందరూ హేళన చేసేవారు. అతని పుట్టుక సక్రమమైనది కాదని. దాంతో అతను ఇంట్లో నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలిసి గురువైన అరిస్టాటిల్ అక్కడకు వెళ్ళి అలెగ్జాండరుని ఓదారుస్తాడు. ఎవరో ఏదో అన్నారని ఇలా ఉన్న ప్రదేశాన్ని విడిచిపెట్టి రావడం సరికాదంటాడు. అప్పుడు అలెగ్జాండర్ మనసులోని బాధనంతా చెప్పుకుని కుమిలిపోతాడు. అయితే అరిస్టాటిల్ ఊరుకోడు. ఎన్నో రకాలుగా నచ్చచెప్పి వెనక్కు తీసుకొస్తాడు. అంతేకాకుండా అలెగ్జాండర్ కళ్ళు తెరిపించాలనుకుంటాడు. భారీ ఎత్తున జరిగే ఓ విందుకి అలెగ్జాండరుని తీసుకుపోతాడు అరిస్టాటిల్. అక్కడి విందులో అరిస్టాటిల్ ఓ పాత్రలో ఓ రకమైన పండ్లుంచి అందరికీ వడ్డించమంటాడు. అలాగేనని అలెగ్జాండర్ అందరికీ ఆ పండుని ఇస్తుంటే అధికశాతం మంది ఆ పండుని అసహ్యించుకుంటారు. తమకక్కర్లేదంటారు. ఇదంతా ఒక కంట గమనిస్తున్న అరిస్టాటిల్ అలెగ్జాండరుని దగ్గరకు పిలిచి ఏమీ తెలీనట్లు అతిథులందరికీ ఆ పండు నచ్చిందా? ఏమన్నారు అని అడుగుతాడు. అంతట అలెగ్జాండరు "అత్యధికులు ఈ పండుని ఛీఛీ అంటూ తోసిపుచ్చారు" అంటాడు. అప్పుడు అరిస్టాటిల్ అంటాడు..."ఓ మంచి పండునే అంతమంది అసహ్యించుకుంటే ఒక వ్యక్తిని అందరూ మెచ్చుకోవాలనో ఇష్టపడాలనో అనుకోవడం అత్యాశేగా. కొందరికి ఇష్టమైన వారు మరికొందరికి నచ్చకపోవచ్చు. ఆ ఇష్టంలేనివారికి ఇంకొకరు నచ్చొచ్చు. అందరికీ అందరూ నచ్చాలనేమీ చట్టం లేదుగా. కనుక నువ్వు ఎవరో ఏదో అన్నారని ఇల్లు విడిచిపెట్టి దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనవసరం. ఇది నీ దేశం. నువ్వు ఏదీ పట్టించుకోకుండా పైపైకెదిగి నీ శక్తిసామర్థ్యాలను నిరూపించుకోవాలి" అని అరిస్టాటిల్ చెప్పిన మాటలతో అలెగ్జాండర్ కళ్ళు తెరుస్తాడు. వీరుడిగా ఎదుగుతాడు. అనేక రాజ్యాలు గెలిచాడన్నది చరిత్ర. కనుక ఎవరో ఏదో అన్నారని అనుకుంటున్నారని డీలా పడటం సరికాదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. అది గుర్తెరిగి ఎదగాలి. మనమేంటో రుజువు చేసుకోవాలి - యామిజాల జగదీశ్


కామెంట్‌లు