తెలుగు సాహితీ చరిత్రలో ప్రముఖ గ్రంథమైన రంగనాధ రామాయణమును రచించి వినుతికెక్కిన కవి గోనబుద్ధారెడ్డి. ఇతనికి ఇరువురు కుమారులు. వారే కాచవిభుడు, విఠ్ఠల రాజు. వీరు పదమూడవ శతాబ్దానికి చెందినవారు. వీరు తండ్రివలె పేరు ప్రఖ్యాతలు గడించక పోయినా వారి తండ్రి ఆజ్ఞానుసారం సాహిత్య రచన కొనసాగించినట్లు చారిత్రక ఆధారాల వలన తెలియుచున్నది. తమ తండ్రి పైన గౌరవముతో వీరు ఉత్తరరామాయణమును ద్విపద కావ్యంగా రచించారు.ఈ విషయం గ్రంథాదియందున్న పీఠిక వలనతెలియు చున్నవి. ద్విపద:- కోనకులార్ణవకువలయేశుండు/ నా నొప్పుకోటగన్న క్షితీంద్రునకు/ ననఘాత్మయగుచున్న యన్నమాంబికకు/ దనయుండు బుద్ధాభిధానుండు పనుప/ నారయ మత్స్య కూర్మాది దివ్యావ/ తారంబులం దెల్ల దలంచి చూడంగ/ రామావతారంబు రమణీయ మగుట/ రాము పావన చరిత్రము దివ్య భాష/ లోకాలను రంజన శ్లోకబంధముల జేకొని వాల్మీకి చెప్పిన జాడ/ మా తండ్రి బుద్ధక్షమానాథు పేర/ ‌ నాతతన్రుపకైఘరవాప్తుని పేర/ ఘనుడు మీసరగండకాచవిభుండు/ వినుతశీలుడు పినవిఠలభూపతియు/ నని జనుల్ మము గొనియాడంగ మేము/ వినుతనూతన పద ద్విపద రూపమున/ బ్రాకటంబుగ నాంధ్ర భాషను జెప్ప/ గైకొన్న యుత్తర కథ యెట్టి దనిన/ ఈ కావ్యము యొక్క కవనిక సరళి రంగనాథ రామాయణమును పోలియున్నది కావున యీఉత్తరాకాండమును రంగనాథుడే రచించినట్లు అనిపిస్తుంది. పూర్వ కాండములకు బుద్ధరాజునుక్రృతి కర్తగా చేసినట్లే, దీనికి అతని పుత్రులనుక్రృతి కర్తలుగా చేసి యుండవచ్చునని భావింప వలసి వస్తుంది. కాని సరియైన ఆధారాలు లేకుండా యిట్లనిచెప్ప తగదు కదా! ఈ క్రింది ఉదాహరణల ద్వారా పుస్తకం యొక్క కవిత్వం శైలిని అనుసరించి తెలుపుటకు అవకాశం కలదు. ద్విపద:- అంతట రంభయు నంభోజసరసి/ దంతి చొచ్చినచొప్ఫు తనకు బాటిలిన/ జింతాపరంపర చిత్తంబులోన/ నంతకంతకు దట్టమైన కడ ల్కొనగ/ దలకుచు గొంకుచు దనలోన దానె/ పలుకుచు బులిబారి బడి వడి చెడిన/ హరిణిచందంబున నట దొట్రుపడుచు/ బిరిగొన్న దురవస్థ బ్రియుపాలి కరిగి/ యడుగుల బడి లేచి యందంద మేను/ వడకంగ వదనంబు వంచి హారములు/ పెనగొన గనయంబు ప్రిదులలో జెరివి/ గొనిన పూవులు గంద గ్రొమ్ముడి వీడ/ దొంగలిరెప్పల దోగుబాష్పములు/ తుంగ స్తనంబుల దొరుగ నట్లున్న/ గనుగొని యిది యేమి కాంతి నీచింద/ మనవుడు నాలేమ హస్తములు మొగిచి/ నడుకుచు నా పల్కు నాల్కకు రాక/ కడుదూలి గద్గదకంఠయై పలికె/ నేను నీయొద్దకు నేతేర నింద్రు/ పై నెత్తి పోవుచు బంక్తి కంధరుడు/ సేనతో గలధౌతశిఖరిపై విడిసి/ తా నందు నను గాంచి దర్పాంధు డగుచు/ నేను గోడల నన నిరియంగ బట్టి/ నాని దూలగ బిట్టు నను గాసి చేసె/ గావున నీతప్పు గావంగ దగదు/ నావుడు నలిగి యానలకూబరుండు// కాచవిభుడు, విఠ్ఠల రాజులిరువురూ రచించిన ఉత్తర రామాయణ కథలో శైలి తెలియగలందులకు పై ద్విపదలు ఉదహరించడం జరిగింది.వీరు వ్రాసిన ఇతర రచనలు కానరాక పోవడం వలనకేవలం సామాన్య కవులుగానే చరిత్రలో నిలిచారు. (ఇది 48వ భాగం) -బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబర్: 9290061336


కామెంట్‌లు