అత్యాశకు పోతే (కథ) సరికొండ శ్రీనివాసరాజు: --రామయ్య ద్విచక్ర వాహనం మీద అత్యవసర పనిపై వేరే ప్రాంతానికి వెళ్తున్నాడు. హఠాత్తుగా ఒక కోడిపిల్ల భయంతో ముందుకు వచ్చి, రామయ్య వాహనం వెనుక టైర్ క్రిందపడి చనిపోయింది. అల్లంత దూరంలో గుండెలు బాదుకుంటూ, ఏడుస్తూ నాగయ్య అనే వ్యక్తి రామయ్యను ఆపినాడు. "అయ్యో! నా బంగారం లాంటి కోడిపిల్లను పొట్టన పెట్టుకున్నావు. నాకు నష్ట పరిహారాన్ని చెల్లించాల్సిందే!" అని మరింత గట్టిగా ఏడ్చాడు. రామయ్య 50 రూపాయలు చేతిలో పెట్టాడు. నాగయ్య కోపంతో ఊగిపోతూ "ఏమిటీ! నాకు బిక్షం వేస్తున్నావా? ఈ కోడిపిల్ల పెద్దదై ఎన్నో గుడ్లు పెట్టేది. ఆ గుడ్ల నుంచి వచ్చిన కోడిపిల్లలు పెద్దవై మరిన్ని గుడ్లు పెడుతాయి. ఆ గుడ్ల నుంచి మరిన్ని కోళ్ళు. ఇలా కొద్ది కాలంలోనే వేలాది కోళ్ళు. వాటన్నింటినీ అమ్ముకుంటే కొన్ని లక్షల రూపాయలు వచ్చేవి. కానీ నేను అంత అత్యాశాపరుణ్ణి కాదు. ఓ లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే. లేదా అదే కోడిపిల్లను బతికించాలి." అన్నాడు. "అవును అదే న్యాయం" అన్నారు అక్కడ గుమిగూడిన మరో ముగ్గురు. రామయ్య ఇది అన్యాయం అని ఎంత మొత్తుకున్నా రామయ్య దగ్గర ఉన్న 50 వేల రూపాయలను బలవంతంగా వసూలు చేశారు. మరో 50 వేలు ఇక్కడికే తెచ్చి ఇవ్వమని బెదిరించి పంపారు. ఆ కోడిపిల్ల నాగయ్యది కాదు. నాగయ్యకు ఇలా జనాన్ని మోసం చేసి, డబ్బులు దోచుకోవడం వెన్నతో పెట్టిన విద్య. ఏడుస్తూ వెళ్తున్న రామయ్యను ధర్మయ్య అనే వ్యక్తి ఆపి నాగయ్య స్వభావాన్ని గురించి చెప్పి, "వాడికి నేను బుద్ధి చెబుతా, నీ 50 వేలు, ఇంకా అమాయకులు దగ్గర దోచుకున్న ధనమంతా అతనితోనే ఇప్పిస్తా!" అని మాట ఇచ్చాడు. ఓ రోజు నాగయ్య తన భార్యతో సహా ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. హఠాత్తుగా ఒక అబ్బాయి నాగయ్య వాహనానికి అడ్డం వచ్చి, వాహనం తగిలీ తగలక ముందే విసిరేసినట్లుగా రోడ్డుపై పడి గిలగిలా తన్నుకుంటాడు. అప్పుడు ధర్మయ్య గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ వచ్చి, "అయ్యో! అన్యాయంగా నా కొడుకును పొట్టన పెట్టుకున్నావా? వీడి ప్రాణం పోవడం ఖాయం. చదువులో ఎంతో తెలివైనవాడు. భవిష్యత్తులో పెద్ద ఉద్యోగం సాధించి, కోట్లు సంపాదించేవాడు. ఓరీ దుర్మార్గుడా! నీవల్ల నాకు కోట్ల రూపాయల నష్టం. కనీసం నాకు 10 కోట్ల రూపాయలైనా నష్ట పరిహారం ఇవ్వాల్సిందే!" అన్నాడు. "అవును. ఇవ్వాల్సిందే." అన్నారు అక్కడ ఉన్న మరికొందరు. "ఇది అన్యాయం." అన్నది నాగయ్య భార్య. " ఓ చిన్న కోడిపిల్ల రామయ్య వాహనం క్రింద పడి, చనిపోయిందని అతని వద్ద లక్ష రూపాయలు వసూలు చేశావు కదా! ఒక మనిషికి నువ్వు ఎంత నష్ట పరిహారం ఇవ్వాలి?" అన్నాడు ధర్మయ్య. మిగతా వారంతా ధర్మయ్య మాటలకు మద్దతు ఇచ్చారు. "అప్పుడు నాగయ్య భార్య కమలమ్మ నాగయ్యతో "ఓరీ దుర్మార్గుడా! మనకు కోళ్ళు, కోడిపిల్లలు ఎక్కడివి? ఇలా అమాయకులను మోసం చేయడానికి నీకు సిగ్గులేదు! ఇలా ఎంతోమందిని దోచుకున్నావో! ఇక నీతో నేను ఉండలేను. నా పిల్లలతో కలిసి ఎక్కడికైనా వెళ్లిపోతాను. నువ్వు ఎవరెవరి దగ్గర ఎంత డబ్బు దోచుకున్నావో, వారిని వెతికి, వారి దగ్గర దోచుకున్న డబ్బంతా వారికి ఇవ్వాలి. ఆ తర్వాత నిజాయితీగా బ్రతకాలి. మంచి పేరు తెచ్చుకోవాలి. ఇవన్నీ చేస్తానని, నా మీద, పిల్లల మీద ఒట్టేయండి.' అన్నది. అలా ప్రమాణం చేయించుకుంది. ఎంత మోసగాడైనా భార్యా పిల్లలపై ప్రేమ కలవాడు నాగయ్య. ఎంత బతిమాలినా వినకుండా భార్య పిల్లలతో సహా వెళ్ళిపోతుంది. వారే లేకపోతే తన సంపాదన ఎందుకు? భార్యా పిల్లలు దూరమైనందుకు లబోదిబోమన్నాడు.
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి