గబ్బిలము(జానపద కథ) డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212-- ఒకప్పుడు పక్షులకు, జంతువులకు మధ్య పెద్ద యుద్ధం మొదలైంది. గబ్బిలాలు వేటి వైపు చేరలేదు. ఏవి గెలిచేటట్టు వుంటే వాటి వైపు చేరదామని అనుకున్నాయి.కొన్నిరోజులకు పక్షులు గెలిచే సూచన కనబడింది. వెంటనే గబ్బిలాలు పక్షుల దగ్గరకు పోయి “మేమూ పక్షులమే. మాకుగూడా మీ లాగే పెద్ద పెద్ద రెక్కలు వున్నాయి. మీలాగే గాలిలో కూడా ఎగురుతాము. కావాలంటే చూడండి” అంటూ తమ రెక్కలు చూపి వాటిలో చేరిపోయాయి. యుద్ధం జరుగుతూనే వుంది. కొన్ని రోజులకు జంతువులు గెలిచే సూచన కనబడింది. వెంటనే గబ్బిలాలు మనం ఇక ఈ పక్షులతో కలసి వుంటే కష్టం అనుకోని పక్షులను వదిలేసి జంతువుల దగ్గరకు పోయాయి. “మేమూ జంతువులమే. మీలాగే పిల్లలని కంటాము. పాలు ఇస్తాము. ఇన్ని రోజులూ అనవసరంగా ఆ పక్షులతో కలసి ఉన్నాము. తప్పయింది. మమ్మల్ని మన్నించి మీలో కలుపుకోండి ” అంటూ వాటిలో చేరిపోయాయి.ఆ యుద్ధం అలాగే సాగీ సాగీ చివరకు మరలా పక్షులే గెలిచాయి. దాంతో గబ్బిలాలు అన్నీ ఒకచోట చేరి ఆలోచించాయి. ఒడిపోయినవాళ్ళ వైపు ఉండడం వల్ల ఏమాత్రం లాభం లేదనుకుంటూ మరలా ఆ పక్షుల దగ్గరికి పోయి “మేము మీ వైపే. ఇక ఎప్పటికీ మీతోనే ఉంటాము. అటువైపు చచ్చినా పోము” అన్నాయి. కానీ పక్షులు ఆ గబ్బిలాల మాటలను నమ్మలేదు. వీటి వ్యవహారం గోడమీది పిల్లుల్లాగా ఉంది. ఇవి ఎప్పటికైనా ప్రమాదకరమే అనుకుంటూ తమలోకి రానియ్యకుండా " మరలా ఎప్పుడైనా ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనబడితే వెంటబడి చంపుతాము చూడు అంటూ వాటిని అక్కడినుంచి తరిమివేశాయి. దాంతో ఆ గబ్బిలాలు చేసేది ఏమీలేక తిరిగి మరలా జంతువుల దగ్గరకు వచ్చాయి. అవి పక్షుల దగ్గరికి పోయిన విషయం తెలుసుకున్న జంతువులు వాటిని అసహ్యంగా చూస్తూ ఛీ... ఛీ... మాటమీద మీద నిలబడని బతుకూ ఒక బతుకేనా... ఇంగోసారి ఇటువైపు వస్తే కిందా మీదా ఏసీ వుతుకుతాం చూడు అంటూ హెచ్చరించి అక్కడినుంచి తరిమేశాయి.దాంతో....అప్పటి నుండీ గబ్బిలాలు ఎవరికీ ముఖం చూపించలేక సిగ్గుతో భయంతో పాడుబడిన కోటల్లో నివసిస్తూ,రాత్రిపూట మాత్రమే తిరుగుతూ వున్నాయి.


కామెంట్‌లు