ద్రష్ట-దృశ్యం----సుజాత.పి.వి.ఎల్--సత్యాన్ని సాక్షాత్కరింప చేసుకోవాలంటే ఎంతో సమర్థత అవసరం. కేవలం సమర్థత ఉంటే చాలదు. అహంకారం, స్వార్థం, వ్యామోహం నుంచి విముక్తి పొందిన వారికి మాత్రమే సత్యాన్ని తెలుసుకోగలిగిన అంతర్దృష్టి లభిస్తుంది. ఒకసారి అంతర్దృష్టి అనేది ఏర్పడితే లోక కళ్యాణం కోసం, సర్వ ప్రాణుల హితం కోసం జీవించాలనే తపన కలుగుతుంది. పశుత్వం నుండి మనుష్యత్వం వైపు మార్గం కనిపిస్తుంది. ఇదంతా బాహ్య ప్రపంచంలో జరగదు. అంతర్ముఖం లోనే గోచరిస్తుంది. మనం దేనిని ప్రపంచమని భావిస్తున్నామో, అది మనసు నుండి ఉద్భవించిన భావన మాత్రమే అని అనిపిస్తుంది. అలా అనిపించిన మరుక్షణం నిర్విచార స్థితి సిద్ధిస్తుంది. ఇక్కడ నిర్విచారమంటే,విచారము, ఆలోచన లేని స్థితి అని కాదు. అన్ని ఆలోచనలను ప్రసరింప చేయగల సమర్థత కలిగిన స్థితి అని అర్థం. దీనినే సమగ్రత్వం, సంపూర్ణత్వం సిద్దించే స్థితి అంటారు. ఆ స్థితిని అంతఃకరణ దృష్టితో చూసేవాడు 'ద్రష్ట', చూడబడేది 'దృశ్యం'.


కామెంట్‌లు