దానం..హస్తస్య భూషణం..---సుజాత.పి.వి.ఎల్--- పూర్వం ఒక గ్రామంలో ఒక అవ్వ ఉండేది. ఆమె ధనవంతురాలు కాదు. అలాగని పేదరాలు కాదు. తనకున్నంతలో సహాయం చేస్తూ ఉండేది. తిండి లేని వారికి రొట్టెలు అందించి ఆకలి తీర్చేది. ఒక బండిలో దుప్పట్లు వేసుకుని రాత్రి వేళలో వీధుల్లో అక్కడక్కడా చలికి ముడుచుకొని పడుకొని వున్నవారి మీద కప్పి వచ్చేసేది. భగవదాను గ్రహం వల్ల ఆమె చేసే దానం కూడా దినదినమూ పెరుగుతూ సాగింది. ఈ విధంగా అతి గుట్టుగా గుప్త దానం చేస్తుండేది. కొంత కాలానికి ఆ ఊరి ప్రజలు ఆమె సేవా నిరతిని గుర్తించారు. అయితే ఆమె ఎప్పుడూ ఇంత సహాయం చేస్తున్నా తలదించుకొని నడుస్తూ నిడారంబరంగా ఉండటం చూసి..కొందరు "అవ్వా! నువ్వింత త్యాగ బుద్ధితో ఎంతో మందికి మంచి చేస్తున్నావు కదా! మరెందుకు తల వంచుకొని వెళుతుంటావు. ఎంచక్కా గర్వంగా తలెత్తుకుని తిరగొచ్చు కదా!.." అని ప్రశ్నించారు. అప్పుడా అవ్వ.."చూడండి నాయనలారా!.. నేనేంచేశానని గర్వపడాలి. తలెత్తుకుని తిరగడం నాకు అవమానకరంగా అనిపిస్తుంది. ఎందుచేతనంటే..భగవంతుడు సహస్ర చేతులతో ఎన్నో ఇస్తున్నాడు. నేను ఈ ఒక్క చేత్తోనేగా ఉన్నంతలో దానము చేస్తున్నాను. అంతే..!" అని సమాధానమిచ్చింది. అప్పుడర్ధమైంది అవ్వను చూశాక వారికి.. తోచినంత దానం చెయ్యాలి. కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి కూడా తెలేనంత గుప్తంగా చేయాలని. దానం హస్తస్య.భూషణం. ధనమునకు దానము వలనే సార్ధకత అని.


కామెంట్‌లు