సుమతీ శతకం పద్యం (౧౦౪-104)

*శుభములు నొందని చదువును*
*అభినయమున రాగరసము ! నందని పాటల్*
*గుభ గుభలు లేని కూటమి*
*సభ మెచ్చని మాటలెల్లఁ ! జప్పన సుమతీ!*
తా.: ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ.....
మనుగడకు కావలసిన సంపదలను ఈయని చదువులు; చక్కని అభినయ కౌశలము లెని నాట్యము, నటన; శృతి, లయ, భావము లేని పాట;  సందడి, హడావిడి, కలివిడి తనము లేని సమూహము;  సభాపతిని, సభలో వున్నవారిని మెప్పించలేని మాటలు; ఇవి అన్నీ కూడా చవులు పుట్టించక నిస్సారముగా వుంటాయి ..... అని సుమతీ శతకకారుని వాక్కు.
*ఒక లక్ష్యాన్ని సాధించడానికి చేసే ప్రయత్నం, మనలను ఆ నిర్దేశిత లక్ష్యానికి చేర్చేదిగా వుండాలి. విలువిద్య అభ్యసించే సమయంలో కౌరవ పాండవ కుమారులు అందరూ చిటారు కొమ్మన వున్న చిలుక కన్ను లక్ష్యం గా చేసుకొని విల్లు ఎక్కు పెట్టిన వారే. కానీ పాండవ మధ్యముడు మాత్రమే లక్ష్యాన్ని ఛేధిస్తాడు.  ఇక్కడ ఫల్గుణుని ఏకాగ్రత, లక్ష్య ఛేదనలో అతనికి వుపకరిస్తుంది.  కనుక, ఏపని చేసినా ఆపనిలో లగ్న మైన మనసూ, భ్రాంతికి లోనుగాని ఏకాగ్రత అవసరం* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss


కామెంట్‌లు