కందుకూరి వీరేశలింగంగారి సతీమణి రాజ్యలక్ష్మి. ఆమె ఎనలేని సామాజిక సేవలందించి, భర్తకు తోడునీడగా నిలిచిన మహిళా మణి. ఆత్మీయ బంధువులందరూ, వారిని విడిచిపెట్టిన భయపడ లేదు. ఎనలేని సాహసంతో ముందుకు నడిచిన మహిళా రత్నం. ఎవ్వరికి తలవంచక, చేసే కార్యక్రమాల మీద పరిపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగిన వనితా రత్నం.గోదావరి నదీ ప్రవాహానికి ఎదురీదినట్లు, కష్టాల ప్రవాహాన్ని ఎదురొడ్డి పోరాడి సంఘ సంస్కరణలకు నిలబడిన ధీమంతురాలు. వివాహం కోసం వచ్చిన వితంతు వనితలను తన కన్న బిడ్డల కంటే ప్రేమగా చూసుకునేది. వారి పట్ల ఓర్పు నేర్పు చూపించి, కన్నతల్లి కంటే మిన్న గా ఉండేది. వితంతు వనితలతో సాదరంగా మాట్లాడేది."మీరు రేపు పెళ్లి చేసుకున్నాక మీ భర్తలతో వెళ్ళినాకష్టసుఖాలు కూడా నాకు తెలియ పరుస్తూ ఉండండి. మీ సంసార బాధ్యతలను మరిచిపోకండి. సహనమే స్త్రీకి అత్యుత్తమ గుణం. అదే దేవుడిచ్చిన వరం సద్వినియోగం చేసుకోండి."అని హితబోధ చేసేది.తన ఇంటనున్న వితంతువు లందరికీ బుద్ధులు నేర్పేది. ఇంటిపనితో పాటు వంట పని కూడా నేర్పేది. ఈమె ప్రార్థన గీతాలు కూడా రాగయుక్తంగా పాడించేది. వివాహమై వెళ్లిపోయిన యువతు లందరూ రాజ్య లక్ష్మమ్మ ను "అమ్మా!" అని ఆప్యాయంగా పలకరించేవారు. ఆ యువతులు కూడా ఉత్తరాల ద్వారా కష్టసుఖాలు తరచూ తెలియజేస్తూ ఉండేవారు. దిక్కు మొక్కు లేనివారికి పురుళ్ళు కూడా పోసేది. ఎవరయినా అనాధ స్త్రీలు జబ్బు పడ్డారని తెలిస్తే, వారిని స్వయంగా తన ఇంటికి రప్పించి ఆరోగ్యము చక్కబడే వరకు కంటికి రెప్పలా చూసుకునేది. పతితులై పశ్చాత్తాప పడుతున్న అభాగ్య వనితలను కూడా చేరదీసిప్రేమతో ఆదుకునేది తన జీవిత కాలంలో సుమారు పది మందిని ఈ విధంగా కాపాడింది.గర్భిణి అయిన ఒక అనాధ వనితను చేరదీసి పురుడు పోసింది. ఆమె పిల్లను కన్న తర్వాత కొద్దిరోజులకే పసిపిల్లను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి పోయింది. ఆ చంటి పాప మలమూత్రాలను ఎత్తి, శుభ్రం చేస్తూ పెంచే బాధ్యతను కూడా రాజ్య లక్ష్మమ్మ తీసుకుంది.వితంతు వివాహాలకు నిరసనగా వీరి ఇంటనున్న పనివాళ్ళు మానేశారు. ఒక వితంతు వివాహం నాడు వంట పని వారు కూడా హఠాత్తుగా వెళ్ళిపోయారు. వీరంటే సరిపడని వారే ఈ పని చేశారని వీరేశలింగం రాజ్యలక్ష్మమ్మలకు తెలుసు. అయినప్పటికీ ఆలుమగలు భయపడలేదు. అదర లేదు, బెదరలేదు,ఏమి చెక్కు చెదరలేదు.ఆ సమయంలోనే కందుకూరి వారి ఇంట వివాహం చేయవలసి వచ్చింది.అన్ని పనులు తానేచేసింది. సోమరితనానికి ఆమె అంటే విపరీతమైన భయం!అందుకే అదీదూరంగా ఉండేది. ఎవ్వరికీ సహాయం అర్ధించ లేదు. కడకు గోదావరి నదికి పోయి నీరు మోసుకుని తానే తెచ్చింది. కొత్తగా పెళ్లయిన దంపతులు వారి బంధువులు పనులు విడిచిపెట్టి గదులలో కూర్చుంటే పనులన్నీ ఆమె చేసేది. వారు సిగ్గుపడేటట్లు బుద్ధి వచ్చేటట్లు సున్నితంగా మాట్లాడేది. వీరేశలింగం వంటి సంఘం సంస్కర్తకి ధర్మపత్ని యై, ఆమె తన శక్తి వంచన లేకుండా సామాజిక సేవలు అందించేది. ఆమె ప్రార్థనా గీతాలు కూడావితంతువులచే పాడించేది. స్త్రీల కోసం ప్రత్యేకంగా స్త్రీ ప్రార్ధన సమాజాన్ని స్థాపించింది. దేవుని పట్ల, భక్తి విశ్వాసము పెంచే కీర్తనలను తాను రాయడమే కాక గానం చేసేది.అక్కడి వనిత లందరిచే ప్రార్థన గీతాలు పాడించేది. భర్త పట్ల రాజ్యలక్ష్మమ్మకు అమితమైన ప్రేమాభిమానాలు, గౌరవం ఉండేవి.ఆమె భర్త కంటే ముందుగా దైవ సాన్నిధ్యం చేరుకోవాలనే భగవంతుని నిత్యం ప్రార్థన చేసేది. ఆమె ప్రార్థన దేవుడు ఆలకించి నట్లు 1910 ఆగస్టు 12వ తేదీ రాత్రి 10 గంటల వరకు పని చేసింది. తదుపరి దైవాన్ని ప్రార్థించి నిదురించింది.ఆ పక్క మీదే ప్రాణం విడచిన సాధ్వీమణి.ఆమె మరణించినా కందుకూరి వీరేశలింగం గారికి తగిన ఇల్లాలిగా చరిత్రలో నిలిచిపోవడం జరిగింది.(98వ భాగము) సశేషం బెహరా ఉమామహేశ్వరరావు సెల్ : 9290061336


కామెంట్‌లు