కందుకూరి వీరేశలింగంగారి రచనా వ్యాసాంగం :- కందుకూరి వారి పత్రిక "వివేక వర్ధని" పలు రంగాలలో అభివృద్ధి సాధిస్తూ అపారమైన సేవలందించింది. ప్రజలలో చైతన్యం కలిగించి, సమాజాన్ని ప్రగతి వైపు నడిపించింది. ఇందుకు మూల కారణం వీరేశలింగం గారి ధైర్యం సాహసాలే! 1978లో వీరేశలింగం నవలా రచనా వ్యాసంగంప్రారంభించారు. "వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్" అనే ఆంగ్లనవల చదివారు. దానిని ఆధారంగా చేసుకుని, 'రాజ శేఖర చరిత్ర' అనే నవల రాసారు.దీనిని తెలుగు లో మొట్టమొదటి నవలగా చెప్పుకో వచ్చును. ఇందులో మధ్య తరగతి కుటుంబంలోని మూఢాచారాలు చిత్రింపబడినవి. ఒక సామాన్యుడిని కథా నాయకుడిగా చిత్రించడం రాజశేఖర చరిత్ర తోనే ఆరంభమైంది.అంతకు ముందు తెలుగులో వచనము, నాటకం, కథ, విమర్శ రాయబడినా అవి వెలుగులోకి రాలేదు. తెలుగులో ఈ నూతన ప్రక్రియకు స్వీకారం చుట్టిన వాడిని నేనే అని వీరేశలింగం గారు చెప్పేవారు. షేక్స్పియర్ రాసిన "ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్" నాటకాన్ని "చమత్కార రత్నావళి" అనే పేరుతో అనువాద నాటకాన్ని తయారు చేసి శిష్యులు చేతప్రదర్శింప చేసారు. "ది రైవల్స్" అనే ఆంగ్ల నాటకాన్ని "కళ్యాణ కల్పవల్లి" అనే పేరుతోనూ," డ్యూరన్నా" అనే నాటకాన్ని "రాగమంజరి" అనే పేరుతో పాత్రలు, ప్రదేశాలను మార్చి అనువదించారు. తొలి తెలుగు నాటకం ప్రదర్శింప చేసింది వీరేశలింగం గారే! ఈయన రచించిన స్వతంత్ర నాటకాలలో ప్రహ్లాద చరిత్ర, సత్య హరిశ్చంద్ర, దక్షిణ గోగ్రహణం, ప్రధాన మైనవి. ఏ గ్రంధం రచించిన, తప్పని సరిగా సంఘసంస్కరణ విషయాలను, బ్రహ్మ సమాజ సిద్దాంతాలను చేర్చే వాడు. సంస్క్రతంలో కాళిదాసు కావ్యము "మాళవికాగ్ని మిత్రము" తెలుగులోకి అనువదిస్తూ పీఠికలో పూర్వ కాలంలో స్త్రీలు విద్యావంతులై, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అనుభవించే వారని అనేక శాస్త్ర నిదర్శనాలతో ఉదహరించారు.ఈ సాహిత్య ప్రహసనాల వలన వీరేశలింగంగారి జీవితంలో కూడా మార్పులు చోటు చేసుకోవడం జరిగింది. ఈ రచనల తరువాత ఆయన సంస్కరణలకు ఉద్యమించారు. ప్రజలలో సంస్కార భావాలు కలిగించడానికి ఎంతో కృషి చేసారు. అందుకుగాను హాస్య సంజీవని పత్రికలో అనేక ప్రహసనాలు ప్రకటించారు. ప్రహసనం అనేది ఒక సాహితీ ప్రక్రియ. విద్యావంతులను నవ్విస్తునే చురక వేయ గలదు. సమాజంలోని లోపాలను ఎత్తి చూపిస్తూనే చెప్పి పొడిచే పద్ధతి. దీని ఆశయం హాస్యం చిందిస్తునే సమాజాన్ని సంస్కరించే పద్దతి.ఈ రీతిగానే తాను ముందుకు సాగుతూనే, సమాజాన్ని ముందుకు నడిపించిన ఘనుడు వీరేశలింగం. ( ఇంకా ఉంది ) ఇది 92వ భాగం- బెహరా ఉమామహేశ్వరరావు - 9290061336


కామెంట్‌లు