2. సంతతం- డాక్టర్ . బి . వి. ఎన్ స్వామి

ఎండలు మండుతున్నయి. ముహూర్తాలు వర్ధిల్లు తున్నాయి. వీటి మధ్య మనుషులు మాడుతున్నరు. వడగాలులు చావు కబుర్లు చెబుతున్నయి. జీవనం ఎడారిలా కదులుతుంది. ఆ సమయాన బుంగి చెప్పిన మాట ఒయాసిస్‌లా కనిపించింది.
‘‘రేపటి నుండి ప్రతి ఉదయం డాక్టర్ గారి అంబలి కేంద్రానికి వెళ్ళాలను కుంటున్నా. నువ్వు వస్తవా’’ అడిగిండు.
‘‘చాయ్, కాఫి, కూల్ డ్రింక్స్‌కు బదులు అంబలి తాగితే ఆరోగ్యం. నేనూ వస్తాను. అట్లాగే డాక్టర్ గారిని కలుద్దాం’’ అన్నాను.
ఉదయం ఇద్దరం కలిసి కేంద్రానికి వెళ్ళాం. వరుసలో నిలబడి అంబలి తాగినం. కడుపు చల్లబడింది. పక్కింట్లోనే ఉన్న అంబలి దాతను కలిసినం.
‘‘నమస్కారం డాక్టర్ గారు. ఈ ఆలోచన మీ కెలా వచ్చింది.’’ అడిగిన
‘‘మా ఇంటికి వచ్చిన బంధువులకు, మిత్రులకు నాతల్లిదండ్రులు అంబలి ఇచ్చి వారి దాహార్తి తీర్చేవారు. ఇది 93 సం॥ కింది మాట. ఈ రోజు అంబలి అవసరం ఆనాటి కంటే ఎక్కువ ఉంది. ఎండదెబ్బ నుండి కాపాడుతుంది. గత ఏడు సం॥ నుండి ఈ కేంద్రాన్ని నడుపుతున్న. ఇది నాకు తృప్తి నిస్తుంది’’.
‘‘అంబలి తాగువానికి మీసాలొత్తు వాడొకడా! అన్నట్లు అన్నం దొరకని రోజుల్లో అంబలి తాగి బతికే వారట కదా’’ అన్నాను.
‘‘ఇపడు అన్నం ఉన్నా. షుగరు, బి.పి.లతో తినలేని పరిస్థితి. అందుకే అంబలి పోస్తున్నా’’ కొంటెగా అన్నాడు డాక్టర్.
‘‘చలి వేంద్రం లోని నీళ్ళు దాహం తీరుస్తున్నవి. అంబలి కేంద్రాల్లోని గంజి ఆకలి తీరుస్తుంది. రెండూ కావల్సినవే. సతతం అవసరం తీరుస్తున్నందుకు కృతజ్ఞతలు డాక్టర్ గారూ.’’ అంటూ రెండు చేతులు జోడించిండు బుంగి.
మేదుర భక్తి నీశ్వరుడు మెచ్చగ జిహ్వడు పళ్ళెరంబుగా
నాదట బ్రాచి యంబలి సమర్పణ జేసి పొగడ్తెకక్కునా
మాదర చెన్నలింగము కుమారుడ, నిన్ను భజించు సంతతా
స్వాదిత సుప్రసాద బసవా! బసవా! బసవా! వృషాధిపా
వృషాధిప శతకం
పాల్కురికి సోమన


కామెంట్‌లు