గురజాడవారి " సంస్కర్త హృదయం " లో రంగనాథ య్యరు భవిష్యత్తులో వేశ్యను ఎలా సంస్కరించగలిగాడో చూద్దాం. ఆ రోజు చీకటి పడింది. రంగనాథయ్యరు సరళ ఇంటికి వస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాటప్రకారం వీధులు నిశ్శబ్దంగా ఉన్న సమయంలో బయలుదేరాడు. కొద్దిసేపట్లో ప్రొఫెసర్ సరళ ఇంటిముందుకు చేరుకున్నాడు. కానీ వీధి లైట్ ఉంది. ఎవరైనా చూస్తారేమోననుకుని భయపడి తిరిగి తన ఇంటికి పోదామనుకున్నాడు. కానీ ఇంతవరకూ వచ్చి ఇంటికి పోవడమేమిటి అనుకున్నాడు. సరళ దగ్గరకు వెళితే తప్పేముంది అనుకుంటూ ఆమె చీడీమెట్లెక్కి మళ్ళీ వెనుదిరిగిపోయాడు. ప్రొఫెసర్ గుండెల్లో ఒక ప్రక్క తన పరువు పోతుందోననే ఆందోళన, మరోప్రక్క సరళపై గల యెనలేని ప్రేమ ఇలా తనను ముందుకు వెనుకకు ఉర్రూతలూగించాయి. చివరకు తన ఇంటికి పోదామనే నిర్ణయానికి వచ్చి వెనుదిరిగి పోతున్నాడు. ఇంత లో సరళ చెల్లి వచ్చి రంగనాథయ్యరును లోనకు తీసుకువెళ్లింది. ఇక్కడ గురజాడ పరువు, మర్యాదగల వ్యక్తి చేయరాని పనులు (దొంగతనం చేయడానికి, వేశ్య దగ్గరకు వెళ్ళడానికి, మధ్యం తీసుకోవడానికి ) చేయడానికి వెళ్ళాలని భావించి నప్పుడు ఏ విధంగా మనసు ముందుకూ వెనుకకు ఊగిస లాడుతుందో మానసిక ఆందోళన కళ్లకు కట్టినట్టు వివరించాడు. ప్రొఫెసర్ ఆ పిల్లను అనుసరించి ముందుకు వెళ్తాడు. పూలవాసన గుప్పుగుప్పుమంటూంది.అగరు వత్తుల ధూపం, వింత వింత పరిమళాలు అతనిని ఆహ్వానిస్తున్నాయి. అలా నెమ్మదిగా రెండవ అంతస్తును చేరుకు న్నాడు. అక్కడకు వెళ్లేసరికి పుగాకు వాసన, సారా కంపు భరించలేనిదిగా ఉంది. ఆ గదిలోనున్న వస్తువులు కొన్ని ఎంతో పురాతనమైనవి. మరికొన్ని ఆధునికమైనవి. అన్నింటినీ మొత్తంగా చూసుకుంటే ఎంతో అనాగరికంగా ఉన్నాయి. ఈ గది పురాతన వస్తువులు కలిగి ఉంటుంది. తరతరాల నుంచీ పాపపంకిలమైన అతి నీచపు కామకృత్యా లకిది నిలయం. లెక్కలేనన్ని జీవితాలను నాశనం చేసి పొట్టన పెట్టుకున్న ఈ గదికంటే అపవిత్రమైన స్థలం ఇంకొక చోటు ఎక్కడా ఉండదనుకుంటాడు. " ఇక్కడ మీరు ఎలా ఉండగలుగుతున్నారమ్మా ?" అని సరళ చెల్లిని ప్రశ్నిస్తాడు.అందుకు ఆ అమ్మాయి అది వాళ్ళమ్మ గది అని చెబుతూ ప్రొఫెసర్ ను అక్క సరళ గదికి తీసుకువెళ్తుంది. ఆగదిని చూసి నరకం నుండి స్వర్గానికి వచ్చినట్టనుకుని గది శోభను మెచ్చుకుంటాడు. రివాల్వింగ్ బుక్కు కేసొగటుంది.దానిమీద మహామేథావుల, ప్రపంచ వీరుల ఫోటోలున్నాయి.ఒక నల్లని బల్లపై ఒక వీణ, ఆ బల్ల మధ్యన పూలు ఉంచబడ్డాయి. రంగనాథయ్యరు ఫోటో కూడా ఆబల్లపై ఉంది.అతను ఆశ్చర్యపోయాడు సరళను ఆకర్షించే గుణం తనలోఏముందని ప్రశ్నించుకుంటాడు. తనలోనున్న మేథాశక్తి ఆమెను ఆకర్షించి ఉంటుంది అనుకుంటాడు. ప్రేమ ద్వారాల ను ప్రేమే తెరవాలి అనుకుంటాడు. సరళను ఎవరి అభిమా నాన్ని, ప్రేమను ఎరుగని ఒక వెర్రి పిల్లగా భావిస్తాడు. సరళ తల్లి ఉండే గదిని, సరళగదినీ గురజాడ వర్ణించే విధానం, వాటిలో గల వైవిధ్యం మనం తను వ్రాసే కథలో చదవవల సిందేగానీ ఇక్కడ ఆ వర్ణనను నేను తెలియజెప్పడానికి అవకాశంలేదు. ' అవతల గదిలో అనాగరికత, జుగుప్స, వికృతం చోటుచేసుకుంటే ఇవతలి గదిలో సౌందర్య కళామయ నిర్మలత్వంతో కూడుకున్న వాతావరణం తనకుగోచరిస్తున్నాయి. ఇంతలో ఎక్కడ నుంచో " సృష్టిలో అనాదినుంచీ పాపం, పుణ్యం ఒకదాని ప్రక్క ఇంకొకటి ఉంటునే ఉన్నాయి." అన్న అయ్యరుకు వినిపించాయి. ఆమాటలు ఎక్కడ నుండి వస్తున్నాయో అర్థం కాలే ! ఒక్క క్షణం ఆగి చూసేసరికి అక్కడ సరళ ప్రత్యక్షమైంది. సరళ అతనికి నమస్కరించి కుర్చీలో కూర్చోమంది. ఆమె అందానికి దాసోహమయ్యాడు. తదేకంగా అతడు ఆమె వంకే చూస్తున్నాడు. సరళ సిగ్గుతో తలవంచుకుంది. ఆమె అందమైన పెదవుల మీద ముద్దు పెట్టుకోవాలనే ఆశ కలిగింది అతనికి. సంస్కర్త హృదయం ఆరవ భాగంలో అనేక తాత్విక భావాలు గు‌రజాడ ఈ సమాజం, మనుషులు గురించి చొప్పిస్తాడు." మీలాంటి గురువుల ఉపదేశం పొందుతూ ఈ జీవితాన్ని వెళ్లబుచ్చు కుంటాను. "అంటుంది. ఈ జీవితం నుండి బయటపడటానికి తనకు చేతనైనంత సహాయం చేస్తానంటాడు అయ్యర్.అందుకు సమాధానంగా తనది అపవిత్రమైన జీవితమనీ, ఈ మురికి కూపం నుండి తనను కనికరించి బయటపడేయమంటుంది. అతనితో ఏప్రపంచపు చివరకైనా పయణిస్తాను రక్షించండి అంటుంది సరళ. కానీ ప్రొఫెసర్ తన ఉద్దేశం అదికాదంటూ సరళను ఆ జీవిత పద్ధతిని విడిచిపెట్టమంటాడు.తనలాంటి భోగం పిల్లను ఏ మర్యాదస్థుడు పెండ్లాడతాడో చెప్పమంటుంది. తనకు పెండ్లి కాకుంటే ఎంత బాగుండును ప్రపంచాన్ని ధిక్కరించైనా సరళను పెండ్లి చేసుకుండే వాడిని అనుకున్నాడు.ఒక్క క్షణం ఇరువురి మధ్యా నిశ్శబ్దమావరించింది. సరళ వీణ మధుర స్వరాలను పలికించింది. అయ్యర్ మనసు పరవశించి ఏదో ఊహా ప్రపంచంలోకి వెళ్లిపోయాడు.ఆమె అందమైన, అతి సున్నితమైన పెదవులను ఆ తన్వయత్వంలో ముద్దు పెట్టుకున్నాడు. సంస్కరణ అంటేఇదేనా ? ఒకరిని లేవనెత్తబోయి తనే కింద పడ్డాడు. దగాలోపడ్డాను , మోసగింపబడ్డానని భయంకరంగా అరిచాడు. నిజానికి మన దృష్టిలో సరళ మోసగింపబడింది. సరళ సిగ్గుపడింది, మోసగింపబడింది. ఆమె తెల్లబోయింది. దగాపడ్వాడు ప్రొఫెసర్ కాదు. సరళ. సిగ్గుపడి అతను తన ఇంటి వైపు నడక ప్రారంభించాడు . అక్కడ ఉన్నవారు అతనిని చూసి "దొంగ దొంగ " అని కేకలు వేసారు. పొలీసులు లైట్ వేసారు. రంగనాథయ్యరు తప్పించుకు పోయాడు. ఆరాత్రి ఊరు వదలి ఎక్కడికో వెళ్లిపోయాడు. మరుచటి దినం ఉదయం తన ఉద్యోగానికి రాజీనామా చేసిన లేఖను తనప్రిన్సిపాల్ కు పంపాడు. ప్రిన్సిపాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు.ప్రిన్సిపాల్ కు వ్రాసిన ఉత్తరం చదువుతున్నప్పుడు ప్రొఫెసర్గారి కళ్ళల్లో కన్నీరు తిరిగాయి. ఒక సంఘ సంస్కర్తచే సౌందర్యరాశి సరళ మోసగింపబడ్డదీ, దగాపడ్డది కూడా ! గురజాడ సంఘ సంస్కర్తల హృదయాలు ఎలా ఉంటాయోమనకు తెలియ జెప్పారనిపిస్తుంది. ( సశేషం ) శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.


కామెంట్‌లు