Habits die hard అనేది ప్రసిద్ధ ఆంగ్లోక్తి.కరోనా పుణ్యమా అని రోజూ ఏదో ఒకటి రాయడం అలవాటయిన తరువాత ఏదైనా కారణాంతరాల వల్ల రాయలేకపోతే ఏమిటో వెలితి వెలితి గా ఉంటుంది.అందుకే కొన్ని మంచి అలవాట్లు చిన్నప్పుడే అలవాటు చేయగలిగితే మన పిల్లలకు సగం జీవితం సరిదిద్దిన వాళ్లమవుతాము.
మొక్కై వంగనిది మానై వంగునా అని మన తెలుగు సామెత .చిన్నప్పుడు చేయలేకపోతే పెద్దయిన తరువాత చేయటం చాలా కష్టమవుతుంది. ముఖ్యంగా ప్రాతఃకాలమే లేవటం, పుస్తకాలు చదవటం,ఎవరి పనులు వారే చేసుకోవడం వంటివి నేర్పించగలిగితే మంచిది.సరే ఈ సోదంతా ఎందుకంటారా!ఉపాధ్యాయుణ్ని కదా! సందర్భం వచ్చినపుడు చెప్పడం “అలవాటు”.
ఇక ‘నటనాలయ’గురించి నాకు తెలిసినంతవరకు చెబుతాను.ఒక సంస్థ అంటే అందులో ఉండే మనుషుల గురించే కదా మనం తెలుసుకోవలసింది
నటనాలయ గురించి చెప్పడమంటే
రాజ్ మోహన్ గురించి,పాంచజన్యం గారి గురించి చెప్పడమన్నట్టే. పాంచజన్యం గారి గురించి కొంతచెప్పాను.మిగతా విషయాలు చెప్పాలంటే ముందు రాజ్ మోహన్ గురించి చెప్పాలి.
నేను సర్ సిల్క్ లో చేరిన కొద్ది రోజులకే వినాయక చవితి పండుగ వచ్చింది.జూలై 1974 లో చేరాను.అగస్టులో అనుకుంటా సర్ సిల్క్ పార్క్ లో మహారాష్ట్ర మిత్రమండలి వాళ్లు గణేశ్ నవరాత్రులు
మొదలు పెట్టారు.మీ కుక్కడం విషయం చెప్పాలి.అప్పటికి తెలుగు వాళ్లకు రామనవరాత్రులు తప్ప గణేశ్ నవరాత్రులు తెలియవు.1974 లో ఇప్పటి లాగా గల్లీ గల్లీకి గణేశ్ పందిరి సంస్కృతి
ఆంధ్ర ప్రదేశ్ లో లేదు.ఎక్కడ మహారాష్ట్రుల ప్రాబల్యమున్నదో అక్కడే గణేశ్ నవరాత్రులు జరిగేవి.చందాల సంస్కృతి కొందరిని ప్రేరేపించిందనే చేదు నిజం మీరు జీర్ణించుకోలేక పోతే కసి దీరా నన్ను తిట్టండి.
సరే ఆ గణేశ్ ఉత్సవాలలో ఒక రోజు ఒక నాటిక వేస్తున్నారంటే చూడటానికి
వెళ్లాను.నాకింకా అప్పటికి లకస తో పరిచయమేర్పడలేదుఇంకా నాకు.
ఎనౌన్స్ మెంట్ వినిపించింది. శ్రీనివాసకళాసమితి వారి డబ్బారేకుల సుబ్బారాయుడు నాటిక అని.పేరు భలే ఉందే అనుకున్నా. కాసేపటికి నాటిక మొదలయింది. సుబ్బారాయుడు పాత్ర నటన ప్రేక్షకుల గుండెల్లో నిలిచి పోయే విధంగా ఉంది.అదేదో సీరియస్ అనుకునేరు.కడుపుబ్బ నవ్వించే హాస్యం.పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వించే హాస్యం.పడీ పడీ నవ్వి ఇక నవ్వలేక కళ్లనుండి నీళ్లు జారిపోయే పరిస్థితి. నభూతో నభవిష్యతి అనే సామెత నా జీవితంలో ఆనాడు కడుపుబ్బ నవ్వించిన సుబ్బారాయుడు పాత్రధారి రాజ్ మోహన్ ది .మళ్లీ ఈ నలభయ్యారేళ్లలో అంతగా నవ్విన రోజు లేదు.రాకపోవచ్చుకూడా.ఎందుకంటే అలా నవ్వించాలంటే మళ్లీ రాజ్ మోహన్ కే సాధ్యం.కాని ఇప్పుడు రాజ్ మోహన్ లేడు ఆయన వదిలి వెళ్లిన జ్ఞాపకాలే మిగిలి ఉన్నాయి.మొదటి సారి నేను కాగజ్ నగర్ లో నాటిక చూడటం.
చూసిన నాటిక ఈరోజుక మరచిపోలేనంతగా మనసు పై ముద్ర వేసిందంటే ఆ నాటకానికి దర్శకత్వం వహించిన వారెవరో గాని ఆయనకు పాద నమస్కారం చేయాలనిపించింది.
నాటిక అయిపోయిన తరువాత నటీ నటుల పరిచయం చేశారు.రాజ్ మోహన్,బసవయ్య,శంకర్,లోకేశ్వర్ అని.దర్శకత్వం మూర్తి అని అనౌన్స్ చేశారు.అంతే.ఆ తరువాత కొన్ని రోజులకే
ఆ మూర్తి గారిని లక్ష్మణాచార్యులు లలిత కళాసమితికి పరిచయం చేయడం,అరణి నాటకం దసరా నవరాత్రులకోసం ఎత్తుకోవటం అందులో నాకు పాత్ర లభించటం ఏ గురువు గారికి
పాదానిక వందనం చేయాలనుకున్నానో ఆయనే మాకు దర్శకులు కావటం అదంతా గతంలో మీకు చెప్పాను.ఇక్కడ చెప్పదలచిన విషయం రాజ్ మోహన్ ని మొదటి సారి అలా చూశానని చెప్పడమే
(తరువాతి భాగంలో రాజ్ మోహన్ గురించి మరిన్ని కబుర్లు)
మొదటి ఫోటోలో కర్టెన్ మీద కీ.శే. రాజ్మోహన్ బొమ్మ;రెండో ఫోటోలో చేతులు కట్టుకుని తలవంచుకుని ఉన్న వ్యక్తి రాజ్ మోహన్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి