వారు చెప్పే తీరే కట్టిపడేసేది-- యామిజాల జగదీశ్

మద్రాసులో టీ.నగర్లోని గిరిఫిత్ రోడ్డు (ఇప్పుడు రోడ్డుని మహారాజపురం సంతానం స్ట్రీట్ అంటున్నారు) నేను చదువుకున్న రామకృష్ణామిషన్ ఎలిమెంటరీ స్కూలుని ఆనుకుని ముప్పాత్తమ్మన్ గుడి ఉండేది. ఈ అమ్మవారి ఆలయాన్ని పక్కనే మా స్కూల్ గ్రౌండ్ ఉండేది. ఈ స్కూల్ గ్రౌండ్లో శ్రీరామనవమి, దసరా పండుగ సమయంలోనూ, అలాగే వేసవి సెలవులప్పుడూ కథాకాలక్షేపాలు జరుగుతుండేవి. ప్రముఖులు పౌరాణిక కథలను చెప్పేవారు. వారిలో కృపానందవారియార్, టి.ఎస్. బాలకృష్ణశాస్త్రి వంటి హేమాహేమీలు ఉండేవారు. అలాగే మానాన్నగారితో కలిసి శ్రీ శారదా విద్యాలయం బాలికల స్కూల్లో తమిళ మాస్టారుగా పని చేసిన రాజగోపాల శర్మగారు కూడా అప్పడప్పుడూ పౌరాణిక కథలు చెప్పడం విన్నాను. 
అయితే కథకులలో కృపానందవారియార్ చెప్పే తీరు వేరేగా ఉండేది. మధ్యమధ్యలో కొన్ని నిజజీవిత సంఘటనలను సందర్భోచితంగా చెప్పడంలో ఈయన దిట్ట. 
అలాగే బాలకృష్ణ శాస్త్రిగారిదికూడా బాగుండేది. ఈయన మధ్యమధ్యలో ఓ గ్లాసు పాలు తాగుతుండేవారు. ఆయన పక్కనే ఓ మరచెంబు ఉండేది. అందులోంచి ఓ గ్లాసులో పాలు పోసుకుని తాగేవారు. 
కృపానందవారియార్ (1906–1993)
గొప్ప శివారాధ్యులు. కుమారస్వామి భక్తుడు. శివభక్తుల కథలు ప్రముఖంగా చెప్పేవారు. 1906లో తమిళనాడులోని వెల్లూరులోని గాంగేయనల్లూరులో జన్మించిన కృపానంద వారియార్ తన 87 వ ఏట 1993లో పరమపదించారు. మల్లయదాసన్, కనకవల్లి దంపతుల సంతానమైన ఈయనను వారియార్ స్వామిగాను చెప్తారు. శివకవి అనే చలనచిత్రానికి ఆయన సాహిత్య రచనకూడా చేశారు. హైందవ ధర్మాన్ని ప్రచారం చేయడానికి విశేష కృషి చేసిన ఈయన స్మృత్యర్థం 2006 కేంద్రప్రభుత్వం ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. భక్తితోపాటు క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని గట్టిగా చెప్పిన కృపానంద వారియార్ ని ఐరవై నాలుగో నాయన్మారుగా తమిళనాడు ఆస్తికులు భావిస్తారు. ఆయన జన్మించిన గాంగేయనల్లూరులోని ఆలయంలో ఆయన విగ్రహం ప్రతిష్ఠించారు. 
ఇక టి.ఎస్. బాలకృష్ణ శాస్త్రి గారి పూర్తి పేరు తిరువిడైమరుదూర్ సాంబమూర్తి గణపాడిగల్ బాలకృష్ణశాస్త్రిగళ్ (1919–2003). మద్రాసులో చదువుకున్న ఈయన మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీ చేశారు. కాలేజీ రోజుల్లో ఆయన ఇంగ్లీష్ సాహిత్యంపై గట్టి పట్టుండేది. కొన్ని షేక్ స్పియర్ నాటకాలలోనూ నటించారు. చదువు తర్వాత ఆయన ఇంపీరియల్ బ్యాంకులో ఉద్యోగం చేశారు. ఈళబ్యాంకునే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటున్నారిప్పుడు.
ఆయన పెద్దకుమారుడు టి.ఎస్.బి.కె. మౌళి తమిళనటుడు. నాటక రచయిత. సినీదర్శకుడు. మరొక కుమారుడు కూడా దర్శకుడు. ఇతని పేరు గుర్తు లేదు.
గొప్ప భక్తుడైన కృపానందవారియార్ చెప్పిన ఆణిముత్యాలూ పిట్టకథలూ ఆనేకం. ఆయన మాటలు ఆత్మవిశ్వాసాన్ని పెంచేవిగా ఉండేవి. ఆయన మాటలలో కొన్నింటిని ఇక్కడ చెప్తున్నాను....
చీకట్లో ఉన్నప్పుడు దీపం ఎలా మనకు వెలుగునిస్తుందో అలాగే అమ్మ మనల్ని ఎలాగైతే పెంచి పెద్దచేసిందనేదీ ఆమె లేనప్పుడు తెలిసొస్తుంది. అమ్మతనాన్ని, నిస్వార్థప్రేమను ఎల్లప్పుడూ మరచిపోకూడదు.
నిన్నం ఇతరులు పొగుడుతున్నప్పుడు సంతోషపడకు.అలాగే నిన్ను ఇతరులు దూషిస్తున్నప్పుడు డీలాపడకు. కృంగిపోకూడదు.
ఆశకు ఎవరినైనా నాశనం చేసే గుణముంటుంది. కానీ మనం ఇతరులపై ప్రేమను చూపితే వారిని మరింత ముందుకు తీసుకుపోయే గుణమున్నది ప్రేమ. కనుక ఇతరుల పురోగతికి దోహదపడే గుణం కలిగి ఉండాలి. అనవసరమైన ఆశల వల్ల బొధలే తప్ప మేలు జరగదు.
మనం కొన్ని సౌకర్యాలతో రోజులు గడుపుతున్నప్పుడే కష్టొలగురించి తెలుసుకోవాలి. ఎందుకంటే జీవితంలో హెచ్చుతగ్గులు, మోసపోవడాలు వంటివి ఎదురవుతూనే ఉంటాయి. ఇవి సర్వసహజం. కనుక అన్ని పరిస్థితులలోనూ నిలకడగా ఉండటం ప్రతి ఒక్కరికి అవసరం. అది మంచిదికూడా.
తెలియని ఒకరికి విషయాన్ని చెప్పి నేర్పించొచ్చు. తెలిసిన వానికి అందులోని సూక్ష్మాలను చెప్పి మరింత పట్టు గడించేలా చేయొచ్చు. కానీ ఇది మంచిది అది చెడు అనేది తెలుసుకోక మొండిగా వ్యవహరించేవారిని భగవంతుడైనా దిద్దలేడు.
కుటుంబం అనేది ఓ పచ్చని చెట్టులాంటిది. అందులో భార్య అనేది వేరు. భర్త అనే అతను చెట్టు మొదలులాంటివాడు. పిల్లలు ఆకులూ పువ్వులూ. ఆ చెట్టులో పండే తీయని పండ్లు మంచి పనులకు ప్రతిఫలంలాంటివి. చెట్టు ఎలా జీవకోటికి ఉపయోగపడుతుందో అలాగే మన కుటుంబం అనే వృక్షం ఇతరులకు ఉపయోగపడాలి.
పాలులో ఉండే నెయ్యి మన కళ్ళకు కనిపించదు. అలాగే నిజమైన భక్తితో మాత్రమే భగవత్ శక్తిని గ్రహించగలం.
నిప్పు మండే చోటే పొగ మొదలవుతుంది. నిప్పుతో మనకవసరమైన వాటిని వేడి చేసుకోవచ్చు. ఇతర అవసరాలకు ఉపయోగించవచ్చు. కానీ పొగతో ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.
పంటపొలాల్లో చల్లే విత్తనాలే అనేకానేక రెట్ల పంటను మనకిస్తోంది. అలాగే ఒకరు చేసే మంచి చెడులు అనేవి మళ్ళీ అతనికే పలు రెట్లు అధికంగా చేరుతాయి. 
కొందరు ఎందుకు మాట్లాడుతున్నారో తెలీదు. కొందరు తామనుకున్నది నెరవే ర్చుకోవడానికి అడ్డూ అదుపూ లేకుండా ఓ పద్ధతి లేకుండా మాట్లాడుతారు. ఇందువల్ల ఒక్క మంచీ జరగదు.కనుక వీలున్నంతవరకూ ప్రశాంతంగా మౌనంగా ఉండటం అలవరచుకోవాలి.
మనం ఇంట్లో వంటపాత్రలు అవీ ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కుంటూ ఎలా ఉపయోగిస్తామో అలానే మనలో చెడు అనేదేదైనా ఉంటే వాటిని వదులుకుని మంచిగా ప్రవర్తించాలి. దుర్గుణాలకు దూరంగా ఉండాలి.
పక్షులకు రెండు రెక్కలు, పొగబండికి రెండు రైలు పట్టాలు, మనిషికి రెండు కాళ్ళు, రెండు కళ్ళు ఉన్నట్లు విద్యార్థులకు రెండు గుణాలు తప్పక ఉండితీరాలి. అవి, అణకువ. గురుభక్తి. ఈ రెండు గుణాలున్న విద్యార్థులు వృద్ధి చెందుతారు.
రాత్రిపూట క్రమపద్ధతిలో పడుకుని విశ్రమించడం తప్పనిసరి. పడుకునే ముందర మనసుని ప్రశాంతపరిచే మంచి పుస్తకాలు చదవాలి. 
ఇతరుల తప్పులను తరచి చూసి గుచ్చి గుచ్చి పరిశోధనలు చేయకూడదు. మనం చేసిన తప్పులను కప్పి పుచ్చకూడదు.
అణకువ అనేది మానవజీవితానికి ఉన్నత నాడి. జీవనాడి.


కామెంట్‌లు