ఔ మల్ల!-- బాలవర్ధిరాజు మల్లారం

మా ఊరికోసారి అత్తే
మల్ల  పోబుద్ది కాదుల్లా!
పోయిన గని మల్ల రాబుద్ది అయితది
గసొంటి ఊరు మాది.
ఓ ముప్పై ఏండ్ల కిందట
ఎక్కడి నుంచి అచ్చిందో గని
ఒక కోతి మా ఊరికి అచ్చింది
దాన్ని సూడంగనే సిన్న పోర గాండ్లకు
బగ్గ సంబురమయ్యింది
ఒక్క సిన్నొల్లకే గాదుల్లా
పెద్దోల్లకు గుడ కోతి శాస్టలకు నవ్వచ్చేది
గా కోతిని ఎవ్వలు గుడ 
రాల్లతో కొట్టలే,కట్టే వట్టుకోని ఉరికియ్యలే
ఇల్లిల్లూ తిరిగేది
ఏది వెడితే అది తినేది
పెట్టింది తినుడే గని ఏదీ గుంజుక పోయేది గాదు
ఎవ్వల్ని ఏమనక పోయేది
అందరూ మంచిగ సూసుకునేటోల్లు
కోతి గదా
ఒక్క జాగల ఉండేది గాదు
అటూ, ఇటూ తిరిగేది
ఓ రోజు ఏమయిందో  తెలుసునావుల్లా?
ఎప్పటి లాగనే అటు, ఇటు 
దుంకుకుంట దుంకుకుంట
కరెంటు తీగల మీదికి ఎక్కింది
గా కరెంట్ పాడుగాను
శాక్ గొట్టి పాడైంది
గంతే
కోతి నల్లగ మాడి పోయింది
ఊరొల్లు అందరూ
తమ ఇంట్ల వుట్టిన మనిషోలే 
సిన్నొల్లు, పెద్దోల్లు అందరూ బాద పడ్డరు
అది ఎప్పటికి యాది ఉండాల్నని
ఎప్పుడు కండ్లకు కనవడాల్నని
దానికి గుర్తుగ ఊరోళ్ళంత కలిసి
అన్మండ్ల గుడి మీద
గా కోతి ఇగ్రం పెట్టిండ్రు.
కింద పోటువల కనిపిచ్చేది
గా కోతే నుల్లా!
అగో గట్లుంటయి
మల్లారపొల్ల మనుసులు
మనసుకు నచ్చితే పానమిస్తరు
కడుపుల వెట్టుకొని సూసుకుంటరు 
ఔ మల్ల!


కామెంట్‌లు