తుమ్ముల ఇల్లు- వసుధారాణి.-

మా నరసరావుపేట లో కథ ఇది. చిన్నప్పటి నుంచీ నాకు నేనే ఇచ్చుకున్న పర్సనాలిటీ డెవలప్ మెంటు శిక్షణలో ఏదో ఒక తింగరి పని చేసి జనుల చేత తిట్లు తినటం ఒక భాగం.
 ఇలా తిట్లు తినటం వల్ల మనకి దేన్నయినా భరించే శక్తి బోలెడు వస్తుందనే వెర్రి నమ్మకంతో ఉండేదాన్ని.అసలు నాకీ నమ్మకం ఏర్పడటానికి ఆ ఓబొజ్జ గణపయ్యే కారణం.వినాయక చవితినాడు పాలవెల్లి తెచ్చి , దానికి రకరకాల పండ్లు అవీ కట్టి ,వినాయక వాహనమైన మూషికానికి కూడా ఓ వంకాయ కట్టి, నానా రకాల పత్రులతో పూజించి , పిండివంటలతో నైవేద్యాలు అర్పించాక.
శమంతకోపాఖ్యానం(అమ్మయ్య సరిగ్గానే వ్రాసానా ) ,కృష్ణుని నీలాపనిందలు కథ చదువుకుని భక్తిగా ఆ కథాక్షింతలు శిరస్సున ఉంచుకుని. మనకి వచ్చిన వినాయకుని శ్లోకాలు,పద్యాలు చదువుకుని, కనీసం ఓ పదకొండు గుంజిళ్ళూ ,ఓ ఐదుమార్లు చెంపలు వేసుకున్నాక గాని మా అమ్మ ఓ ఉండ్రాయి ప్రసాదం చేతిలో వేసేది కాదు. బియ్యపురవ్వ ,పెసరపప్పు కలిపి చేసిన ఉండ్రాళ్ళ లో చింతపండు పచ్చడి నంచుకుని తినటం ఎంత బాగుంటుందో.ఆగండి మీరు తిట్టుకుంటున్నారు నాకు తెలుసు , విషయం పట్టాలు తప్పి చింతపండు పచ్చడిలోకి వెళ్లిందని.
మా అమ్మ ఆ ఉండ్రాళ్ళతో పాటు పచ్చి బియ్యపిండి ,బెల్లం కలిపి గట్టిగా చిన్న చిన్న ఉండలు గోలీ అంత సైజు చేసి పెట్టి సాయంత్రం పూట వాటిని మనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళమీద విసిరేసి వాళ్ళ చేత అడిగి మరీ తిట్టిచ్చుకోమని చెప్పేది. అంతే కాక వాళ్ళ ఇంట్లో వినాయకుడుని కూడా చూసి దణ్ణం పెట్టుకుని గుంజిళ్ళు తీసి రమ్మని పంపేది .ఇలా ఐదు ఇళ్లు కనీసం వెళ్ళాలి. అలా చేస్తే ఇంక ఆ సంవత్సరం మళ్లీ వినాయక చవితి వరకూ నీలాపనిందలు రావని చెప్పేది.
చెప్పద్దూ నాకు మా చెడ్డ సరదాగా ఉండేది ఈ ఆనవాయితీ.అలా వినాయకుని వల్ల తిట్లు తినటం అన్న కాన్సెప్ట్ నా జీవితంలోకి వచ్చింది.మిగిలిన అక్కయ్యలు అందరికీ నాకు వయసు తేడా చాలా ఉండటం వలన గిల్లికజ్జాల సరదా తీరలేదు. మా చిన్నారి ,కిషోర్ , నేనూ తోడుదొంగలం కనుక కలిసి మెలిసి ఉండేవాళ్ళం.ఒక్క మా పద్దక్కని కావాలని అప్పుడప్పుడూ రకరకాల ప్రశ్నలు వేసి,చెప్పిన పనికి వ్యతిరేకమైన పనిచేసి తిట్లు తినే సరదా కాస్త తీర్చుకునే దాన్ని.
ఐతే బయట మిత్రులతో , బళ్ళో మాత్రం వేరే ఇంప్రెషన్ ఏర్పరుచుకున్నా నేను చదివక పోయినా టీచర్ తిట్ట కుండా చూసుకోవటం, నేను వాళ్ళని ఏడిపించినా సరే మిత్రులు మనల్ని ఏమీ అనకుండా ఆపగలగటం.
ఇంక మనల్ని తిట్టేస్థాయి ఉన్న వాళ్ళు ఎవరూ లేరు ఎట్లబ్బా ? అని , అట్లా తిట్ల కోసం పరితపించే సమయంలో తుమ్ముల ఇల్లు నా పాలిట వరంలా దొరికింది.ఆరండల్ పేటలో ఏంజెల్ టాకీస్ ( దానిలో సినిమాల గురించి మళ్లీ చెప్పుకుందాం) ఎదురురోడ్డులో కొంచెం ముందుకు పోతే వాకిట్లో ఏమాత్రం చోటు లేకుండా వీధిగుమ్మం డైరెక్టుగా వీధిలోకి గల ఓ పెంకుటిల్లు ఉండేది. ఆ యింటి ముందు నిలబడి కనుక ఎవరైనా తుమ్మితే ఆయింట్లో నుంచి ఎవరది ...........అంటూ శ్రావ్యమైన , సుమధురమైన తిట్లు వినపడేవి .పిల్లలే కాదు పెద్దలు తుమ్మినా సరే.
ఇంక చూసుకోండి ఆ తిట్ల ఇల్లు డిస్కవర్ చేసినాక నా సరదా. కరెక్టుగా ఆ యింటి ముందుకు వెళ్లటం హాచ్ అంటూ రాని తుమ్ము తెచ్చుకుని తుమ్మటం . వారిచే తిట్ల ప్రసాదం పొందటం. ఇట్లా మూడు తుమ్ములు,ఆరు తిట్లు ఆధారంగా నా వ్యక్తిత్వ వికాసం పెంపొందించుకున్నా. నేనే కాదు చాలా మంది పిల్లలు ఆయింటి ముందు కావాలని తుమ్మటం పరిగెత్తటం చేస్తుండే వాళ్ళు.
ఇప్పటికీ ఆ వీధీలో ఆ యింటి ముందు నుంచి పోయినప్పుడు ఒకసారి తుమ్ముదామా అన్న కొంటె ఆలోచన వస్తుంటుంది. ఆ ఇంట్లో వాళ్ళగురించి అసలు సరిగ్గా ఎవరికీ తెలీదు కూడా .అలా తుమ్ముల ఇల్లుగా ఆయిల్లు నా మెదడులో ఉండి పోయింది.


కామెంట్‌లు