సర్సిల్క్ సరిగమలు-రామ్మోహన్ రావు తుమ్మూరి

బావిలో బొక్కెన పడితే పాతాళగరిగె వేస్తాం.నీళ్లల్లో కాస్తా అటూ ఇటూ కదిలించి పైకిలాగి చూస్తే బొక్కెన కాకుండా ఇంకేదో వస్తుంది.అలా బావిలో పడ్డవస్తువులు కొన్ని బయటికి తేలిన తరువాత బొక్కెన వస్తుంది.ప్రస్తుతం నా పరిస్థితి అలాగే ఉంది.పాత విషయాలు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే అసలు విషయం కాకుండా ఇంకేదో గుర్తుకు వస్తుంది.ఇప్పుడనిపిస్తుంది. నేను డిగ్రీ ఐ పోగానే పురావస్తుశాస్త్ర శాఖలో చేరి ఉండాల్సింది అని. నా కున్న అభిరుచికి అది సరియైన ఉద్యోగం.
సరే.రాజ్ మోహన్ గురించి ఆలోచిస్తుంటే లక్ష్మణాచార్యులు గుర్తుకు వచ్చారు.లక్ష్మణాచార్యులు అంటే రంగనాథ్ గారి తమ్ముడు.మంచి తబలా వాయిద్యకారుడు.ఈయన పేపరు మిల్లులో టైపిస్టు గా పనిచేసేవారు. భగవంతుడు కొంత కొంత మందికి కొన్ని ప్రత్యేకతలు కల్పించి పంపిస్తారేమో ననిపిస్తుంది.ఈయన ప్రత్యేకత ఏమిటంటే కళాకారుల్ని పసికట్టడం వాళ్లను పరిచయం చెయ్యడం.కంపెనీలో ఏ కొత్త ఉద్యోగి చేరినా ముందుగా ఆయనకే తెలిసేది.టైపిస్టు కనుక అపాయింట్ మెంటు లెటర్స్ టైపు చేసినప్పుడే వాళ్ల బయోడాటాలన్నీ ఆయనకు తెలిసేవి.అంతే వారి వివరాలు సేకరించి ముందు వారితో పరిచయం చేసుకుని వారి గురించి చేర్చాల్సిన చోట సమాచారం చేర్చేవారు.
అలా చాలామంది కళాకారుల్ని పరిచయం చేసిన ఘనత లక్ష్మణా చార్యులది.ఇప్పుడిది ఎందుకు గుర్తు వచ్చిందంటే మూర్తి గారిని లకస కు పరిచయం చేసింది ఆయనే.
మూర్తి గారు అని పిలువబడే తోటకూర రాధాకృష్ణమూర్తి ఉరఫ్
టిఆర్కేమూర్తిగారు పేపరుమిల్లులో
రైల్వే సైడింగ్ క్లర్క్ గా చేరిన తరువాత
ఎలాగో ఆచార్యుల వారికి తెలిసింది
అప్పటికే ఆయన రైల్వే కాలనీలోని కళాకారుల శ్రీనివాస కళాసమితివారికి
డబ్బారేకుల సుబ్బారాయుడు డైరెక్షన్ చేశారు.అందులో బసవయ్య అనే ఆయన బహుశః రైల్వే ఎంప్లాయ్ అనుకుంటాను.అప్పట్లో శ్రీనివాసకళా సమితిలో రాజమోహన్, శంకర్, బసవయ్య,లోకేశ్వర్,జయరాం,ఆదినారాయణ సారుమొదలైన వాళ్లుండేవాళ్లు.వీళ్లలో లోకేశ్వర్ స్టేట్ బ్యాంక్ అటెండర్,రాజమోహన్ బిల్డింగ్
కాంట్రాక్టర్ దగ్గర పని,శంకర్ కంపెనీ వర్కర్,బసవయ్య,జయరాజులు రైల్వే ఎంప్లాయీలు, ఆదినారాయణ (రైల్వే స్కూల్ టీచరు).ఇది శ్రామికుల కళా సంస్థ.
ఈ సమయంలో లక్ష్మణాచార్యులకు మూర్తిగారిని లకసకు పరిచయం చేయాలనిపించి డా.సీతారామయ్య గారి చెవిలో వేయడం,ఆయన మూర్తి గారితో మాట్లాడి ఒప్పించడం,ఆయన మాతో తెలి సారి అరణి నాటకం వేయించడం
అది లకస చరిత్రలో వచ్చింది.అయితే
మూర్తి గారి చొరవతో రాజ్ మోహన్
మాతో నాతిచరామి నాటికలో వేసాడు.
అలా వేరే సమాజంలో ఉండి కూడా మా నాటకాల్లో వేసిన నటులు ఆదినారా యణ గారు మరియు సిద్ధిరాములు.అది మూర్తి గారి ఇంట్రస్టుతో.సిద్ధిరాములు గురించి ఇప్పుడు చెప్పను.తరువాత చెబుతాను.కాని రాజ్మోహన్ గురించి చెప్పవలసి వచ్చినపుడు సిద్ధిరాము లును వదిలివేయలేము.వీరిరువురు చాలా సంవత్సరాలు శ్రీనివాస కళాసమితి ద్వారా అనేక నాటికలు వేసారు.The ever best comedy pair in Kagaznagar.ఆ తరువాత సిద్దిరాములు జి.పి.ఆర్ట్స్ లో చేరారు.
రాజ్ మోహన్, పాంచజన్యం, వివేకా నందస్వామి, ఎన్.ఎస్.ప్రకాశ్ రావు, ముస్తాఫా,పార్థసారథి వీళ్లంతా కలిసినటనాలయ స్థాపించారు.
నటనాలయ నుండి పసుపుబొట్టు పారాణి,బలిపశువు ఇంకా ఒకటి రెండు
నాటికలు వేసారు.యండమూరి వీరేంద్ర నాథ్ కుక్క నాటిక వర్ధన్న పేట పోటీలకు
తీసుకెళ్లి ఉత్తమ బహుమతులు తెచ్చుకున్నారు.ఆ నాటికను లలిత కళాసమితిలో ఏదో సందర్భంగా ప్రదర్శిస్తే చూడటం జరిగింది.పుస్తెలోడు పాత్రలో రాజ్ మోహన్ లీనమైపోయ నటించారు.
మేమంతా కలిసి ఎవరు దొంగ అనే ఒక మైమ్ నాటిక లలిత కళా సమాఖ్య ద్వారా వేసాం.నటనాలయ అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించింది. సంగీత సాహిత్య నృత్య పోటీలు నిర్వహించే వారు.వాటితో పాటు నాటికలు వేయటం జరిగేది.అప్పుడే అనుకోని సంఘటన జరిగింది.(మిగతా విషయాలు తరువాయి భాగంలో)



కామెంట్‌లు