వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి

వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనే వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ"


దీని అర్ధం:ఎవరు చెప్పినా వినచ్చు. కానీ వినగానే తొందరపడి ఒక నిర్ణయానికి రాకుండా నిజమో..అబద్ధమో వివరంగా తెలుసుకున్నవాడే న్యాయము తెలిసినవాడు.


ఇంకొంచెం వివరంగా తెలుసుకుందామా!


గిరిజ ఆఫీస్ కి వెళుతూ పాపని ఇంట్లో కనిపెట్టుకునే పనమ్మాయి లింగమ్మతో "నాకు ఈ రోజు ఆఫీస్ లో ఆలస్యం కావచ్చు. పాపకి పెందలాడే స్నానం చేయించి అన్నం పెట్టి పడుకోపెట్టు. అన్నంలోకి పప్పు, చారు డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. జాగ్రత్త. ఊళ్ళో అంతా ఇన్ ఫెక్షన్స్, జ్వరాలు ఉన్నాయి. మట్టిలో ఆడనివ్వకు. పక్కింటి పిల్లలు వచ్చినా ఎత్తుకోవటానికి ఇవ్వకు" అని బోలెడు జాగ్రత్తలు చెప్పింది.


అనుకున్నట్లే గిరిజ వచ్చేసరికి సాయంత్రం ఏడు గంటలయింది. గిరిజకి పిల్లనప్పగించి లింగమ్మ ఇంటికెళ్ళిపోయింది. వస్తూనే గబ గబా స్నానం చేసి వంట పనిలో పడింది. ముందుగదిలో శివ టీవీ చూస్తున్నాడన్న మాటే కానీ, ఖాళీగా గిరిజ ఎప్పుడు దొరుకుతుందా...మనసులో ఉన్న కోపాన్నంతా కక్కేద్దామని ఎదురు చూస్తున్నాడు.


ఇదేదీ గమనించని గిరిజ వంట అయ్యాక.."ఏమండీ స్నానం చేస్తే భోజనాలు చేసెయ్యచ్చు. పొద్దుటినించీ ఒకటే పని ఒత్తిడి. ఒళ్ళు హూనమయింది. ఈ రోజు త్వరగా పడుకోవాలి" అని తన ధోరణిలో తను మాట్లాడుతున్నది.


"నీ ఆఫీస్ పని, నీ గోలే కానీ..ఇంట్లో పిల్ల ఎలా ఉన్నదో?
పనిమనిషి సరిగా తిండి పెడుతున్నదో...లేదో?
పాపకి మందులు వేళ పట్టున వేస్తున్నదో..లేదో?
ఇచ్చినవి తను తింటున్నదో...పిల్లకి పెడుతున్నదో? లేక చెత్తబుట్టలో వేసేస్తున్నదో ....
అసలు కనుక్కోవా? నువ్వు ఇలా రాగానే అడిగే అవకాశం ఇవ్వకుండా అది అలా వెళ్ళిపోతుంది!
మధ్యాహ్నం పక్కింటి ఆంటీ వచ్చేసరికి...లింగమ్మ పిల్లకి చారు అన్నం మాత్రమే పెట్టి పడుకో పెట్టేసిందిట.
పిల్ల అన్నం తింటున్నంత సేపు ఆవిడ ఇక్కడే ఉన్నారుట. పప్పు అది తినేసిందేమో? అందుకే ఒట్టి చారు అన్నం పెడుతున్నదేమో ...అన్నారావిడ.
ఇలా చారు నీళ్ళతో అన్నం పెడితే ....పిల్లకి బలం ఎలా పడుతుంది?" అని గడ గడా తన ఉక్రోషం అలా వెళ్ళగక్కాడు.


"లింగమ్మ పిల్ల విషయంలో ఏ మాత్రం అశ్రద్ధగా ఉండదు. పప్పు అన్నం పెట్టకపోవటానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. రేపు అడుగుతాలెండి." అన్నది.


మరునాడు గిరిజ ఆఫీస్ కి బయలుదేరేవరకు లింగమ్మ రాలేదు. కానీ అడక్కుండా వెళ్ళనిచ్చేట్టు లేడు...శివ!


పది నిముషాలు లేట్ గా వస్తానని ఆఫీస్ కి ఫోన్ చేసి చెప్పి ముందుగదిలో కూర్చుంది.
లింగమ్మ వస్తూనే" అమ్మా పాప ఎట్లుంది? జొరం గిట్ట వచ్చిందా? నిన్న పెయ్య మెత్తగున్నది. ఈ రోజు ఎట్లైనా జొరం వస్తదని నిన్న చారూ అన్నమే పెట్టిన! పప్పు పెడితే అరగదు. వాంతులు అవుతాయని ఒట్టి చారూ అన్నమే పెట్టిన. పెరుగు కూడా పెట్టలే. నువ్వు వచ్చేసరికి ఆలశ్యమయిందని జల్ది జల్ది వెళ్ళిన!" అని పిల్లని చంకనేసుకుని, బుగ్గలు నిమురుతూ అన్నది.


పక్కనే కూర్చున్న శివ..నిన్న జరిగింది గిరిజ అడిగితే లింగమ్మ ఏం జవాబు చెబుతుందో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాడు.


లింగమ్మ చెబుతున్నంత సేపూ గిరిజ శివని..లింగమ్మని మార్చి మార్చి చూసి..ఇప్పుడు మీ సందేహానికి సమాధానం దొరికిందా! అన్నట్టు చూసి...


"వినదగునెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక
..............


అని సుమతీ పద్యం లో చెప్పినట్లు ఎవరైనా ఏమైనా చెబితే ముందు-వెనకలు ఆలోచించి..విషయం తెలుసుకుని ఒక నిర్ణయానికి రావాలి" అని లింగమ్మకి వినపడకుండా భర్తతో నెమ్మదిగా చెప్పి...


లింగమ్మ వైపుకి తిరిగి "సరే జాగ్రత్త. మధ్య మధ్యలో టెంపరేచర్ చూస్తూ ఉండు. అవసరమైతే ఫోన్ చెయ్యి." అని బయలుదేరబోతుంటే...శివ కలగ చేసుకుని


"అదేమైనా డాక్టరా? పిల్లకేం పెట్టాలో..ఏం పెట్టకూడదో? స్నానం చేయించాలా...వద్దా అని నిర్ణయించటానికి? అదేం చెబితే దానికి నువ్వు తందానా..తానా అంటావు!" అని


ఇంకా ఉక్రోషంగా.."పోయినసారి కూడా అంతే మా నాన్నకి జలుబు..దగ్గు వస్తే డాక్టర్ దగ్గరకి తీసుకెళదామంటే...ఇది మధ్యలో కలగజేసుకుని "ఇయ్యాళ పౌర్ణమి కదా అమ్మా! అమ్మవాస్యకి..పౌర్ణమికి ఒంట్లో ఏం తేడా ఉన్నా ...అది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. హాస్పిటల్ కి వెడితే వాళ్ళు. ఆమందూ...ఈ మందూ అంటూ పెద్దయ్య గారిని ఇబ్బంది పెడతారు. ఒకటి రెండు రోజులు చిట్కా వైద్యం చేసి ఓపిక పడితే...అంతగా తగ్గకపోతే అప్పుడే వెళ్ళచ్చు!" అని బోడి సలహా ఇచ్చింది." అన్నాడు.


"అది చెప్పినట్లే జరిగింది కదా! నాలుగో రోజు హాస్పిటల్ కి వెళ్ళేసరికి, ఆ డాక్టర్ 'జలుబు అనేది మందు వేస్తే వారం రోజులకి..వెయ్యకపోతే ఏడు రోజులకి తగ్గుతుంది. అప్పుడే ఐదు రోజులయింది కదా సర్! ఉదయం..సాయంత్రం ఆవిరి పట్టి, పాలల్లో పసుపు వేసుకుని తాగితే తగ్గిపోతుంది!' అని చెప్పాడు కదా?


"దాని మాటలవల్ల మనమేమి నష్టపోలేదు కదా! అది చదువుకోకపోయినా దాని వయసు..అనుభవాన్ని బట్టి తనకి తెలిసింది చెబుతుంది."


"కొన్ని విషయాలు తెలియటానికి చదువక్కరలేదు. అనుభవం చాలు. అందరూ బాగుండాలనే భావన ఉంటే చాలు."


"వినదగునెవ్వరు చెప్పిన
...........
అని సుమతీ శతకకారుడు చెప్పనే చెప్పాడు కదా! అని ముగించింది



కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం