పన్నెండు పేజీల ఈ పత్రిక ధర రెండణాలు. మొదటి పేజీలో మన నాయకుల ఐక్యతతోనే తెనుగు గడ్డకు చేవ (ఆంధ్రైక్యత) అనే వ్యాసంతో పాఠకుల చేతుల్లోకొచ్చిందానాడు.ఈ పత్రిక విజయవంతమవాలని పలువురు ఆశీస్సులు పంపారు. వాటిలో కొన్ని...శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు తమ సందేశంలో నా మిత్రులైన శ్రీ మల్లెల శ్రీరామమూర్తి గారు విజయవాడలో విజయవాణి పేరున ఒక తెనుగు వారపత్రికను స్థాపించుచున్నందుకు నాకు చాలా సంతోషము కలుగుతున్నది. ఈయన సుప్రసిద్ధ దేశభక్తుడు. పేరుగన్న జాతీయవాది. కాంగ్రెసు ఆదర్శములతో ప్రస్తుత దేశ సమస్యలనన్నిటిని సమన్వయించుచు ఆంధ్ర రాష్ట్రము స్థాపించుటకును తెనుగు జాతికి ఐక్యతను సర్వతోముఖవికాసమును కలిగించుటకును విజయవాణి విజయవంతముగా తోడ్పునని నాకు సంపూర్ణ విశ్వాసము కలదు. ఈ పత్రిక దినదిన ప్రవర్థమానమై వర్ధిల్లును గాక అని తెలిపారు.ఇక అయ్యంకి వేంకట రమణయ్యగారు విజయవాణి విజయధ్వజమెత్తి తెనుగు ప్రజనాకర్షించుగాక అని తెలుపగా శతావధాని భమిడిపాటి అయ్యప్పశాస్త్రిగారు ఓ సందేశాత్మక పద్యం పంపారు. ఖాసా సుబ్బారావుగారు, శివలెంక శంభుప్రసాద్ గారు, చిత్తూరు వి. నాగయ్యగారు, ప్రకాశం పంతులుగారు, గాడిచర్ల హరిసర్వోత్తమ రావుగారు, మంత్రులు కల్లూరి చంద్రమౌళిగారు, కళా వేంకటరావుగారు, హెచ్. సీతారామరెడ్డిగారు, మద్రాసు శాసనసభ ఉపాధ్యక్షులు కె. వెంకటస్వామి నాయుడు,"మహాపర్వదినమగు సంక్రాంతికి విజయవాణి పత్రికను తెనుగు దేశ ప్రజల ముందుకు తీసుకురాగలిగినందుకు సంతోషపడుచున్నానని" సంపాదకుడు శ్రీరామమూర్తిగారు తమ సంపాదకీయంలో తెలిపారు. తెనుగు పత్రికల సంపాదకులలో అగ్రస్థానం వహించి భావరసపూరితములగు సంపాదకీయములను చిరకాలము రచియించి కీర్తినార్జించిన విజ్ఞానధనులు కృష్ణా పత్రికాధిపతులు కీర్తిశేషులు ముట్నూరి కృష్ణరావుగారి రచనలు తనకెంతో ప్రియతములని, ఆయనను తలచుకొనుట తన ధర్మమని కూడా ఆయన చెప్పుకున్నారు. తెనుగు నాయకుల హృదయములు ఏకమై తమ ఔన్నత్యమును ప్రపంచమునకు చాటరాదా, అంతకంటె ఈ మహాపర్వదినమున తెనుగు ప్రజ కోరదగినదేమున్నదన్నారు.డాక్టర్ పుట్టపర్తి శ్రీనివాసాచార్యుల వారి వ్యాసం (పాకిస్తాన్ బాలారిష్టాలు బాపుకుంటుందా), మారేపల్లి రామచంద్రశాస్త్రిగారి వ్యాసం, మరొక చిన్ని వ్యాసం (ఏడు తరాల నైజాం) వంటివి కూడా ఈ సంచికలో ఉన్నాయి.అలాగే శతావధాని చెళ్ళపిళ్ళ దుర్గేశ్వరశాస్త్రిగారి తెనుగు బిడ్డా అనే శీర్షికతో రాసిన పద్యాలు, జమ్మలమడక మాధవ రామశర్మగారి నా మాట, కళాప్రపూర్ణ డా. చిలుకూరి నారాయణరావుగారి వ్యాసం ఇందులో ఉన్నాయి.ఈ పత్రికలో ఓ ప్రకటన ఇలా ఉంది....చిత్రకారుడు, గాయకుడు అయిన మల్లాది శ్రీరామమూర్తిగారు లలిత కళాశ్రమం (తాడేపల్లిగూడెం) తరఫున సంగీతం, చిత్రలేఖనం ఉచితంగా నేర్పబడును, ప్రభుత్వ పరీక్షలకు తర్ఫీదు ఇవ్వబడును అన్నదే ఆ ప్రకటన. అలాగే చిత్రకళకు సంబంధించిన పనులన్నీ (ఆయిల్, వాటర్ కలర్) పెయింటింగులు సరసమగు ధరలకు సకాలంలో తయారుచేయబడునని కూడా శ్రీరామమూర్తిగారు తెలిపారు.ఈ పత్రిక విడి ప్రతి రెండు అణాలు కాగా, సంవత్సర చందా ఆరు రూపాయలని, ఆరు నెలలకు చందా మూడు రూపాయల నాలుగు అణాలని పేర్కొన్నారు. ఈ పత్రిక ప్రతి బుధవారంనాడు విడుదలవుతుందని చివరి పేజీలో ఇచ్చారు. బెజవాడలోని యూనివర్సల్ ప్రింటర్స్ లో పత్రిక ముద్రితమైంది.
రెండణాల పత్రిక: -- యామిజాల జగదీశ్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి