సహాయానికి- సలహాకు మధ్య , చాలా వ్యత్యాసం ఉంటుంది! సహాయం అడిగిన వారికి స్ఫష్టత ఉంటుంది,మన నుంచి ఏమి కావాలో వారికి తెలుసు! సలహా అడిగిన వారికి , అస్ఫష్టత ఉంటుంది!అప్పుడు మనం మన సలహా చెప్పవచ్చు! అదీ సలహా మాత్రమే! అలాగే చెయ్యాలని చెప్పకూడదు!
మన వల్ల కానీ విషయాలకో పనులకో , మనం ఇతరుల మీద ఆధారపడతాం! అదేమి తప్పు కాదు! ఇతరులు కూడా అలాగే ఆధారపడతారు!
అసహాయులు ఉంటారు, వారి సంగతి వేరు!
నేను చెప్పేది సామాన్యుల సంగతి!
ఒక్కరితో కాని పనులకు,మరొకరి సహాయం అడగవలసి ఉంటుంది.అవి మన వ్యక్తిగత అవసరాలు కావచ్చు, కుటుంబ అవసరాలు కావచ్చు, సామాజిక అవసరాలు కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు- మనం ఒక్కరమే చెయ్యలేని అనేక పనులు మనకు ఎన్నో ఉంటాయి!
చదువులు ఉద్యోగాలు ఉపాధులు వ్యవసాయ వ్యాపార వాణిజ్యాలు ,స్థలాల కొనుగోలు, ఇంటి నిర్మాణం, పెళ్లి సంబంధాలు, ఇలా ఎన్నో రకాల పనులను ఇతరులతో కలిసి చెయ్యవలసి ఉంటుంది! వాటిని మనం ఒక్కరమే చెయ్యలేం! అందుకు ఇతరుల సహాయం అవసరం ఉంటుంది! అది సహాయం కావచ్చు , పెయిడ్ సర్వీసులు కావచ్చు- పెయిడ్ సర్వీసుల వారితో పెద్దగా సమస్యలు రావు ,వారు వృత్తి పనివారు,మనం ఏది చెయ్యమని పిలుస్తామో అది చేసి ,ఇచ్చింది తీసుకుని వెళ్తారు!
కానీ, సహాయం చెయ్యడానికి వచ్చే వారితో చాలా సమస్యలు వస్తాయి! సహాయం చెయ్యడానికి వచ్చే వారితో పాటు, వారి ఆలోచనలు అభిప్రాయాలు కూడా వస్తాయి!
రిజిడ్ అభిప్రాయాలు ఉన్నవారు ఉంటారు కొందరు!
మనం ఎంత చెప్పినా, వారి బుర్రలో ఉన్నదాని ప్రకారమే చెయ్యడం మంచిదని అడ్డమడ్డం పడుతుంటారు!
అవతలి వారు సహాయం అడిగారా- సలహా అడిగారా అని క్షణం కూడా అలోచన చెయ్యరు! సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అలా అయినా నయమే,కానీ తమ సలహా మేరకు చెయ్యడమే మంచిదని వాదిస్తుంటారు!
మనం సహాయం అడిగామని,సలహా కాదనీ అర్ధం చేసుకోరు!
మనం ఒక విధంగా చెయ్యాలని భావిస్తే,సహాయం చెయ్యడానికి వచ్చిన వారిలో కొందరు మరో విధంగా చెయ్యడం మంచిదని సూచిస్తారు! అందులో మళ్ళీ రకరకాలుగా ఉంటారు! ఓ సామెత ఉంది ' ఆంజనేయున్ని చేద్దాం రమ్మని సహాయానికి పిలిస్తే, వచ్చిన వారు అందరూ కలిసి కోతిని చేసారు' అని!
'పది మందిలో పాము చావదు' అని , ఇలా మరో సామెత కూడా ఉంది!
మన పని ఎటువంటి పనో , మనకు స్ఫష్టంగా తెలిసి ఉండాలి! ఆ పనికి అయ్యే ఖర్చు వగైరా ఓ అంచనా ఉండాలి! అందుకు ఓ ప్లాన్ ఉండాలి! ఎందరి సహాయం అవసరమో ,మనకు తెలిసిన వారిలో, అటువంటి సహాయం చెయ్యగల వారు ఎవరో ,ముందు మనమే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి! చాయిస్ లేకపోతే వేరే విషయం- ఉన్నంతలో ఎన్నుకోవాలి! అందరూ అన్ని పనులు చెయ్యలేరు! ఎవరి శక్తిసామర్ధ్యాలు ఏమిటో ముందుగానే గుర్తెరుగాలి!
మనం సహాయానికి పిలిచిన వారి అభిప్రాయాలను వినాలి, పనికి వస్తుందా రాదా యోచించాలి.అనవసరం అనుకుంటే పక్కన పెట్టాలి! కొందరు ఉంటారు, ఎవరు పిలిచినా ఏ సహాయానికైనా,అది ఏ పని అయినా, పిలిచిన వారి ఆలోచనలకు భిన్నంగా,తమ మెదట్లో ఉన్న మాడల్ ప్రకారమే చేద్దామని మొండిగా వాదిస్తూ ఉంటారు!
మనల్ని సహాయం అడిగిన వారికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయా లేదా అని కొందరు మాత్రమే ఆలోచిస్తారు.అడిగింది చేస్తారు. వీరితో పెద్దగా ప్రమాదం లేదు! యాతన ఉండదు మనకు!
చాదస్తులతో సమస్య ఉంటుంది- వద్దని గట్టిగా అనడానికి మొహమాటం అడ్డొస్తుంది! మనం సహాయానికి పిలిచిన వారిలో ఎవరైనా మన ఆలోచనలకు భిన్నంగా చెప్పడానికి చెయ్యడానికి ప్రయత్నం చెయ్యబోతే,మనమే కంట్రోల్ చెయ్యాలి! లేకపోతే మన కార్యక్రమాన్ని చెడగొడతారు!
మనం ఆంజనేయున్ని చేద్దామనుకుంటే,సహాయానికి వచ్చిన వారు కోతినో కొండముచ్చునో చేస్తారు!
అంచాత- మన వల్ల కాని పనులకు మనం ఎవరినైనా సహాయానికి పిలిస్తే, మనమే పని పూర్తి అయ్యేదాకా దానికి నాయకత్వం వహించాలి!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి