'మన బలం మనకి పనికి వచ్చేది ' ఎప్పుడు అవుతుంది?
బలం అంటే మీకు అర్థం అవుతుంది-అది మనకు పనికి రావడం అంటే కూడా అర్థం అవుతుంది!
కానీ, ఇక్కడ మన బలం మనకు పనికి వచ్చేది ఎప్పుడు అవుతుంది అంటే? మన బలం పుణ్యంగా మారడం అన్నమాట- పుణ్యంగా మారి మనకు ఉపయోగపడటం గురించి అన్నమాట! మన బలాన్ని మనం పుణ్యంగా మార్చుకోవడం గురించి అన్నమాట!
శ్రద్ధగా అర్థం చేసుకోవాలి!
ఈ లోకంలో మూడు వంతుల మంది మతాలను ఆచరిస్తున్నారు- అంటే దైవారధన ఉంది అని అర్థం!
అటువంటి దైవారాధకులు పాప పుణ్యాలు అనేవి ఉంటాయని నమ్ముతారు! అటువంటి వారు తమ బలాలను పుణ్యాలుగా మార్చుకోవడం గురించి ,రెండు మాటలను ఈ ఉదయం చెప్పుకుందాం!
'ఒకసారి ఈశ్వరుని పల్లకీ పట్టుకుని మోస్తే' ,మన బలం మనకు పనికి వస్తుందా? లేక 'ఓ దేవాలయ ప్రాంగణంలో చీపురు పట్టుకుని శుభ్రం చేస్తే' , మన బలం మనకు పనికి వస్తుందా? లేదా 'భగవన్మూర్తులకు కట్టి విడిచిన బట్టలు తీసుకు వెళ్ళి ఉతికి ఆరేసి తీసుకుని వెళ్ళి ఇస్తే ', మన బలం మనకు పనికి వస్తుందా? లేదా 'కాసిని పూలు సేకరించి ఓ మాలగా గుదిగుచ్చి అదిగో ఆ అమ్మవారి మెడలో వెయ్యమని ఇస్తే ' , మన బలం మనకు పనికి వస్తుందా? అంటే మన బలం పుణ్యంగా మారి మనకు పనికి వస్తుందా అని!
భగవంతుడ్ని నమ్మిన వారు, పాపపుణ్యాలను నమ్ముతారు,మీరు దేవున్ని నిజంగానే నమ్మేవారు అయితే, పాపపుణ్యాలనూ నమ్మాలి! పాపకార్యాల నుండి దూరం జరుగుతూ,పుణ్యకార్యాలను ఆచరించాలి!
పుణ్యకార్యాలు చెయ్యడం అంటే? మనం పైన చెప్పుకున్న
భగవత్సేవలు - పల్లకీ మొయ్యడం ,ప్రాంగణం ఊడ్చడం,
బట్టలు ఉతకడం ,మాలలు సమర్పించడం వగైరా కద- మనం అనుకునేవి! కానివ్వండి! వాటిని ఆచరించండి!వాటి వల్ల మీకు తృప్తి కలిగితే ,వాటినీ కానివ్వండి!
కానీ, వాటితో పాటుగా మనం మరికొన్ని విషయాల గురించి కూడా ఆలోచించాలి- ఆచరణలో పెట్టుకోవాలి!
భగవంతుడు లేదా భగవతి , ఎప్పుడూ ఎవరినీ ఏ కోరికా కోరలేదు! అవును కద? ఓరేయ్ నాయనా! నాకు ఇక్కడ ఓ గుడి కట్టమని ఎవరికైనా చెప్పాడా? చెప్పాడని ఎవరైనా చెప్తే ,మీరు నమ్ముతారా? మీ మనసుకు ఏమనిపిస్తుంది?
అయ్యో ! ఈ సకల చరాచర జగత్తును సృష్టించిన వారికి,ఓ చిన్న గుడిని సృష్టించుకోవడం తెలియదా? అగ్నిని వాయువును జలాన్ని పదార్థాన్ని శూన్యాన్ని సృష్టించి ,అందులో వృక్ష సంపదను ఇచ్చి ,సకల జీవుల
ఉనికికి కారణం అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారని మనం నిజంగానే నమ్ముతున్నామో- అట్టివారికి,వారు అవసరం అనుకుంటే ఓ ఆలయం కట్టుకోవడం ఓ లెక్కా?
ఓ ప్రసాదం వండుకోవడం ఓ లెక్కా? మన వెర్రి కాకపోతే, మనకు సర్వ ఇచ్చిన వారు మనల్ని యాచించడం ఏమిటీ ? మనం ఏమివ్వగలం? ఇవ్వగలమా నిజానికి?
అని మీకు అనిపించదా?
మీరు నిజంగానే భగవంతుని నమ్మితే, మీరు మీ తృప్తికి ఏవో మీకు నచ్చిన సేవలు కూడా చెయ్యండి! కానీ, ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి! ఈ సమస్తం భగవంతుని ప్రసాదం అని మీరు కచ్చితంగా నమ్మితే, ఈ సమస్తాన్ని అపురూపంగా చూసుకోవాలని- కాపాడాలని కూడా గుర్తించాలి- అందుకు కూడా చర్యలు చేపట్టాలి!
అతి తక్కువ వస్తువులను వాడండి చాలు!
మీ ఇంటిముందు లేదా ఇంటిమీద ఓ మొక్కను నాటండి!
వీధిలో ఆకలితో ఉన్న కుక్కకు పిడికెడు తిండి పెట్టండి చాలు- మీ బలం పుణ్యంగా మారుతుంది, మీకు పనికి వస్తుంది! అది పర్యావరణానికి- అంటే ఈ సమస్త భగవత్సృష్టికి ఎనలేని మేలు చేస్తుంది!
ఇలా ఇక్కడ ప్రారంభించి మీరు ఆలోచనలు చేస్తూ పోతే , మీకు చాలా విషయాలు అవగతం అవుతాయి! భగవంతుని తత్వము ఏమిటి అంటే అదే! ప్రకృతి తత్వం కూడా అదే!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి