గుర్తుకొస్తున్నాయి ఊలుస్వెట్టర్ :-సత్యవాణి కుంటముక్కుల-8639660566

 అప్పుడూ, ఇప్పుడూ ,ఎప్పుడూ సినీమాల ప్రభావం మనమీద తప్పక వుంటుంది.అలాంటి  ప్రభావం అప్పట్లో ఒకటి నాపైనా పడింది.
        అదేంటంటే, అప్పట్లో చాలా సినీమాల్లో హీరోయిన్,తనకు పుట్టబోయే బాబుకోసమో, పాపకోసమో ఊలు తో స్వెట్టర్లు అల్లుతున్నట్లు చూపించేవారు. సాధారణంగా భర్తకు గర్భవతినని బుల్లి స్వెట్టరు అల్లుతున్నట్లో,మేజోళ్ళు అల్లుతున్నట్లో చూపిస్తే, హీరో "అవునా?" అని కళ్ళెగరేస్తే, హీరోయిన్ సిగ్గుపడుతూ చేతులతో కళ్ళుమూసుకొంటే, హీరో హీరోయిన్ని గాలిలో పైకెత్తి గిరగిరా తిప్పేవాడు.ఇంచుమించుగా చాలా సినీమాల్లో అలాంటి సీను వుండేది.అయినా చూడడానికి బాగుండేది.
           అయితే నాకు మటుకు హీరోయిన్ పాటపాడుకొంటూ, అలవోకగా స్వెట్టరు అల్లే సీను మటుకు మనసుకు హత్తుకు పోయింది. ఎలాగైనా ఆ హీరోయిన్ లా అలవోకగా నేనూ స్వెట్టర్ అల్లేస్తున్నట్లు కలలుకూడా వచ్చేవి.
          ఆరోజుల్లో ఇప్పట్లా "స్వెట్టర్ అల్లటం ఎలా?" అని యూ ట్యూబ్ లో కొట్టి నేర్చుకోవడానికి లేదు. ఎందుకంటే,ఫోన్ మాట దేవుడెరుగు కరెంటంటేనే తెలియదు అప్పట్లోమాకు. మా  మావయ్య వాళ్ళఊరు ,రామచంద్రపురమో,మా మేనత్తా వాళ్ళఊరు కాకినాడ వెళ్ళినప్పుడో కరెంటు బుడ్డిలను (బల్బు) చూసేవారం.
         మరి సినీమాలెప్పుడు చూశావు అంటారా?రాంపురం,కాకినాడ వెళ్ళినప్పుడు చూసినవే సినీమాలన్నీ.
        మళ్ళీ స్వెట్టరులోనికి వద్దాం!
ఏదో సందర్భంలో మాఊరుర్లో, గోటేటారి లక్ష్మికి స్వేట్టర్ అల్లండం వచ్చని విన్నాను.అది మా చిన్నప్పుడే పెళ్ళై వెళ్ళిపోయింది.వాళ్ళాయన నాగార్జునసాగర్ లో పనిచేసేవాడు.ఎప్పుడోగానీ అది పుట్టింటికొచ్చేదిగాదు.
       గోటేటారి లక్ష్మికి స్వెట్టరల్లడం వచ్చునని తెలిశాకా, వాళ్ళ అమ్మా నాన్నలకంటే,దాని అక్కచెల్లెళ్ళకంటేకూడా,అది ఎప్పుడొస్తుందా? దాని దగ్గర ఎప్పుడు స్వేట్టరల్లడం నేర్చుకొందామాఅని ,కళ్ళల్లో వత్తులు వేసుకొని ఏదురు చూశానంటే మీరు నమ్మాలి.
         సరే నేను ఎదురు చూసిన ఆ శుభదినం, ఆ దేవుడిదయవలన రానే వచ్చింది.గోటేటారి లక్ష్మి పుట్టిటికి వచ్చింది.కానీ వీధి మొదలున గోటేటారిల్లు.వీధి చిగురున మాఇల్లు.
వాళ్ళింటికి వెళ్ళడంఎలా? ఎలా?పరువుగల పెద్ద కుటుంబపు వయసొచ్చిన ఆడపిల్లలు గడపదాటకూడదు.అది పధ్ధతిగాదు.
మొదటసారిగా పరువుగల పెద్దకుటుంబపు ఆడపిల్లగా పుట్టినందుకు చింతించానంటే నమ్మాలిమీరు.
           ఆరోజు నాకు అదృష్టం కలసివచ్చింది. నాన్న పొద్దుటే ఫష్ట్ బస్ కి కాకినాడ వెళ్ళేరు.చిన్నాన్న కుప్పనూర్పులతో పొలంలో వున్నాడు.అన్నయ్య అనకాపల్లిలో చదువులో వున్నాడు.
వీధిలో వుండే కరణాలందరూ,జమాబందీలకని వెళ్ళి,ప్రత్తిపాడులో వున్నారు.మొత్తానికి పెద్దకుటుంబాల, పెద్ద మగ మనుషులందరూ ఆరోజుకి  ఊళ్ళోలేరు.
           అమ్మకి నా స్వెట్టర్ పిచ్చి తెలుసు.గోటేటారి లక్ష్మికి అది అల్లడం వచ్చనీ తెలుసు.అమ్మని అడిగేను లక్ష్మిదగ్గరకు వెళతానని. "సరే! పెందరాళే వచ్చేయ్ "అంది.
       అన్నయ్య అప్పుడెప్పుడో నేనడగ్గానే, అనకాపల్లినుంచి  స్వెట్టర్ అల్లే సూదులు,రంగురంగుల ఊలు బంతులూ తెచ్చాడు.పాపం వాడంతే, ఏంకావలన్నా తెచ్చిపడేసేవాడు.రంగుదారాలూ అవీకూడా అలాగే అడిగితేచాలు తేచ్చిపడేసేవాడు.
      సరే ,మిట్టమధ్యాహ్నం వేళ బాగా తయారై, గోటేటారింకి వెళ్ళాను.నీకు స్వెట్టరల్లంవచ్చుటకదా!నాకు నేర్పవా అని అడిగాను లక్ష్మిని. సరేనంది అది.
        సంచిలోంచి సూదులూ ,ఊలుండలూ తీసి ఇచ్చాను. "ఇలాచూడు అంటూలక్ష్మి , అసలే సన్నగా,పొడవుగా తెల్లగా ,నాజూకుగా,అందంగా వున్న వేళ్ళను గమత్తుగా కదిలిస్తుంటే చూడడానికి చెప్పొద్దూ ,ఏంతో ముచ్చటగా అనిపించిందినాకు.
      నేను దానివేళ్ళకేసి తన్మయత్వంతో చూస్తుంటే, అది చకచకా సూదిమీద రింగులు వేసేసింది."అయ్యో! అదే అల్లేస్తోందేమిటి, నాకు నేర్పకుండా?" అని  తెగ ఆందోళనపడిపోయాను."నాకు నేర్పవా ?"అన్నట్లు ఆశగా లక్ష్మి మొఖం కేసి చూస్తున్నాను.
            ఇంతలో పాలికాపు రాంబాబుగాడు వచ్చేశాడు కంగారు పడుతూ. "పెదపాపగారూ!పెదపాపగారూ!నాన్నగారొచ్చేరండి బస్ దిగి,అమ్మగారు వున్నఫళంగా మిమ్మల్ని వచ్చేమంటున్నారండీ!"అన్నాదు.
       నెత్తిమీద పిడుగు పడినట్లైయ్యింది. గబగబా నడవడానికి అడుగులు పడటంలేదు.
భయంతో గుండెలు దడదడలాడుతున్నాయి. ఎలా ఇంటికి వచ్చిపడ్డానో నాకే తెలియదు.
       నాన్న వసారాలో పాగాకొర్రునున్న చొక్కా తొడుక్కొంటున్నారు. చొక్కా వేసుకోవడం ఆపి,నన్నుచూసి, "ఎక్కడకెళ్ళావమ్మా? "అన్నారు.
     " గోటేటారి లక్ష్మివచ్చింది నాన్నా!దానికి స్వెట్టర్ అల్లడంవచ్చుట ,నేర్చుకొందా..."
      నామాట ఇంకా పూర్తికానేలేదు.
"చూడమ్మా! నీకొటే  చెపుతున్నాను.(ఆమాట ఆయనకు ఊతపదం )మన ఇంటికి ఎవరేనా రావచ్చు కానీ ,మనమెవరింటికీ వెళ్ళకూడదు."అన్నారు నెమ్మదిగా ఆయన సహజ ధోరణిలో.అప్పుడే అనిపించింది కర్మ జాలక ఈ పేద్ద కుటుంబంలో పుట్టేనని "అంతే ,ఆమాటే మానాన్న అన్నది.ఆయన నన్ను
తిట్టలేదు,కొట్టలేదు, హన్నా అని గదమలేదు.
     కానీ ఆయనన్న అమాటలే నన్ను  తిట్టినట్టు, కొట్టినట్టు,శాసించినట్లూ భావించాను. "నేనేవన్నా తప్పుపని చేశానా? స్వెట్టర్ అల్లటం నేర్చుకోవడానికే కదా నేను వెళ్ళిందీ!అని. నాన్న అన్న ఆ ఒక్కమాటా నాకు గొప్ప అవమానమనిపించింది .ఆయన అంతమాట అన్నందుకు మూడురోజులు ఏడిచాను. ముక్కూ మొఖం వాచిపోయేలాగ.నాలుగైదు రోజులవరకూ నాన్నకి ఎదురుపడలేదు.
           ఐతే నేనాడు అంతబాధ పడ్డాను కానీ,అప్పట్లో ఇంచుమించుగా ప్రతీ పల్లెల్లోనూ ,ప్రతీ కుటుంబంలోనూ, అది మామూలే.పెద్దదైన ఆడపిల్ల పేళ్ళై అత్తింటికెళ్ళేవరకూ అలానే  వుండాలి.
        ఏదేమైతేనేం!మొత్తానికి ఎన్నెన్నో నేర్చుకొన్నానుకానీ ,నేను స్వెట్టర్ అల్లడం నేర్చుకోకుండానే, నా పిల్లలు సినీమా హీరోయిన్  పిల్లల్లా నేనల్లిన స్వెట్టర్ వేసుకోకుండానే పెరిగి పెద్దవాళ్ళైపోయారు.వాళ్ళపిల్లలకు కూడా నేనల్లిన స్వెట్టర్ తొడిగి ముచ్చట తీర్చుకోలేకపోయాను.
      
           
కామెంట్‌లు