ఎలుగుబంటి పథకం: -డి.కె.చదువులబాబు.ప్రొద్దుటూరు.కడపజిల్లా.9440703716.


 ఒక అడవికి సింహం రాజుగా ఉండేది. ఆసింహం పంచన చేరి, తనమాటల చాకచక్యంతో వేగుగా పని సంపాదించింది తోడేలు.అడవిలోని సంగతులు  సింహానికి చెప్పడమే దాని పని. మృగరాజు దగ్గర తన పలుకుబడిని చూసుకుని, తోడేలు విర్రవీగేది.కంటపడిన ప్రతి చిన్న జంతువునూ ఆకలి లేకున్నా చంపి తినేది. విపరీతంగా తిని, బాగాబలిసి పోయింది. బద్దకంతో వార్తలకోసం అడవిలో తిరగడం తగ్గించింది.ఏదో ఒకటి చెప్పి రోజులు గడిపేది.రోజురోజుకూ దాని ఆగడాలు మితిమీరిపోయాయి.'దాని ప్రవర్తన గురించి చెబితే సింహం నమ్మదు. తర్వాత తోడేలు పగపెంచుకుని తమపై లేనిపోని చాడీలు సింహానికి చెబుతుంది. తాము సింహం చేతిలో శిక్షకు గురికావలసి వస్తుంది' అని జంతువులు భయపడేవి.

ఒకరోజు ఒక చిన్న జింకను తోడేలు చంపబోయింది.ఆజింక జాగ్రత్తగా ఉండటంతో చిన్నగాయంతో తప్పించుకుంది.

ఆఅడవిలో ఒక ఎలుగుబంటు ఉంది. అది తనతండ్రి ద్వారా ఆకుపసరువైద్యం నేర్చుకున్నది.మాంసాహారం ఆరోగ్యానికి మంచిది కాదని, ఆఎలుగు శాఖాహారం తినేది.వైద్యం కోసం ఎలుగు దగ్గరకెళ్ళింది జింక.గాయం ఎలా తగిలిందో చెబుతూ, తోడేలు ఆగడాలగురించి వివరించింది. తోడేలు పీడ వదలాలంటే ఏంచేయాలో అర్థంకావడంలేదని జింక బాధపడింది. దానిమాటలు వింటుంటే ఎలుగుకు చాలా బాధ కలిగింది. "నేను తోడేలు బారినుండి అల్పప్రాణులను కాపాడుతాను''అంది. ఎలుగుబంటు జింకగాయానికి ఆకుపసరువైద్యం చేసి పంపించింది. అక్కడ చెట్టుమీదున్న కోతిని దగ్గరకు పిలిచింది. తోడేలు పీడవదిలించడానికి నీసహాయం కావాలంది.

"నేనూ ఆసమయం కోసం ఎదురుచూస్తున్నాను.ఏంచేయాలోచెప్పు?"అంది కోతి. ఎలుగుబంటు ఒక ఉపాయం చెప్పింది.ఒక పెద్దఆకును దోనెలాగా మడిచి కోతికిచ్చిందిఎలుగు.కోతి తనజాతి కోతులన్నింటిని సమావేశపరిచి ఏమిచేయాలో చెప్పింది. ఒకకోతి మరొకకోతి వెంట్రుకలనుండి పేలను ఏరి, ఆదోనెలో వేశాయి.దోనెనిండుగా ఉన్న పేలను తీసుకుని వెళ్ళి, సింహం గుహ ఎదురుగా కొద్దిదూరంలో ఉన్న చెట్టు వద్దకు చేరింది కోతి.అవకాశంకోసం ఎదురుచూసి, సింహం నిద్రిస్తున్న సమయంలో మెల్లిగా వెళ్ళి, పేలను సింహం జూలులో వదిలివచ్చింది.

రాత్రంతా పేలు కుడుతుంటే నిద్రలేక అల్లాడిపోయింది సింహం.

ఉదయమే గుహనుండి బయటకు వచ్చిన సింహానికి ఎదురుగా చెట్టుక్రింద కోతి కనిపించింది.సింహం కోతిని పిలిచి, జూలులో పేలుచేరాయి. ఏరివేయమంది. కోతి తన మిత్రులైన కోతులను పిలిచి, పేలను తీసేసింది. "మహారాజా!కొన్నిపేలుగాని, వాటి గుడ్లుగాని కనిపించక మిగిలిపోయి ఉంటే కొద్దిరోజులకు పిల్లపేలు తయారవుతాయి.పూర్తిగా వాటిని వదిలించడం మాతో కాదు. మన ఎలుగుబంటి పేలు పూర్తిగా పోవడానికి ఏదోవైద్యం ఉందని చెప్పింది. అక్కడికి వెళ్దాము రండి" అనిచెప్పి సింహాన్ని ఎలుగువద్దకు తీసుకెళ్ళింది.

ఎలుగు సమస్యవిని,"అదెంతపని.బలిసిన తోడేలు రక్తాన్ని జూలుకు రాసుకుని, కొద్దిసేపటి తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది. జన్మలో పేలురావు.ఇంతకుమించిన వైద్యం లేదు" అంది.

వెంటనే సింహానికి తన వేగుతోడేలు గుర్తుకొచ్చింది."నాదగ్గర బలిసిన తోడేలు ఉందికదా!మరి దాన్ని చంపితే నాకు వార్తలు ఎవరు చేరవేస్తారూ ?" అంది సింహం. "మహారాజా!ఈకోతిని వేగుగా నియమించుకోండి. సమర్థవంతంగా పనిచేస్తుంది"అందిఎలుగు.

సింహం అంగీకరించింది. గుహకు వెళ్ళింది. తనవద్దకు వచ్చిన తోడేలును చంపి, రక్తాన్ని జూలుకు రాసుకుంది. కొద్దిసేపటి తర్వాత స్నానంచేయడానికి బయటకు నడిచింది. తోడేలు పీడ వదిలినందుకు జంతువులు సంతోషించాయి.ఎలుగును,కోతిని అభినందించాయి.


కామెంట్‌లు