మనసున్న మర్రి ( కమ్మని వూహలు - అందమైన అబద్దాలు ) డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 పిల్లలూ... గిజిగాడు అనే పక్షిని మీరెప్పుడైనా చూశారా... ముద్దుగా చిన్నగా గోధుమరంగులో పసుపుపచ్చని రెక్కలతో చూడముచ్చటగా వుంటాది. గుర్తు రావడం లేదా... సరే ఇంకో విషయం చెబుతా... వూరి బైట తుమ్మచెట్ల కొమ్మలకు గడ్డిపోచలతో ఉయ్యాలలాగా చక్కనైన గూడు అల్లుకోని వుంటాది. ఏ పక్షీ అంత అందమైన గూడు అల్లలేదు. మరి దానికి అంత పనితనం ఎట్లా వచ్చిందో తెలుసుకోవాలని వుందా... ఐతే.... ఈ కథ వినండి.
ఇది ఎప్పట్లాగే చాలాచాలా ముందుకాలం సంగతి. అప్పటికి గిజిగాడు కూడా అన్ని పక్షులలాగే కట్టెపుల్లలతో పిచ్చిపిచ్చిగా చిన్న గంపలాగా చెట్ల మీద గూడు కట్టుకునేది. ఒకసారి గూట్లో గుడ్లు పెట్టుకొని పొదిగింది. చిన్నచిన్న పిల్లలు పుట్టాయి. ఇంకా రెక్కలు రాకపోవడంతో అపురూపంగా చూసుకోసాగింది. అంతలో అనుకోకుండా వూహించలేనంతగా పెద్దగాలి వచ్చింది. గిజిగాని గూడు చెట్టు పైనుంచి కింద పడి పిల్లలు చచ్చిపోయాయి. పాపం అది చూసి గిజిగాడు తట్టుకోలేకపోయింది. ''ఛ... ఛ... ఈ గాలిదేవునికి కొంచం గూడా బుద్ధి లేదు. వీని మీద బండ పడ. చిన్నచిన్న పిల్లల్ని అన్యాయంగా చంపేశాడు'' అని తిట్టిన తిట్టు తిట్టకుండా నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టింది. ఆ మాటలినేసరికి గాలిదేవునికి చాలా కోపమొచ్చింది. ''ఏమే... నా పిడికెడంత గూడా లేవు. నన్నే అన్ని మాటలంటావా... వుండు. చెప్తా నీ సంగతి'' అన్నాడు.
ఆ రోజు నుంచి గిజిగాడు గూడు కట్టుకోవడం ఆలస్యం... రయ్యిమని ఒక్కసారిగా గాలి వీచేది. ఆ దెబ్బకు గూడంతా చెల్లాచెదురయి పుల్లలన్నీ తలా ఒక దిక్కు పడిపోయేవి. అంతేగాక గాలిదేవుడు అది ఏ చెట్టు మీద గూడు కట్టేదో ఆ చెట్టును గూడా చెల్లాచెదురు చేసేవాడు. దాంతో చెట్లన్నీ భయపడి మా వద్దకు రావొద్దంటే మా వద్దకు రావొద్దంటూ గిజిగాన్ని తరిమివేసేవి. ఎంత పెద్దచెట్టు దగ్గరికి పోయినా ''మేమెంత. మా బతుకెంత. గాలిదేవునికి కోపమొస్తే ఎంత పెద్ద చెట్టయినా సరే కూకటి వేళ్లతో సహా కూలిపోవాల్సిందే'' అన్నాయి. పాపం... గిజిగాడు తిరిగీ తిరిగీ అలసిపోయింది. అప్పుడు దానికి మర్రిచెట్టు కనబడింది. 'ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. దీనినీ ఓ మాట అడిగి చూద్దాం. పోయేదేముంది' అనుకోని మర్రిచెట్టు దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పింది.
మర్రిచెట్టు చాలా మంచిది. అప్పట్లో అది గూడా మామిడిచెట్టులాగా, వేపచెట్టులాగా చిన్నగానే వుండేది. కానీ దానికి చిన్న చిన్న వూడలుండేవి. అవి గాలిలో సగం వరకూ వేలాడుతుండేవి. మర్రిచెట్టు గిజిగాడు చెప్పిందంతా విని ''అరెరే... ఎంతన్యాయం. మనిషయితేనేమి, దేవుడయితేనేమి బలముంది కదాని మరీ అంత విర్రవీగగూడదు. సరే...రా... నా కొమ్మల్లో గూడు కట్టుకుందువుగానీ'' అంది. ఆ మాట విని మిగతా చెట్లు ''చూడు... గడ్డపారలే గాలికెగిరిపోతోంటే గుండుసూదులు రొమ్ము విరుచుకోని నిలబడ్డట్టు అనవసరంగా దారిన పోయే తద్దినాన్ని నెత్తి మీదకు తెచ్చుకోవద్దు. గాలిదేవుని గురించి నీకు తెలీదు'' అని భయపడించాయి.
దానికి మర్రిచెట్టు ఏ మాత్రం బెదరకుండా ''నాకు గాలిదేవున్ని ఎదిరించేంత శక్తి లేకపోవచ్చు గానీ పాపం ఈ చిన్నపక్షిని కాపాడాలనే కోరిక మాత్రం వుంది. ఆపదలో ఆదుకోమని అడిగిన వాళ్ళు శత్రువులైనా సరే చేతనైనంత సాయం చేయాలని పెద్దలు చెబుతారు. చూద్దాం న్యాయం గెలుస్తాదో, దేవుడు గెలుస్తాడో'' అంది.
ఆ మాటలినే సరికి గాలిదేవుడు రెచ్చిపోయాడు. ఆ వేగానికి చెట్లన్నీ గజగజా వణికిపోయాయి. భూమ్మీదుండే దుమ్మంతా ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరింది. పెద్ద పెద్ద చెట్లన్నీ భయంతో తలలు వంచుకోని వినయంగా నిలబడ్డాయి. కానీ మర్రిచెట్టు ఏ మాత్రం భయపడలేదు. ఎట్లాగయినా సరే ఆ చిన్న పక్షిని కాపాడాలని వేళ్ళతో భూమిని గట్టిగా పట్టుకొంది. కానీ నిమిష నిమిషానికి గాలి వేగం పెరిగిపోతా వుంది. ఆకులన్నీ చెల్లాచెదురయిపోతున్నాయి. చిన్న చిన్న కొమ్మలన్నీ ఫటఫటఫట విరిగిపోతున్నాయి. భూమిలో వేళ్ళు కదుల్తా వున్నాయి. ఏ క్షణమైనా పట్టుతప్పి పోయేలా వుంది. ఎలా... ఎలా... ఈ చిన్నపక్షిని కాపాడ్డం ఎలా అని మర్రిచెట్టు తీవ్రంగా ఆలోచిస్తా వుంటే మర్రిచెట్టుకి మెరుపులా ఆలోచన వచ్చింది. వెంటనే తన శక్తినంతా వూడల్లోకి పంపుతా వాటిని కొంచం కొంచం పెంచసాగింది.
చూస్తుండగానే వూడలు నేలను తాకేంతగా పెరిగిపోయాయి. వెంటనే ఒకొక్క వూడను నేలలోకి దించడం మొదలు పెట్టింది. కాసేపట్లోగా చెట్టు మొదలు చుట్టూ అనేక వూడలు ఒకదాని తరువాత ఒకటి భూమిలోకి దిగాయి. దానితో ఎంతటి గాలినయినా సరే తట్టుకొని నిలబడేంత శక్తి వచ్చేసింది. గాలిదేవుని కోపం పెరిగిపోతా వుంది. మరింత... మరింత... వేగం పెంచసాగాడు. కానీ మర్రిచెట్టును ఏమీ చేయలేకపోయాడు. చివరికి అలసిపోయి నీరసంగా కూలబడ్డాడు.
మర్రిచెట్టు మాత్రం నిబ్బరంగా వూడలను భూమిలోకి దింపుతా, వేళ్ళను మరింత లోపలికి పంపుతా, కొత్తగా కొమ్మలు వేస్తా, ఆకులు వేస్తా పెరగసాగింది. ఇంక దానిని ఏమీ చేయలేనని అర్థం చేసుకొని గాలిదేవుడు వెళ్ళిపోయాడు. 
దానితో గిజిగాడు సంబరంగా ''ఇంక నేను నీ కొమ్మల మీద గూడు కట్టుకొని హాయిగా పిల్లలను పెట్టుకుంటాను. నువ్వు తోడుంటే జీవితాంతం ఇంక నన్నెవరూ ఏమీ చేయలేరు'' అంది.
దానికి మర్రిచెట్టు చిరునవ్వు నవ్వి ''నిన్ను కాపాడగలను. కానీ అవసరమైనప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఇతరుల సాయం పొందాలే గానీ... ఎప్పుడూ వాళ్ళ మీదే ఆధారపడి బ్రతకాలనుకోగూడదు. గాలిదేవుడు నిన్ను ఏమీ చేయలేని విధంగా సొంతంగా ఒక గూడు తయారు చేసుకోగలవేమో బాగా ఆలోచించు. ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఈ లోకంలో ఏదీ లేదు'' అంది.
ఆ మాటలకు గిజిగాడు ఆలోచనలో పడింది. ''మర్రిచెట్టు చెప్పింది నిజమే. ఎవరి కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి. లేకుంటే చులకనై పోతాం'' అనుకొంది. అనేక పక్షులు కట్టుకున్న గూళ్ళను పరిశీలించింది. కానీ ఏవీ గాలిదేవున్ని తట్టుకునేలా లేవు. ఎలా... ఎలా.. అని ఆలోచిస్తా రకరకాల గూళ్ళను తయారు చేయసాగింది. కానీ ఏ ఒక్కటీ నచ్చడం లేదు. అది నిరాశ పడినప్పుడల్లా మర్రిచెట్టు ''పరవాలేదు మిత్రమా... ఒక్కరోజుతో ఎవరూ ఏమీ సాధించలేరు. ప్రయత్నించు'' అంటూ ఉత్సాహపరచసాగింది. ఒకరోజు గిజిగాడు ఆలోచిస్తా వుంటే దానికి ఒక నత్త కనబడింది. అది అందులో భద్రంగా దాక్కోవడం గమనించింది. ''నిజమే... ఇలా భద్రంగా లోపల హాయిగా దాచిపెట్టుకునేలా ఒక గూడును అల్లాలి'' అనుకొంది. పుల్లలతో లాభం లేదని తేలికయిన గడ్డిపరకలను తీసుకొని ఒకదానితో ఒకటి పెనవేస్తూ అద్భుతంగా ఒక గూడును అల్లింది. లోపల రెండు గదులు చేసి క్రింద గుడ్లు పెట్టడానికి పైన తాను కూర్చోవడానికి అనువుగా చేసింది. మెత్తని పరుపు ఏర్పాటు చేసుకుంది. 
కానీ ఆ గూడును ఎక్కడ పెట్టినా అది గాలికి పడిపోతూనే వుంది. అప్పుడు పెద్ద పెద్ద చెట్లుగాక చిన్నచిన్న చెట్లు గాలితోబాటు వంగిపోతూ ఏమీ కాకపోవడం చూసింది. దాంతో ఒక తుమ్మచెట్టు కొమ్మకు తాడులాగా పైన ముడి వేసి వేలాడదీసింది. దాంతో ఎంత గాలి వీచినా గూడు పడిపోవడము లేదు. అది చూసి మర్రిచెట్టు ''శభాష్‌ మిత్రమా.. సాధించావు'' అని మెచ్చుకుంది.
అది చూసి గాలిదేవునికి చాలా కోపమొచ్చింది. దానిని పడగొట్టాలని వేగంగా వీయసాగాడు. కొమ్మ వంగుతా వుంది. గూడు వూగుతా వుందే గానీ కొంచం గూడా చెక్కు చెదరలేదు. ఆఖరికి ఒక చిన్న పక్షిని గూడా ఏమీ చేయలేకపోతున్నానే అని బాధపడి వానదేవుని దగ్గరికి పోయాడు. ''మిత్రమా... నాకు చాలా అవమానంగా వుంది. నన్నంటే ఎదిరించారు గానీ మనిద్దరం కలిసి ఒకేసారి వస్తే ఎట్లా తట్టుకుంటారో చూద్దాం దా'' అని పిలుచుకోనొచ్చాడు.
అది చూసిన మర్రిచెట్టు ''స్వాముల్లారా! మీకు చెప్పేంతదాన్ని కాదు. అట్లాగే కలకాలం ఎదిరించి నిలబడేంత శక్తి వున్నదాన్నీ కాదు. ఏదో పాపం... కడుపుతీపితో కళ్ళ ముందే కన్నబిడ్డలు చచ్చిపోతే తట్టుకోలేక నాలుగు మాటలు తిట్టిందే అనుకో... దానికి ఇంతగా సాధించాలా... తప్పు చేసినా కన్నబిడ్డలా కడుపులో పెట్టుకోని కాపాడుకునేటోళ్ళు దేవుళ్ళవుతారు గానీ.... కన్నుమిన్ను గానక పగబట్టి పూనకం వచ్చినోళ్ళ మాదిరి వూగిపోయేటోళ్ళు దేవుళ్ళెలా అవుతారు'' అంది. ఆ మాటలకు గాలిదేవుని మనసు కళుక్కుమంది. చేసిన తప్పు తెలుసుకోగానే కళ్ళ నుంచి నీళ్ళు జలజలా కారాయి. మౌనంగా తలొంచుకోని వానదేవునితో కలసి తిరిగి వెళ్ళిపోయాడు.
కామెంట్‌లు