ఎన్నో బలిదానాల ఉక్కు సంకల్పబలం సాకారం
మహనీయుల ఉద్యమంతో ఉద్భవించిన త్యాగఫలం
మరెందరో భూదాన మహనీయులు సాధించిన విజయం
ఎన్ని ఉద్యోగాలకు నిరంతర భద్రత అభయమిచ్చిందో..!
తన ఉక్కునరాల యినుప కండలతో
ఎందరిని సుఖీ భవంటూ దీవించిందో!
ఎన్నెన్ని మైలురాళ్ళు అధిగ మించిందో
తన త్యాగ నిరతితో ఎన్ని ప్రాణాలు కాపాడిందో!
ఎన్ని యంత్రాలకు కొత్త ఊపిరి పోసిందో!
ఎన్నివేల కుటుంబాలు వీధిన పడకుండా వేదికైందో!
ఎన్నెన్ని బతుకుల భవితవ్యాలకు భరోసా నిచ్చిందో!
అన్ని రోగాలకు ఒకటే ఔషధం కానట్టు
ప్రైవేటీకరణ సర్వరోగ నివారిణి కాదనే నగ్నసత్యం
ప్రభుత్వ ఆస్తి ప్రైవేటు ఖాతాలో జమ చేయటం
వెచ్చని దేహంపై పచ్చి గాయాలు రగల్చడమే!
మల్లెపూల వస్త్రాలను మురికిలో ముంచడమే!
పాలకుల ప్రైవే'టు కుయుక్తుల వలలో చిక్కి
గత వైభవం తలుచుకుంటూ ఉక్కు కర్మాగారం
వొళ్ళు జలధరిస్తూ గజగజ వణుకుతోంది!
తన రుధిరం క్షీరంగా మార్చే శ్రమజీవి కామధేనువు
పాలిచ్చిన దినాలు పండుగ చేసుకునే వైనం
జవజీవం తగ్గిందని కసాయి కమ్మటం అవివేకం!
విశాఖ ఉక్కు మన ఆత్మ గౌరవ హక్కు..
పదండి!ఉప్పెనలా ఉద్యమిద్దాం!
లక్షలక్షర శరాలు సంధించి ప్రశ్నించే గొంతుకవుదాం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి