వ్యతిరేకి:---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి.మొబైల్: 9908554535.


 సిరిపురం గ్రామానికి చెందిన గంగాధరం అతని తల్లికి ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడేవాడు .ఆమె ఏ పని చెప్పినా అందుకు వ్యతిరేకంగా చేసేవాడు.

          ఒకసారి అతని మిత్రులు గంగాధరం ఇంటికి వెళ్లి తాము విహారయాత్రకు వెళ్లుతున్నామని అతనిని తమతో రమ్మని ఆహ్వానించారు. వెంటనే అక్కడే ఉన్న అతని తల్లి కమలమ్మ "మావాడు తప్పకుండా వస్తాడు. వాడిని తీసుకుని వెళ్ళండి" అని అంది. ఆ మాటలు లోపలనుండి  విన్న గంగాధరం తాను యాత్రకు రానని చెప్పేశాడు .మిత్రులు ఈ మాటలు విని నిరాశ చెందారు.

        కొన్ని రోజుల తర్వాత ఒక వాస్తు పండితుడు వారి ఇంటికి వచ్చి ఇల్లును గమనించి వారి ఇంటికి తూర్పు దిక్కున ఒక కొత్తగా ఒక ద్వారం పెట్టించమని కమలమ్మకు  సూచించాడు .అప్పుడు గంగాధరం ఇంట్లో లేడు .తన కుమారునికి ఈ విషయం చెబితే అంగీకరించడని కమలమ్మకు తెలుసు .అందుచేత ఆమె  అతని మిత్రులను పిలిచి ఈ విషయం చెప్పింది. వారు ఆమెను గంగాధరంకు పడమర దిక్కున  ద్వారం పెట్టించమని  చెప్పమన్నారు .గంగాధరం తల్లికి ఎలాగూ వ్యతిరేకంగా మాట్లాడతాడని ,'పడమర 'అని ఆమె అంటే 'తూర్పు ' అని అతడు అంటాడని వారి ఊహ . అలా అతడు తూర్పు వైపు ద్వారం పెట్టిస్తే ఆమె అనుకున్న కోరిక నెరవేరుతుందని వారు సలహా ఇచ్చారు .ఈ సలహాకు  సంతోషించిన కమలమ్మ గంగాధరం ఇంటికి వచ్చిన తర్వాత పడమర వైపు ఒక కొత్త ద్వారం పెట్టించ మంది . "అలాగే" అన్న గంగాధరం మాటలు విని ఆమె విస్తుపోయింది .

        ఈసారి కొడుకు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడలేదో ఆమెకేమీ బోధపడలేదు. ఆమె చెప్పిన ప్రకారమే అతడు పడమర వైపు అవసరం లేకపోయినా కొత్తగా ఒక ద్వారం పెట్టించాడు. దానితో కమలమ్మ నోరు మూసుకుని ఉంది .కానీ నిజం చెప్పలేదు .

           గంగాధరంకు సాధువులంటే  చాలా భక్తి అని మిత్రుడు ఒకడు  గ్రహించాడు.ఒక సాధువుతో తల్లికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని మందలింప చేశాడు. గంగాధరం ఆ రోజు నుండి   తన ప్రవర్తనను మార్చుకున్నాడని ,ఇకముందు తల్లికి వ్యతిరేకంగా మాట్లాడడని అతని తల్లికి కానీ మిత్రులకు కానీ పాపం తెలియదు. అందుకే మనం తలచినది ఒకటైతే ఒక్కొక్కసారి జరిగేది మరొకటి అవుతుంది.


కామెంట్‌లు