ఆహార చైతన్యం:-తుమ్మేటి రఘోత్తమరెడ్డి

 కొన్ని విషయాలు తెలువ వలసిన సమయంలో తెలువక పోవడం వల్ల, నష్టపోయిన తర్వాత తెలుసుకోవలసి వస్తుంది! సరైన సమయంలో చెప్పగల వారు ఉంటే?
కోవిడ్ వైరస్ పుణ్యాన ప్రపంచానికి ఆహార చైతన్యం పెరిగింది! ఇంతకు ముందు క్యాంటిటి గురించి ,టేస్ట్ గురించి పట్టింపులు ఉంటే,ఇప్పుడు క్వాలిటీ గురించి ఇమ్యునిటీ గురించి పట్టింపులు ప్రారంభం అయ్యాయి!
శుభ పరిణామం!
ఇటీవల- వారం క్రితం మిద్దెతోట పరిచయాన్ని బిబిసి వారు ప్రసారం చేశారు. నాలుగున్నర నిముషాల వీడియోను గత వారం రోజుల్లో , రెండు లక్షల ముప్పై వేల మంది చూసారు!
ఓ పదిహేడు వందల మంది షేర్ చేసుకున్నారు!
మరెందరో లైకులు కొట్టారు- కామెంట్లు రాసారు!
ఇలా ,ఇంతలా ,మిద్దెతోట పరిచయానికి రెస్పాన్స్ రావడం గత ఆరు సంవత్సరాలలో ఇదే మొదటిసారి!
బిబిసి నెట్వర్క్ ఎంత పెద్దది అయినా, గత పన్నెండు నెలలుగా ప్రజల్లో పెరిగిన ఆహార చైతన్యానికి అదొక సూచన అని భావిస్తున్నాను!
ఆహార చైతన్యం గురించి- అది మనకు చెయ్యగల మేలు గురించి - ప్రకృతి ఆహారాన్ని ఎలా మిద్దెల మీద పండించుకోవచ్చో , గత ఆరు సంవత్సరాల నుండి ప్రచారం చేస్తూ వస్తున్నాను! ఇప్పటికి‌ కానీ, లక్షలు కాదు తెలుగు వారిలోనే ఇవాళ కోట్లాది మందికి మిద్దెతోట సాగు చైతన్యం తెలిసింది! ఆ చైతన్యం వృధా పోదు! క్రమంగా ఫలిస్తుంది!
అలాగే , ప్రయాణాలలో తినవలసిన తిండి గురించి కూడా చెప్పుకోవాలి! నా మటుకు నేను ఏం తినడానికి ప్రాధాన్యత ఇస్తానో చెప్తాను! ఇదిగో ఉదయం టిఫిన్ కోసం పది ఖర్జూర పండ్లు, లైట్ గా వేపిన గుప్పెడు వేరుశనగ గింజలు మాత్రమే! ఇందులో ఉప్పు నూనె మసాలాలు వగైరా ఏమీ లేవు! అసలు సిసలైన ప్రకృతి ఆహారం! సంపూర్ణ పోషకాహారం- జీవశక్తి పుష్కళంగా ఉన్న ఆహారం!
సులభంగా నెమ్మదిగా జీర్ణం అవుతుంది!
కనీసం ఒకపూట అయినా, వండని ఆహారం తినండి!
రైల్లలో అమ్మే టిఫిన్లను సాధారణంగా అయితే తినను! వాటిల్లో నాణ్యత శుభ్రత జీవశక్తి బలవర్ధకత ఉండవు! అనారోగ్యాన్ని కొనుక్కుని తినడమే! 
ఇంట్లో నుండి బయలుదేరే ముందు ఇలాంటి అమృతాహారాన్ని ప్యాక్ చేసుకోవాలి! అశ్రద్ధ చెయ్యొద్దు!
తినేది బ్రతకడం కోసమే!
అదీ , ఉన్నంత వరకు ఆరోగ్యంగా బ్రతకడానికి!
కొందరు నూనెలో వేయించిన పూరీ వడ పులిహోర చికెన్ మటన్ చేపలు వంటి క్రూరమైన ఆహారాన్ని తయారు చేసుకుని తిని నానా అవస్థలు పడతారు!
నేను విద్యార్ధుల కోసం చెబుతున్నాను సుమా!
దేశ ముదుర్లకు కాదని మనవి!
కామెంట్‌లు