హంస ఉపదేశము (బుజ్జిపిల్లలకు బుజ్జికథ):౼ దార్ల బుజ్జిబాబు

          మృగరాజు సింహానికి గుండెపోటు వచ్చింది. 
        వైద్యులు పరీక్షించి ఇలా అన్నారు.
       "రాజా! మీ గుండెలో కొవ్వు పేరుకుపోయింది.
        అది రక్త సరఫరాను అడ్డగిస్తుంది. 
       ఏ క్షణంలోనైనామీ గుండె ఆగిపోవచ్చు. 
       మీరు బ్రతకటం కష్టమే. 
       మేమేమీ చేయలేం" అని చెప్పారు. 
      నఅప్పటి నుండి సింహానికి మరణ భయం పట్టుకుంది.  
      నిరంతరం ఆలోచిస్తుంది. 
       వేదనతో కృంగిపోతుంది.
       అదే సమయంలో ఓ హంస వచ్చింది. 
       అది సర్వ శాస్త్రాలు చదివింది. 
       సన్యాసం తీసుకుని సాధు జీవితం గడుపుతుంది..
       తెల్లని వస్త్రాలు ధరించి ఊరూరు తిరిగుతూ ఉపదేశం చేస్తుంది. 
       కష్టాలలో ఉన్న వారికి ఉచితంగా సలహాలు ఇస్తు పరిష్కారాలు చూపుతుంది. 
        పరుల సేవకే తన జీవితం అంకితం చేసింది.
        హంస వద్దకు వచ్చి సమస్య చెప్పింది సింహం. 
       అంతా విని హంస ఇలా అంది.
       "రాజా! మీరు మాంసాహారులు.
        జీవులను చంపుతారు. 
       పాపం మూట కట్టుకుంటారు. 
       అందుకే మీకు ఈ జబ్బులు.
       మీ జీవన విధానం, ఆహార అలవాట్లు మార్చుకోండి. 
       తప్పక బ్రతుకుతారు" అన్నది హంస
       "నేను మాంసం మాని  గడ్డీగాదాము తినలేను. 
       మరి ఎలా?" అని అడిగింది సింహం
       “మీరు దిగులు పడకండి.
        మాంసం మానడం చాలా సులభం.
        గొప్ప గొప్ప వారు హింసను ఎలా మాని శాకాహారులు అయ్యారో చెబుతా వినండి. 
      మీరూ  కూడా అలాగే మాంసం తినడం మాని చిరకాలం జీవించండి" అని ఇలా చెప్పింది.
        సింహం కుతూహలంగా వినసాగింది. 
       హంస మాటలు వినడంలో సింహం లీనమైపోయింది.
        "అది కవి వాల్మీకి పక్షిని చంపి దాని రోదన విన్నాడు. మార్పు  చెంది రామాయణం రాసి పునీతుడు అయ్యాడు.  
       అశోకుడు కళింగ యుద్ధం చేసి హింసను కళ్లారా చూసాడు. పరివర్తన చెంది ధర్మపరాయణుడు అయ్యాడు. 
       గౌతముడు స్నేహితుడు కొట్టిన పక్షిని కాపాడి బుద్ధుడు అయ్యాడు. 
       నెహ్రూ జింకను వేటాడి, దాని పిల్లల ఆక్రందనను ఆలకించి మారు మనస్సు పొంది తుపాకీకి బదులు కెమేరా గురి పెట్టాడు. శాంతి దూత అయ్యాడు. 
       దలైలామా కోడిని కోశాడు. గిలగిలా కొట్టుకోవటం చూశాడు. పరివర్తన చెందాడు. శాంతి స్థాపకుడు అయ్యాడు. 
       అలాగే బెర్నార్డ్ షా, షేక్స్పియర్, మిల్టన్, ఐన్ స్టీన్, డావెన్సీ వంటి ప్రముఖులు అందరూ మాంసం మానేశారు మహాత్ములు అయ్యారు.
        అలా మీకు సాధ్యమే ప్రయత్నించండి" అన్నది హంస.
        ఆ రోజు నుంచి సింహం మాంసం మానేసింది. 
        పూర్తిగా శాకాహారి అయింది.
        దాని జబ్బు పారిపోయింది.
       నీతి : ప్రయత్నాల వలనే పనులు జరుగుతాయి.
కామెంట్‌లు