భలే అమ్మాయిలు (కథ):--సరికొండ శ్రీనివాసరాజు


  స్రవంతి చిన్నప్పటి నుంచి చదువులో అంతంత మాత్రమే. ఎప్పుడూ మొబైల్ ఫోన్లతో కాలక్షేపం, టి.వి. కార్యక్రమాలకు గంటల తరబడి అతుక్కుని కూర్చోవడం ఇదే ఆమె దినచర్య. చదువుపైనే కాదు ఆటల పట్లా ఆసక్తి లేదు. స్నేహితులు అసలే లేరు. తల్లిదండ్రులకు ఆందోళన ఎక్కువైంది. స్రవంతి 8వ తరగతి పూర్తి కావస్తుండగా శర్వాణి అనే అమ్మాయితో అకారణంగా గొడవ పెట్టుకుంది. శర్వాణి స్నేహితులు కూడా స్రవంతితో మాట్లాడటం మానేశారు. దీంతో స్రవంతి తనకు ఆ పాఠశాల నచ్చలేదని, వేరే పాఠశాలలో చేరుతానని పట్టు పట్టింది. చేసేది లేక తల్లిదండ్రులు సమీప పట్టణంలోని ఒక పాఠశాలలో చేర్పించడానికి తీసుకెళ్ళారు. అది చాలా మంచి పేరున్న పాఠశాల. ఆ పాఠశాలలో చదువుతో పాటు నైతిక విలువలకు, ఆటపాటలకం ప్రాధాన్యతను ఇస్తారు. స్రవంతికి కూడా ఆ పాఠశాలలో చేయాలని ఉంది.


       తల్లిదండ్రులు స్రవంతిని తీసుకు వెళ్ళి ఆ పాఠశాలలో చేర్పించారు. మొదటి రోజు భోజన విరామ సమయంలో భోజనం పూర్తి అయిన తరువాత స్రవంతి క్లాస్ మేట్సు కొందరు స్రవంతిని పరిచయం చేసుకున్నారు. "ఈ పాఠశాలలో చదవాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. లేకపోతే వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది." అన్నది శ్రీవాణి. "ఏమిటవి?" అన్నది స్రవంతి. "ఐదు నీతి కథలు చెప్పు." అన్నది శివాని. "నీతి కథలా? నాకు రావే." అన్నది స్రవంతి. ఘొల్లుమని నవ్వారు అందరూ. ‌ ఆశ్రిత కొన్ని పొడుపు కథలను చెప్పి విప్పమంది. ఏడుపు ముఖం పెట్టింది స్రవంతి. "ఇలా కాదు కానీ కొన్ని సామెతలను సగం చెబుతా. పూర్తి చేయాలి నువ్వు." అంటూ సామెతలను మొదలు పెట్టింది సిరి. స్రవంతికి ఏమీ రావడం లేదు. ఏడుపు ఒక్కటే తక్కువ. "ఏం? మీ నాయనమ్మ కథలు, సామెతలు, పొడుపు కథలను చెప్పదా?" అన్నది సిరి. "మా నాయనమ్మ టి. వి. సీరియళ్ళతోనే కాలక్షేపం చేస్తుంది. మమ్మల్ని పట్టించుకునే సమయం ఆమెకు ఎక్కడిది?" అన్నది స్రవంతి. "మరి నువ్వు మొబైల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తావా?" అంటూ ఫక్కున నవ్వింది సిరి. "పోనీ కొన్ని ఆటలనైనా ఆడుదాం. ఒక వారం రోజులు నీకు మేము చెప్పిన ఆటల్లో ఏమి వచ్చో చెప్పు. వాటిలో పోటీలు పెట్టుకుందాం." అన్నది శ్రావణి. మొత్తం ఆటల పేర్ల జాబితా చదివింది. "అవేవీ నాకు రావు." అన్నది స్రవంతి. "కనీసం ఆటలు కూడా రావా? అయితే నీకు పది రోజుల సమయం ఇస్తున్నాము. పదకొండో రోజున మాకు నువ్వు చాలా కథలను, సామెతలను చెప్పాలి. మేము వేసిన పొడుపు కథలను విప్పాలి. మాతో కనీసం పది రకాల ఆటలను ఆడి గెలవాలి. ఇవేవీ చేత కాకపోతే వచ్చిన దారినే వెళ్ళి,‌ మీ పాత పాఠశాలలోనే చేయాలి. నీకు అదే ఉత్తమం." అన్నది శ్రావణి.

       స్రవంతి ఏడ్చుకుంటూ వెళ్ళి జరిగిన విషయాన్ని పూస గుచ్చినట్లు చెప్పింది. "ఇంత పనికి వచ్చారా? వీళ్ళలో క్రమశిక్షణ లోపించిందని నేను ఇంతకు ముందే విన్నాను. పది రోజులు గడువు ఇవ్వడానికి వీళ్ళు ఎవరు? నీకేమీ భయం లేదు. నేను వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ భరతం పడతాను." అన్నారు ప్రధానోపాధ్యాయులు. ఆ అల్లరి బృందాన్ని పిలిపించారు. "చూడమ్మా శ్రావణి! పది రోజుల్లో నువ్వు చెప్పినవి నేర్చుకోవడం ఎలా సాధ్యమో చెప్పు? నెల రోజుల గడువు ఇద్దాం. మన స్రవంతి నెల తరువాత మీకు కావలసినన్ని కథలు చెబుతుంది. మీరు విప్పలేని పొడుపు కథలను చాలా నేర్చుకుంటుంది. కనీసం యాభై సామెతలను చెబుతుంది. రకరకాల ఇండోర్, అవుట్ డోర్ ఆటలు నేర్చుకొని మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తుంది. మీరు మరోటి అడగడం మరచిపోయారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ఎన్నో దేశభక్తి మరియు సందేశాత్మక పాటలను నేర్చుకుంటుంది. స్రవంతి తరపున నేను ఛాలెంజ్ చేస్తున్నాను. స్రవంతి ఓడిపోతే నేను మీ అందరికి కలిపి ఆరు వేల రూపాయలను ఇస్తాను. స్రవంతి గెలిస్తే మీరంతా కలిసి,‌ ఏమిస్తారో నిర్ణయించండి." అన్నారు ప్రధానోపాధ్యాయులు. అనుకోని ఈ పరిణామానికి ఖంగు తిన్నది స్రవంతి.

       ఆ తరువాత స్రవంతిని ఈ అల్లరి బృందం బయటకు తీసుకు వెళ్ళారు. "ఇంత మాత్రానికే ప్రధాన ఆచార్యులకు మా మీద చెబుతావా? మేము నీ మంచికే నీకు ఈ నిబంధనలు పెట్టాము. పొడుపు కథలు, సామెతలు మన తెలుగు భాషకు వన్నె తెచ్చాయి. వాటిని నేర్చుకోవాలి. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు, టి. వీ. లో పిచ్చితో ఇంట్లోనే జైలు జీవితాన్ని అనుభవిస్తారు అందరూ. వాటికి దూరంగా ఉండాలి. ఆటలతో మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. కథలు మనలో నైతిక విలువలను పెంచుతాయి. అవి తెలియక పోతే మనం తెగిన గాలిపటంలా ఏ చెడు దారిలో పోతామో తెలియదు. ఈ పాఠశాల గ్రంథాలయంలో నువ్వు బోలెడన్ని కథలను చదవవచ్చు. నువ్వు సరైన పాఠశాలకే వచ్చు. ఈ పాఠశాలలో నువ్వు చదువుతో పాటు ఎన్నో మరెన్నో నేర్చుకుంటావు. నువ్వూ మాకు మంచి స్నేహితురాలివి." అన్నది శ్రీవాణి. సంతోషించింది స్రవంతి.

కామెంట్‌లు