తుంటరి తూనీగ ( బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

        ఒక వనంలో ఓ తూనీగ ఉండేది. 
       అది భలే తుంటరిది.
       పట్టుమని పది ఘడియలు ఒకచోట నిలకడగా ఉండదు. 
       రయ్యిన మరోచోటుకు వెళ్లేది. 
       రెక్కలు టపటపలాడిస్తూ ఎంతసేపు అయినా ఎండలో
అలానే తిరిగేది. 
       అంతలోనే గడ్డిపరకలపై వాలేది.
       పొడవాటి రెల్లును ఊపుతూ తాను ఊగేది. 
       దానికి ఒక తుమ్మెద మిత్రుడు అంది.
       అది చాలా మంచిది. 
       దానికి తూనీగ చేసే తుంటరి పనులు నచ్చేవి కావు. 
       ఒకరోజు తుమ్మెద తూనీగతో ఇలా అన్నది.
        "తూనీగ మరదలా! నీవు ఇష్టం వచ్చినట్టు  తిరుగుతున్నావు. 
       హద్దు, అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నావు. 
       ఇది మంచి పద్ధతి కాదు. 
       ప్రమాదాలలో పడతావు జాగ్రత్త" అని హెచ్చరించింది.
       "నాకు అన్నీ తెలుసులే తుమ్మెద బావా! 
       ఏదో సరదాగా అలా ఎగురుతున్నాను.
        ఏ వయస్సుకు ఆ ముచ్చట. 
       ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అనుభవించేది, ఆడుకునేది. 
       నాకు శతృవులు ఎవరూ లేరు కదా? 
       ఎందుకు చిక్కుల్లో పడతాను. 
       ఒకవేళ పడినా తెలివితేటలు ఉన్నాయి. 
       వాటిని ఉపయోగించి చిటికెలో తప్పించుకుంటాను. 
       నీవేమి దిగులు పడకు. 
       నా గురించి కంగారే వద్దు" అన్నది తూనీగ.
       సరే నీ ఇష్టం మరదలా! ప్రమాదాలు చెప్పి రావు. 
       నిన్న నాకు జరిగిన సంగతి చెబుతా విను. 
        శీతల పానీయం  తాగుదామని మూతను పళ్లతో లాగాను.
       మూత కోసుకుని మూతంతా వాచింది.
       చూశావా? బలం ఉంది కదా అని జోలిమాలిన పనులకు పోకూడదు. 
       ఆకతాయి ఆటలు ఆడకూడదు" అన్నది తుమ్మెద.
       ఒక రోజు తూనీగ ఎగురుతూ ఒకచోట వాలింది. 
       అది సాలె పురుగు గూడు. 
       దాని మెత్తని బూజు ఉచ్చుల్లో తూనీగ చిక్కుకుంది.
       లోపల ఇరుక్కుపోయింది. 
       తీగల జిగటకు అతుక్కుపోయింది. 
       కాళ్లు పైకి లేవటం లేదు.
       రెక్కలు ఆడటం లేదు. 
       "అయ్యో! ఎంత పని జరిగింది.
        కోరి చిక్కుల్లో పడ్డాను.
       ఇప్పుడు ఎలా? తుమ్మెద చెబితే వినలేదు. 
       అందుకు తగిన శాస్తి  జరిగింది” అనుకుంది తూనీగ.
       తర్వాత ప్రాణాలు కోల్పోయిఎముకల గూడుగా మారింది.
       నీతి : జోలిమాలిన పనులు చేయరాదు. ఆకతాయి ఆటలు ఆడరాదు.
కామెంట్‌లు