ఉడుత ఉరుకు (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

       ఒక అడవిలో ఓ ఉడుత ఉండేది. 
       అది ఊడల మర్రిచెట్టు మీదకు ఎక్కింది. 
       ఉయల వేసి ఊగుతూ పడుకుంది. 
        నిద్రలో దానికి  కల వచ్చింది.
        ఆ కలలో ఆకాశం నుంచి నిప్పుల వాన కురుస్తుంది.
       అడవి అంతా కాలిపోతుంది.
       జీవులు మలమల మాడిపోతున్నాయి.
        ఉడుత ఉలిక్కిపడి మేలుకొంది. 
       కళ్ళు నులుపుకుని పరీక్షగా చూసింది. 
       ఎదురుగా మిణుగురు పురుగులు కనిపించాయి. 
       వాటిని నిప్పులే అనుకుని వణికిపోయింది
       క్రిందకు దూకి బతుకు జీవుడా అనుకుంటూ పరుగు అందుకుంది.
        ఉడుతకు నత్త ఎదురు అయింది.
       "ఉడుత అత్త! ఎక్కడకి ఉరుకుతున్నావు? ఏమిటి ఆ కంగారు?" అని అడిగింది. 
        తీరికగా తొంగి చూస్తున్నావేమిటి? ముందు పరుగెత్తు. మంటలు వస్తున్నాయి. మలమలా మాడిచస్తావు" అని విషయం చెప్పింది ఉడుత.
       అంతలో ఊసరవెల్లి  కలిసింది.
       ఉడుత మిత్రమా! ఏమిటి ఆ పరుగు?" అని అడిగింది.
       “త్వరగా పరుగెత్తు అవతల అడవి తగలబడుతుంది. నింపాదికగా రంగులు మార్చుకోవచ్చు" అంది ఉడుత.
        అలా కోతి. కుక్క ఎద్దు, ఏనుగు, ఒంటె, గుర్రం, గాడిద లాంటి జంతువులన్నీ కలిసి వాటితో పాటు పరుగెత్తాయి. 
        పెద్ద వాగు అడ్డం వచ్చి అన్నీ ఆగాయి.
        లేకపోతే అన్నీ  అందులో పడి కొట్టుకు పోయవే. 
        "కోతిమామా! పూర్వం మీ తాతలు రాముడికి సాయంగా యుద్ధం  చేశారట కదా?  మా తాతలు కూడా సముద్రంపై వారది నిర్మించారట. మరి ఆ రాముడినే కాపాడమని అడుగుదామా?" అన్నది ఉడుత.
        "అలాగే! అలాగే!!" అన్నది కోతి
        "రామయ్య తండ్రి" అని పిలిచింది ఉడుత.
        "సీతమ్మ తల్లి" అని అరిచింది కోతి.
        వెంటనే రామ చిలుక, సీతాకోక చిలుక వచ్చాయి. 
        విషయం విని పగలబడి నవ్వాయి.
        "బుద్ధిహీనులారా! అవి మంటలు అనుకుంటూన్నారా?   కాదు. మిణుగురు పురుగులు.
       భయపడి చవకండి.
       ఉడుత చిన్న ప్రాణి దానికి భయం సహజం. మీకేమైంది?
        పిరికి సన్యాసులారా! ఇక నుండైనా ధైర్యంగా బ్రతకండి" అన్నవి రామచిలుక, సీతాకోక చిలుక.
        పెద్ద జంతువులన్నీ సిగ్గుతో తల దించుకున్నాయి.
        చిన్నవి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాయి.
       నీతి : పుకార్లు నమ్మకండి. ఒక్కొక్కసారి అవే ప్రమాదాలను తెస్తాయి.
కామెంట్‌లు