కలతల కవనం:- --ఝాన్సీ.కొప్పిశెట్టి ఆష్ట్రేలియా .
నీకేం.......
భలే లాలిత్యంగా అడిగేస్తావు
 కవిత్వం రాయమని,
జీవితంలో లేని కవిత్వం
 కాగితంపై ఏం రాస్తాం?
విపంచి తీగల రాగాలకు
 చినుకులై ఎలా స్రవిస్తాం?
కనుకొలకుల్లో ఊరే-
 వర్షపాతానికి ,
ఇంద్ర ధనుస్సులెలా అద్దుతాం!

కష్టాల కడలి మధిస్తే-
 ఓ కవిత్వామృత భాండారం,
ఎన్ని పురుటి నొప్పుల ఫలం
 ఓ పద్య ప్రసవం....!

అయినా ఇప్పుడు కొత్తగా వచ్చిన
 అతిథేమీ కాదు బాధ,
గతించిన గాధల్లోకన్నా
 మించినదా ఈ వ్యధ!

అడగవద్దు నన్ను
 కాలం ఎలా గడుస్తోందని...
శూన్యమంతా నింపుకున్నాను
 కన్నీటి బిందువులతో....!

ఏది ఎందుకు జరుగునో,
ఎవరూ చెప్పలేని బ్రతుకు,
కారణాలు నీ నుదుటి గీతల్లో వెతుకు!

కొందరికే తెలుసు -
జీవితచక్రం వెనకున్న నగ్నత,
తప్పదెవరికీ ఈ తరంగాల వలలో నిబద్దత!!

                

కామెంట్‌లు