అభిషేకం -(మణిపూసల బాలగేయం):-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
చిట్టడివిలో శివయ్యా 
చిత్రంగ వెలసెనయ్యా 
చెట్టు కింద వాగు ఇసుక 
చెమ్మ లేక ఉందయ్యా !

ఎండమండి పోతున్నది 
ఏదొ  పక్షి అరుస్తుంది 
పండు కాయ లేక ఉడుత 
పలుపాట్లను  పడుతున్నది !

వనములోని తరువులన్ని 
రాల్చినాయి ఆకు లన్ని 
పవనుడితో మాట కలిపి 
రాయబార మిచ్చెనన్ని !

ఓ మేఘుడ దయలేదా 
చినుకులను కురియరాదా 
దుమ్ము ధూళిలో శివయ్య 
కభిషేకo చెయరాదా? 

ఒక్క వాన కురిపించుము 
పెక్కుమేళ్లు జరిపించుము 
చిక్కనైన జడి వానల 
మక్కువగా ప్రవహించుము!

వేగంగా పవనమొచ్చె 
భానుడితో కిరణమొచ్చె 
జలధిలోని నీరు అంత 
మేఘమంది కురియవచ్చె!

శంకరునికి అభిషేకము 
వంక వాగుల ప్రవాహము 
పులకించిన తరువొక్కటి 
పువ్వురాల్చె శివుని శిరము!



కామెంట్‌లు