జింక మానవత్వం (బుజ్జిపిల్లలకు బుజ్జికథ)౼ దార్ల బుజ్జిబాబు

        ఉరుములు ఉరుముతూ ఉన్నాయి. 
       మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. 
       మేఘాలు వేగంగా కదులుతూ ఉన్నాయి. 
       ప్రచండ వర్షం కురుస్తూ ఉంది.
       అడవిలోని జంతువులు చలికి వణుకుతూ
చెల్లా చెదురయ్యాయి. 
       పెద్ద గాలి వీస్తుంది.
       పక్షుల గూళ్లు కూలిపోతున్నాయి. 
       చెట్లు విరిగి క్రింద పడుతున్నాయి. 
       ప్రకృతి అల్లకల్లోలం ఉంది.
       అడవి మార్గంలో ఒక సత్రం ఉంది. 
       జంతువులు అన్నీ అందులో చేరాయి.
       సత్రంనిండిపోయింది.
        “ఇంత పెద్ద వానను నేను ఇంతవరకూ చూడలేదు" అన్నది ఏనుగు.
        “ఔను నిజమే. వినటమే కానీ నేనూ చూడలేదు" అన్నది గుర్రం. 
       “మా అమ్మమ్మ చిన్నప్పుడు నాకు కథలుగా చెప్పేది" అంది కుందేలు.
       "ముప్పై ఏళ్లనాడు దివిసీమలో ఇలాంటి గాలివానే వచ్చింది. ఉప్పెనకు ఊళ్లన్నీ కొట్టుకు పోయాయి. వేల శవాలు తెప్పతేలాయి. 
నేను కళ్లారా చూశాను" అంది ముసలి ఎద్దు.
       ఇలా ఉండగా చలికి గడగడా వణుకుతూ ఓ పంది వచ్చింది.
        “అన్నలారా! కొంచెం సర్దుకొని చోటు ఇవ్వండి. 
ఓ మూల నేను ముడుక్కుంటాను” అన్నది. 
       "పో పోవయ్యా... చోటు లేదు గీటూ లేదు. వెళ్లు వెళ్లు. మాకే చాలక చలికి చస్తున్నాం" అంది పులి. 
        అవన్నీ మరికొద్దిగా ముందుకు జరిగాయి.
        పందిని రానివ్వకుండా చేశాయి. 
        "సింహం గారూ! మీరయినా చెప్పండి. చలికి నా ప్రాణాలు పోతున్నాయి" అంది పంది. 
       “పోతే పోనీ... మాకేమిటంటా... నీవు నీచుడవు, మలం తింటావు. నీ దగ్గర చెడు వాసన. ఛండాలపు పనులు చేస్తావు. నల్లగా మసిగొబ్బులా ఉంటావు" అంది నక్క.
       ఇంతలో పెళపెళ ఉరుము ఉరిమింది.
       జంతువులు ఉలిక్కిపడ్డాయి. 
       తళతళ మెరుపు మెరిసింది.
       వాటి కళ్లు బైర్లు కమ్మాయి. 
       "మిత్రులారా! ప్రకృతి మనమీద పగ పట్టినట్టుగా ఉంది. తోటి ప్రాణిని బయటకు నెట్టాము. ఆ ఉసురు తగులుతుంది. రండీ దానిని లోపలికి తీసుకువద్దాం" అని ఒక జింక బయటకు వచ్చింది. 
       అదేసమయంలో సత్రం పై పిడుగు పడింది.   
       జంతువులన్నీ సజీవ సమాధి అయ్యాయి.    
       పంది, జింక మాత్రం మిగిలాయి.
  నీతి : మానవత్వం చూపకపోతే మనకు మరణమే గతి.
కామెంట్‌లు