తన ప్రియమైన అన్నయ్యకు అంకితమిచ్చిన 26 కథల సంపుటి "హగ్ మి క్విక్" కథలు చదివితే - రచయితకు సస్పెన్స్ తో కథను కొనసాగించడంపై మంచి పట్టు ఉన్నదని తెలుస్తుంది. కొన్ని కథలు రైలులో, కొన్ని కథలు బస్సులో, ఒకటో రెండో కథలు ఏరోప్లేన్ లో- మొత్తానికి ప్రయాణం గురించిన కథలు ఎక్కువ ఉన్నాయి.
ప్రస్తుతం "సంచిక" వెబ్ మ్యాగజైన్ లో "జ్ఞాపకాలపందిరి"లో వస్తున్న శైలికి ఈ సంపుటి లోని కొన్ని కథల శైలికి చాలా తేడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు (బహుశా మేము చిన్న వయసులో) కథలు, సినిమాలు చక్కగా ధర్మాన్ని బోధిస్తూ, న్యాయం కోసం పోరాడే పద్ధతిలో ఉండేవి. కొంత ప్రబోధాత్మక ( మాదాల రంగారావు లాగా)కూడా ఉండేవి. పరిగె, వాళ్ళిద్దరూ ఓడిపోయారు, ప్రేమంటే....., వ్యక్తిత్వం ఎదురుదెబ్బ - అలాంటి "మంచి", "బుద్దిమంత"మైన కథలు.
"ఆమె ఎవరు" ఒక మతిస్థిమితం లేని అమ్మాయి హృదయవిదారక కథ. "తమి" నమ్మకాల మీద సారించిన ప్రశ్న.
"రాంగ్ నెంబర్" , "రాంగ్ నెంబర్- రైట్ పార్ట్ నర్" నిజంగా పాతికేళ్ళ క్రితం ఇలాంటి సరదా కథలు వచ్చాయి. డాక్టర్ గారు ఎప్పుడు రాసారో డేట్స్ కూడా వేసి ఉంటే బాగుండేది.
రచయితకు దేశం పట్ల సంఘం పట్ల, సమాజపు తీరుతెన్నుల పట్ల, అన్యాయాల పట్ల, కుటుంబ విలువల పట్ల స్పష్టమైన అవగాహన ఉండి రాసిన కథలే ఎక్కువగా ఉన్నాయి. అన్యాయాన్ని సహించలేని తత్వం చాలా కథల్లో కనిపిస్తుంది. కీలెరిగి వాత పెట్టడం "మంత్రం" లాంటి కథ లో కనిపిస్తుంది. హంగ్ మి క్విక్ శీర్షిక (యండమూరి ప్రభావమో) కొంత కంగారు పెట్టినా... దాంపత్య విలువలు దాటిపోని నాయికకి ఎక్కువ మార్కులు వేయాలి.
ఇంత మంచి విలువలు ప్రకటిస్తూ రాసిన రచయిత "బహుమతి" లాంటి కథ రాయటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్న అతను మగ పిల్లవాడి కోసం తన ఇంట్లో పనిచేసే అమ్మాయి తో సంబంధం పెట్టుకొని, ఇంట్లో బంగారం నగలు ఆమెకిచ్చి, చివర్లో హాస్పిటల్ లో మగబిడ్డని ఎత్తుకొని మురిసిపోవటం, అతని స్నేహితుడు కూడా దానిని ఆమోదించటం - ఈనాటి స్త్రీలు, స్త్రీవాదులు అంగీకరించరు డాక్టర్ గారూ!
ముప్పాళ్ల రంగనాయకమ్మ "కృష్ణవేణి", మల్లాది వెంకట కృష్ణ మూర్తి "దూరం" నవల మొత్తం లేఖలతోనే సాగిపోయింది. అలాగే ఇందులో కూడా రెండు కథలు కేవలం లేఖలతోనే సాగటం ముచ్చటగా ఉంది (ముగింపు ఎలా ఉన్నా).
"ఎక్కవలసిన రైలు" హాస్యంగా సాగినా, ముగింపు (రైలు ఎక్కాల్సి వాడు ప్లాట్ ఫారం మీద ఉండిపోవడం , సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వచ్చినవాళ్ళు రైలెక్కి వెళ్ళిపోవడం) నమ్మశక్యంగా లేదు.
" బిచ్చగాడు కథని మరింతగా పెంచితే ఒక మాదకద్రవ్యాల నేపధ్యంతో మాంఛి రాజకీయ సస్పెన్స్ నవల అవుతుంది.
మొగపిల్లలు పుట్టకపోవడానికి బాధ్యత మొత్తం స్త్రీ మీద వేసే ఈ సమాజానికి కళ్ళు తెరిపించే కథ "పందెం". యౌవనంలో విర్రవీగి ప్రవర్తించి తర్వాత వృద్ధాప్యంలో పశ్చాత్తాప పడే ఒకానొక "ఆత్మ" ఘోష బాగుంది .
మొత్తం 26 కథలని ఏకబిగిన చదివించే శైలి, సస్పెన్స్ , చివరికి ఏమవుతుందా అన్నంత ఉత్కంఠతో సాగిన కథనం డాక్టర్ గారికి లభ్యమైన వరమని చెప్పవచ్చు.
"హగ్ మి క్విక్" (కథా సంపుటి)
రచన: డా. కె.ఎల్.వి.ప్రసాద్
Dec.2014
Price: 150/-
M: 9866252002.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి