నవ్వు:-- యామిజాల జగదీశ్
ఓ మనిషి అందాన్ని 
వెల్లడించడానికి
ఖరీదైన వస్త్రాలనవసరం
అందమైన చిర్నవ్వు అవసరం

ప్రపంచంలో
కోటి అందాలున్నా
నవ్వుకున్న అందం
మరి దేనికీ లేదు, రాదు

నవ్వు
హాయిగా నవ్వితే
మనసుకి అలసట ఉండదు

నవ్వుకి
శత్రువులైన కోపం, ద్వేషం
 పటాపంచలవుతాయి

నవ్వితే మనసుకి హాయి
ఎవరితోనూ తగవు
చేదు మాటలు

పైసలక్కరలేదు 
నవ్వడానికి

జీవితపయనంలో నవ్వుని
వెదజల్లుతూ పోతుంటే
దారులూ
బంధాలూ వికసిస్తాయి

మన కష్టం
మన నష్టం
పలువురి నవ్వించొచ్చు
కానీ
మన నవ్వు 
ఎవరినీ వేదనకు 
గురి చేయకూడదు

ఒంటరిగా ఉన్నప్పుడు
ఏడ్వడంకూడా 
పెద్దగా నొప్పించదు కానీ
ఇతరుల ముందు 
నటించడం నొప్పిస్తుంది

నొప్పి లేకుండా నవ్వే నవ్వుకి
మరో దారి లేక నవ్వే నవ్వుకి
అర్థాలు అనేకం
నొప్పులు మోస్తూ
దారిని వెతికే పయనమే 
జీవితం

ఇప్పటివరకూ
నేను రాయని కవిత నవ్వు
ఆ నవ్వుని ఓ శిశువు 
పెదవులపై చూసినప్పుడే
ఈరోజిలా మాటల్నిచ్చింది

పిల్లల్లాటి 
నిష్కల్మష నవ్వుంటే
జీవితాంతమూ హాయి హాయి
ఒత్తిళ్ళను అధిగమించొచ్చు
బరువులను తేలిక చేసుకోవచ్చు

ఒక్క నవ్వే గొప్ప ఔషధం
ఇతర ప్రభావులుండవీ 
నిష్కపట నవ్వులో....

ప్రపంచంలో 
ఎంతో అందమైన విషయం నవ్వు
అందుకే
ఎప్పుడూ సంతోషంగా ఉండాలి

నవ్వు లేని జీవితం
రెక్కల్లేని పక్షిలాటిది
పక్షికి రెక్కందం
మనకు నవ్వందం

అన్ని పెదవులకూ
తెలిసిన ఏకైక అంతర్జాతీయ భాష 
నవ్వు

నోరారా నవ్వితే
రోగాలు మటుమాయం

మన ముఖానికి
అందమిచ్చేది నవ్వే
మనం నవ్వుతూ
ఇతరులనూ నవ్విద్దాం
ఇతరుల మనసు నొచ్చుకోకుండా
నవ్వే నవ్వుకున్న అందం
ఇంతా అంతా కాదు

ఎప్పుడూ
మనతో ఉండాలన్నదే
నవ్వు ఆశ
అందుకే కోపంలోనైనా
నన్ను మరవొద్దంటూ
అంతరంగంలో నించీ
గుసగుసలాడుతూనే
ఉంటుందీ నవ్వు

మనల్ని 
ప్రాణసమానంగా 
చూసుకునే వారి నవ్వొక్కటి చాలు
మన గాయాలు నయమవడానికి

నవ్వొక కళ
నవ్వొక పరికరం
నవ్వొక ఆయుధం
నవ్వొక మంత్రం
నవ్వొక మహత్తు
నవ్వొక దివ్య ఔషధం

మనల్ని నవ్వించాలనుకునే
వారిని మనమూ నవ్వించాలి
మనల్ని చూసి నవ్వుకునే వారిని
ఆలోచనలో పడెయ్యాలి తప్ప
డీలా పడకూడదు

చిన్న నవ్వే కావచ్చు
ఎన్నింటినో అధిగమించడానికి
నవ్వొక శక్తి
ఇది తెలుసుకుంటే చాలు
నవ్వందరి సొత్తు
నవ్వందరి పొత్తు
మనసారా నవ్వుదాం!!
నవ్విద్దాం!!



కామెంట్‌లు