కూరిమిగల దినములలో
నేరములెన్నడును కలుగ నేరవు మరియా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ...
ఇది నేను చిన్నప్పుడు చూచిరాత కాపీలో అభ్యాసంచేసిన మొదటి పద్యం. దీని తరువాత
చీమలుపెట్టిన పుట్టలు
పాములకిరవైనయట్లు పామరుడు తగన్
హేమంబు కూడబెట్టిన
భూమీశుల పాలజేరు భువిలో సుమతీ
ఉపకారికినుపకారము
విపరీతముగాదు సేయ వివరింపంగా
అపకారికి ఉపకారము
నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ
బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా!
బలవంతమైన సర్పము
చలిచీమల చేతజిక్కి చావదె సుమతీ
కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమతమనెలవులు దప్పిన
తమమిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ
ఆ తరువాత ఇలాంటివే సుమతీ పద్యాలు,వేమన పద్యాలు చాలానే చూచిరాత కాపీలు నింపాను.కలాలుండేవి,సిరాబుడ్లుండేవి.కలాన్ని సిరాలో ముంచి పై గీతకు కింది గీతకూ తగిలేట్లుగా చూచిరాత రాసేవాళ్లం.చూచిరాత కాపీ పేజీల్లో మొదటిలైనులో బాపు ఎర్రసిరాతో వ్రాస్తే మిగతావన్నీ పూరించడం అందరికీ తెలిసిందే.బాపు ఊరికే అనేవారు. పదిసార్లు చదివేకంటే ఒకసారి రాస్తే బాగా గుర్తుంటుందని.
పద్యాలే కాకుండా బోలెడు సామెతలు చూచిరాత రాసే వాణ్ణి.
చెరపకురా చెడేవు, దురాశ దుఃఖము చేటు, కలిమిలేములు కావడి కుండలు,ఆరోగ్యమే మహా భాగ్యము,అందని ద్రాక్ష పుల్లన,సంతోషం సగం బలం,దూరపు కొండలు నునుపు,కోటి విద్యలు కూటికొరకే,ఆడితప్పరాదు పలికి బొంకరాదు,సత్యమేవజయతే,పరుగెత్తి పాలు త్రాగటం కన్నా నిలబడి నీళ్లు తాటం మిన్న,ముందుగొయ్యి వెనుక నుయ్యి,తంతే గారెల బుట్టలో పడ్డట్టు,ఇంకా ఎన్నో సామెతలు చూచిరాత పేరుతో ఎప్పుడూ నోట్లో మెదులుతూ ఉండేవి.
ఇవికాక
కాకి ఒకటి నీళ్లకై
కావు కావుమనుచును
చెట్టు చేమలన్ని తిరిగి
చేరెనొక్క తోటలో
తోటలోన ఉండెను
మట్టిపాత్ర ఒక్కటి
అందులోన ఉండెను
కొంచెమన్ని నీళ్లు
ఏమిచేతు దైవమా
ఎందుబోదు దైవమా
కుండ అడుగునున్నవి
అందవాయె నీళ్లు
కాకి బుర్రలోన ఒక్క
ఆలోచన తట్టెను
గులకరాళ్లు ఏరి తెచ్చి
కుండలోన వేసెను
నీళ్లు పైకి వచ్చెను
కాకి నీళ్లు తాగెను
ఉపాయమ్ము పారెను
అపాయమ్ము తొలగెను
ఇంకా
బుజ బుజరేకుల బుజ్జయ్యా,
కథ చెబుతా విను కన్నయ్యా
కాకి బజారుకు వెళ్లింది
మాంసం ముక్క దొరికింది
ముక్కుతొ ముక్కను పట్టుకుని
చెట్టు కొమ్మ పై వాలింది
టక్కరి నక్క చూచింది
కాజెయ్యాలని తలచింది
చెట్టు కిందికి చేరింది
కాకి బావ అని పిలిచింది
కాకిని బాగా పొగిడింది
పాట పాడుమని అడిగింది
మర్మం తెలియని కాకమ్మ
పొంగి నోటిని తెరిచింది
నేట కరచిన మాంసం ముక్క
నేలమీద పడిపోయింది
నక్క ముక్కను నోట కరచుకుని
తుర్రున పారిపోయింది
వంటి గేయాలు,
పైనొక పలక
కిందొక పలక
పలకల నడుమ
మెలికల పాము
చింపిరి చింపిరి గుడ్డలు
ముత్యాలవంటి బిడ్డలు
తండ్రి గర గర
తల్లి పీచుపీచు
రత్నాల వంటి పిల్లలు
వంటి పొడుపు కథలు
ఎన్నో కంఠస్థంగా ఉండేవి.
ఇవన్నీ తెలుగు భాషాధ్యయన సోపానాలు.
ఇవాళ కందంతో కబుర్లు మొదలయ్యాయి గనుక కందం గురించి తెలుసుకుందాం.
కందం అచ్చమైన తెలుగు ఛందం.సీసం,ఆటవెలది,తేటగీతి మొదలగు దేశీ ఛందాలలో కందం అత్యంత ప్రాధాన్యత కలది.
ఒకప్పుడు కందం రాసినవాడే కవి అనే నానుడి కూడా వాడుకలో ఉండేది.
పదకొండో శతాబ్దానికి చెందిన నన్నయ ఆంధ్రమహాభారత రచన చేసే నాటికే కందం ప్రాచుర్యంలోకి వచ్చింది. నన్నయకంటే వంద సంవత్సరాల ముందే కరీంనగర్ జిల్లా కురిక్యాల గ్రామం దగ్గరలో ఉన్న బొమ్మల గుట్టమీద గండశిలపై చెక్కిన కందపద్యాలను పరశోధకులు కనుగొన్నారు.కురిక్యాల ప్రభువు జినవల్లభుడు రాసిన మూడు కంద పద్యాలు తొలి సాక్షీభూతమైన కందాలుగా గుర్తించారు.జినవల్లభుడు కన్నడకవి పంపని సవతి తమ్ముడు. కన్నడ మహాభారత కవి కన్నడ రత్న త్రయాలైన పంప,పొన్న,రన్న లలో ఒకడు.ఇతని విక్రమార్జునవిజయం లో కూడా కొన్ని కంద పద్యాలున్నాయి. అన్నిటి కంటే ముఖ్యంగా ఈ ఇరువురు సోదరుల సమకాలికుడు,వీరికి మిత్రుడు ఇదే ప్రాంతానికి చెందిన మల్లియరేచన ఏకంగా అదేసమయంలో కంద పద్యాలలో ‘కవిజనాశ్రయమ’నే లక్షణగ్రంధాన్ని రచించాడు..
మరి జినవల్లభుని కుర్క్యాల శాసనం లోని తొలి పద్యాలెలా ఉన్నాయో చూద్దాం.
కం.1
జినభవనములెత్తించుట
జినపూజలు సేయకున్కి జినమునులకు న
త్తిన యన్నదానమీవుటం
జినవల్లభు బోలగలరె జినధర్మపరుల్
కం.2
దినకరు సరి వెల్గుదుమని
జినవల్లభు నెట్టు నెత్తు జితక వినననున్
మనుజులు గలరే ధాత్రిన్
విని తిచ్చిదుననియు వృత్త విబుధ కవీంద్రుల్
కం.3
ఒక్కొక్క గుణము కల్గుదు
రొక్కొండగ కొక్కలక్క లేవెవ్వరికిన్
లెక్కింప నొక్క లక్కకు
మిక్కిలి గుణపక్షపాతి గుణమణి గుణముల్
వేములవాడ చాళక్యుల వంశం వాడ యిన రెండవ అరికేసరి ఆస్థానకవియైన పంపమహాకవి జైనమతావలంబుడైన అరికేసరిని కృతినాయకుడుగా జేసి జైనమతానుగుణంగా ‘విక్రమార్జున విజయం’రచించాడు.మరి కొన్ని వీరిగురించిన విషయాలు విపులంగా తరువాతి భాగంలో చెప్పుకుందాం. మక్తాయింపుగా పోతన కందం ఒకటి
కం.
పలికెడిది భాగవతమట
పలికించెడు వాడు రామభద్రుండట నే
బలికిన భవహరమగునట
పలికెద వేరొండు గాథ పలుకగనేలా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి