"వర్క్ పర్మిట్":- ఎం. బిందు మాధవి

 గౌతం చదువు అవుతూనే అందరిలాగే క్యాంపస్ సెలెక్షన్ లో "టీసిఎస్" లో ఉద్యోగంలో చేరాడు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ఉద్యోగాలే చేస్తే ఒకరితో ఒకరికి మాట్లాడుకునే టైం ఉండదని, జీవితం నిస్సారంగా ఉంటుందని ఆలోచించినతల్లిదండ్రుల మాటతో ఏకీభవించి, ఎమ్మే చదివి ఉపాధ్యాయ వృత్తిమీద ఉన్న మక్కువ తో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో టీచర్ గాపని చేస్తున్న శ్రియని పెళ్ళి చేసుకున్నాడు. 
గౌతం తండ్రి గురు ప్రసాద్ సెక్రెటేరియట్ లో సర్వీస్ చేసి, రిటైర్ అయ్యాక తన స్వగ్రామానికి దగ్గరగా ఉండే టౌన్ కి మకాంమార్చారు. అక్కడి నించే తనకున్న పదెకరాల పొలంలో వ్యవసాయం చూసుకుంటున్నారు. 
నాలుగేళ్ళ కాలం గడిచింది. గౌతం ఉద్యోగంలోను, జీవితం లోను ఒక మెట్టు పైకెక్కాడు. కొడుకు మానస్ కి రెండేళ్ళునిండుతాయనగా, గౌతం మూడేళ్ళ ప్రాజెక్ట్ పని మీద అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. భార్యా పిల్లల్ని వదిలి అంతకాలంవిడిగా ఉండటం మంచిది కాదు కనుక, కోడలు ఉద్యోగం మానేసి అందరూ కలిసి వెళ్ళటమే మంచిదన్నారు గురు ప్రసాద్దంపతులు.
అమెరికా వెళ్ళాక గౌతం బిజీ అయిపోయాడు. భారత్ లో ఉద్యోగంతో బిజీ గా ఉండే శ్రియకి ఖాళీగా ఉండటంతో ఏమీతోచేది కాదు. టీచర్ గా అంత అనుభవమున్నా కానీ, అక్కడ తను డైరెక్ట్ గా టీచర్ ఉద్యోగం చెయ్యలేదు. అందుకోసంముందుగా అక్కడ కోర్స్ ఒకటి తప్పనిసరిగా చేసి తీరాల్సిందే! ఇంతలో కూతురు ప్రియ పుట్టటంతో ఒక ఏడాది గడిచింది. 
గౌతం వీసా గడువు అయిపోవస్తున్నది. ఇంతలో అమెరికాకి రెండేళ్ళు-మూడేళ్ళు ప్రాజెక్ట్ పనుల మీద "h1"వీసాతో వెళ్ళినవిదేశీయులకి ఆ వీసాలు పొడిగించబడవు. వారు తమ దేశాలకి తిరిగి వెళ్ళిపోవాలి అని 'ట్రంప్' అనే గండు చీమ "వీసానిబంధనలు" పేరుతో కుట్టేసరికి, అక్కడున్న వారు నీళ్ళల్లోంచి బయట పడిన చేప చందంగా తయారయ్యారు. ఆనిబంధనల్లో భాగంగా వారి డిపెండెంట్స్ కూడా ఆక్కడ ఉద్యోగాలు చెయ్యటానికి అనుమతి ఉండదు అని ప్రకటించేసరికికిక్కురుమనకుండా గౌతం లాంటి వారంతా గోడకి కొట్టిన బంతుల్లాగా ఇండియా వచ్చి పడ్డారు. 
అలా ఇండియా వచ్చేసిన వారిలో గౌతంతో పాటు అతని స్నేహితులు రాకేష్, సంపత్ కూడా ఉన్నారు. పిల్లలు ఇంకా చిన్నక్లాసుల్లోనే ఉన్నారు కాబట్టి పెద్ద ఇబ్బందేమీ లేకుండా హైదరాబాద్ లో స్కూల్లో అడ్జస్ట్ అయిపోయారు. శ్రియ మళ్ళీ ఢిల్లీపబ్లిక్ స్కూల్లో చేరిపోయింది. 
మూడేళ్ళు విదేశాల్లో ఉండొచ్చిన గౌతం కుటుంబం, ఆ సంవత్సరం దసరాకి తమ ఊరు వెళ్ళి తల్లిదండ్రులతో గడపాలనినిశ్చయించుకున్నారు. రాకేష్, సంపత్ తల్లిదండ్రులు కూడా అదే ఊళ్ళో ఉండటం వల్ల ముగ్గురూ కుటుంబాలతో దసరాపండుగ జరుపుకోవటానికి టౌన్ కి వెళ్ళారు. 
అందరి పిల్లలు పండుగకి రావటంతో ఊరంతా సందడిగా, కళ కళ్ళాడుతున్నది. దుర్గాష్టమి ముందు రోజు సాయంత్రంఆకాశం నల్ల కప్పేసి ఇప్పుడో ఇహనో ఝడి వాన కురిపించటానికి సిద్ధంగా ఉన్నది. ఆ రాత్రి అందరూ అన్నాలు తినిపడుకున్నారు. పది గంటల నించి ఆకాశం చిల్లుపడ్డట్టు ఒకే వాన. జోరుగా కురుస్తున్న వానకి తోడు ఉరుములు, మెరుపులు భీతి కొలుపుతున్నాయి. గురుప్రసాద్ కి కంటి మీద కునుకు లేదు. ఉరుముల శబ్దానికి'అర్జునా..ఫల్గుణా..పార్ధా..కిరీటి అని నమస్కారం చేస్తూ... "కంకులు నిండుగా ఉన్న పంట చేను ఎలా ఉన్నదో? ఈ ఏడుపండినదంతా చేతికొస్తే, పెట్టుబడి పోను మంచి లాభం. ఆ డబ్బుతో ఇంటి పనులు చేయించచ్చు అనుకున్నాను, ఇంతలోఈ వాన! ఎప్పుడు తెరిపిస్తుందో" అనుకుంటూ కిటికీలోనించి చూస్తూ కూర్చున్నాడు. 
తెల్లవారాక ఓ కప్పు కాఫీ తాగి, స్కూటర్ వేసుకుని తన గ్రామం వెళ్ళాడు. చేనంతా మొల్లోతు నీరు నిలబడింది. పంటతల్లిఒరిగి దీనంగా గురుప్రసాద్ వంక చూస్తున్నట్టుంది. నిస్సహాయంగా కంటి నిండా నీటితో గట్టున నిల్చున్న గురుప్రసాద్భుజం మీద చెయ్య పడిన స్పర్శకి పక్కకి తిరిగాడు. కొడుకు గౌతం "నాన్నా నువ్వు పొద్దున్నే ఆదుర్దాగా స్కూటర్ మీదబయలుదేరావని అమ్మ చెప్పింది. రాత్రి కురిసిన వాన చూశాక ఏం జరిగుంటుందో ఊహించాను. పద ఇంటికెళదాం. మేము అమెరికా నించి తిరిగొచ్చేశాం కదా! ఇలా ప్రతి సంవత్సరం సరిగ్గా పంట చేతికొచ్చే సమయానికి ముంచెత్తుతున్నవాన వల్ల మన లాగే చాలా మంది రైతులు నష్టపోతున్నారు. ఆర్ధిక నష్టం కంటే మీరు మానసికంగా, సెంటిమెంటల్ గా  ఎంత ఆవేదన పడుతున్నారో అర్ధమౌతున్నది. ఏదో ఒకటి చేద్దాం' "అని తండ్రిని ఇంటికి తీసుకొచ్చాడు. 
రాకేష్, సంపత్ లకి ఫోన్ చేసి వారిని తీసుకుని ఆ సాయంత్రం మళ్ళీ తన గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామం లో ఉండేయువకులని పిలిచి అకాల వర్షాలతో అక్కడ ప్రతి సంవత్సరం జరుగుతున్న పంట నష్టం గురించిన వివరాలుతెలుసుకున్నాడు. శాశ్వత నివారణ చర్యగా ఒక  కార్యాచరణ ప్రణాళిక ఆలోచించి అమలులో పెట్టటానికి బ్లూ ప్రింట్తయారు చేశాడు.  
వీళ్ళీ పనిలో ఉండగా, గౌతం మేనమామ శంకరం వచ్చాడు. "ఏరా అంతా బాగున్నారా? మీరు పండుగకి రాబట్టి ఈ టైంలో ఇక్కడ ఉన్నారు. గత రెండు మూడేళ్ళుగా కురుస్తున్న వర్షాలతో మాకు దసరా పండగ రోజులు సవ్యంగా గడుస్తాయనేనమ్మకం పోయింది. ఏదో ట్రంప్ అనే ఆ చీమ వీసాలు రిన్యూ చెయ్యం అనే నిబంధన ద్వారా కుట్టకపోతే  మీయువకులంతా మళ్ళీ ఇండియా దారి పట్టే వారా?  ప్రకృతి చేసే బీభత్సాలని తట్టుకుంటూ, ఒంటరిగా పరిష్కారాలుకనుక్కోలేక చావలేక బ్రతుకుతున్నాం కదరా!  పెరుగుతున్న సాంకేతికతని వాడుకోవటం మాకేమో చేతకాదు! చదువుకున్నయువకులంతా విదేశాల్లోనే బ్రతకాలనుకుంటే, మిమ్మల్ని కని పెంచిన ఈ నేల ఏమౌతుందో మీలో ఎవరైనాఆలోచిస్తున్నారా?" అన్నాడు 
"అవును మామయ్యా,  మాకు కూడా ఇక్కడ ఉండబట్టే విషయాలు తెలుస్తున్నాయి. నేను  నా లాగే ఆలోచించేకొంతమందిని ఫేస్ బుక్ ద్వారా సంప్రదించాను. వారు, నేను ఆలోచిస్తున్న ప్రణాళికకి ఆర్ధిక సహాయంతో పాటు ఇతర క్షేత్రస్థాయి పనులు కూడా చేస్తారు.  "కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ" కింద పెద్ద కంపెనీలు గ్రామీణ యువకులభాగస్వమ్యంతో  గ్రామాల్లో అవసరమైన సేవలని అందిస్తారు. అవేంటంటే, పంట చేలకి దగ్గరగా ఉన్న చెరువుల పూడికతీయించి నీటి నిలవ సామర్ధ్యాన్ని పెంచటం, పొలం పక్కన  కాలువలుతవ్వి పెద్ద వర్షం పడ్డప్పుడు చేలో నీరునిలవకుండా వెంటనే ఆ నీటిని కాలువల్లోకి మళ్ళించటం, ఆ కాలువలని చెరువులతో అనుసంధానించటం, మార్కెట్యార్డ్స్ లో ధాన్యం తడిసిపోకుండా షెడ్స్ ఏర్పాటు చెయ్యటం లాంటివన్నమాట! మనకి కావలసినన్ని మానవవనరులున్నాయి. లాభాలార్జించే కార్పొరేట్ కంపెనీలున్నాయి. వాటిని ఒక తాటి మీదకి తేవటం అనే పని ఇప్పుడుమేముతలపెట్టాం" అన్నాడు. 
గౌతం ఆలోచనకి, చొరవకి గురుప్రసాద్, శంకరం సంతోషించారు. పెద్ద వయసులో పిల్లలు దగ్గరుండి తల్లిదండ్రులఅవసరాలని గుర్తించి, వారికి భూమితో ఉన్న అనుబంధాన్ని అర్ధం చేసుకోవటం శుభ పరిణామం! సాంకేతికతనుపయోగించి పెద్ద ఆర్ధిక ప్రణాళికలని, నలుగురిని కూడగట్టటం ద్వారా సులువుగా అమలుపరచటంచూసి...యువకులు పూనుకుంటే చదువుకున్న చదువులు ఈ దేశాభి వృద్ధికి ఉపయోగపడతాయని, గురు ప్రసాద్సంతోషంగా కొడుకుని కంటినిండా చూసి, మనసారా ఆశీర్వదించాడు. 
కామెంట్‌లు