ఒక ఊరిలో పచ్చి మిరపకాయ, ఎండు ఆకు,
పండు టమాటా, బెల్లం ముక్క, ఉల్లిగడ్డ ఉండేవారు.
వీరంతా మంచి స్నేహితులు.
ఒకరోజు ఐదుగురు 'ఇండియా - పాకిస్తాన్' క్రికెట్ ఆట చూడటానికి బయలుదేరారు.
రోడ్డు దాటవలసి వచ్చింది.
లారీ ఢీకొని పచ్చి మిరపకాయ పచ్చడి అయింది.
మిత్రుడు మరణించినందుకు మిగిలిన
నలుగురు ఏడుస్తూ నడుస్తున్నారు.
ఇంతలో పెద్ద గాలి వచ్చింది.
ఎండు ఆకు ఎగిరిపోయింది.
ఆకు అకాల మరణానికి మిగిలిన ముగ్గురూ కుమిలిపోయారు.
మార్గమధ్యంలో పెద్ద వాగు అడ్డం వచ్చింది.
టమోటా, ఉల్లిగడ్డ వాగు దాటారు.
బెల్లం ముక్క నీటిలో కరిగి కనుమరుగుయింది.
తీపి మిత్రుని తలచుకొని ఇద్దరూ రోదించారు.
క్రీడా మైదానం చేరారు.
ప్రేక్షకుల ప్రక్కన కూర్చున్నారు.
క్రికెట్ ఆట ప్రారంభం అయింది.
పాక్ ఆటగాళ్లు బంతి విసురుతున్నారు.
మన దేశపు అద్భుత అబ్బాయిలు సచిన్, సెహ్వాగ్ ఆడుతున్నారు.
సెహ్వాగ్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు.
నాలుగో బంతిని కూడా బలంగా బాదాడు.
అది గాలిలో ఎగిరింది.
గ్యాలరీలో ఉన్న పండు టమోటాపై పడింది.
అది చిదురు చిదురు అయింది.
ప్రాణాలు పైకి పోయాయి.
మిత్రులు అందరినీ కోల్పోయింది ఉల్లిగడ్డ.
ఒంటరిగా ఏడుస్తూ నడుస్తూ వస్తుంది.
అప్పుడు దేవుడు ఎదురయ్యాడు.
“ఉల్లిగడ్డా! నీవు ధన్యుడవు. మిత్రులందరి చావుకు నీకు విలపించావు. నీ చావుకు కూడా అందరూ ఏడుస్తారు. నీవు దిగులు చెందకు" అని ఓదార్చాడు.
అప్పటి నుంచి ఉల్లిగడ్డను కోసి చంపేటప్పుడు కోసేవారి కళ్లల్లో నీళ్లు వస్తాయి.
పక్కన చూసేవారి కళ్లల్లోకూడా నీళ్లు సుళ్లు తిరుగుతూ ఉంటాయి గమనించారా?
నీతి : మనం అందరి కోసం దుఃఖిస్తే మన కోసం అందరూ దుఃఖిస్తారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి