అండమాన్ వెళ్ళిన విమానాలు :--డా.. కందేపి రాణీప్రసాద్.

 2005 జనవరి 5న శిశువైద్య నిపుణుల జాతీయ సమావేశాలకు హాజరు అయ్యేందుకు మా కుటుంబ సభ్యులు నలుగురం కోల్ కతకు బయలు దేరాం! మేము విమానాశ్రయానికి వెళ్ళేసరికి కలకత్తా విమానాలు రద్దు చేయబడ్డాయని తెలిసింది. “ఎందుకు?” అని విషయం కనుక్కుంటే ఈ విమానాలన్నీ సునామీ బాధితుల కోసం అండమాన్ కు మళ్ళించబడ్డయట. అందుకని బాంబే నుండి గానీ, మద్రాసు మీద నుంచి గాని వెళ్ళాలని ఎయిర్ ఫోర్టు అధికారులు సూచించారు. మద్రాసు విమానం కన్నా బొంబాయి విమానం రెండు గంటలు ముందే ఉండటంతో అందరం దానికే వెళ్ళాలని నిశ్చయించుకున్నాము.
కరీంనగర్ నుంచి వచ్చిన కొంతమంది డాక్టర్ మిత్రులు అక్కడేకలిశారు. బొంబాయిలో దిగిన తరువాత సాయంత్రం 7.30 గం.లకు గానీ విమానం దొరకలేదు. బొంబాయిలో చాల సమయం ఉన్నందున ఎయిర్ పోర్టంతా తిరిగి చూశాం... ఎప్పుడు క్షణం తీరిక లేని దక్త్రాలు ఒక్కసారిగా ఇంత సమయం మిగిలిపోతే ఎం చేయాలో తెలియక విసుగు పడ్డారు. కుటుంబ సభ్యులంతా ప్రక్కనే ఉండి, కావలసిన తిండి పదార్థాలు కొనుక్కుంటూ, స్వేచ్ఛగా కావలసిన చోటుకు తిరుగుతున్నారు. ఇన్ని సౌకర్యాలు ఉండి ఒకరోజంతా ఎయిర్ పోర్టులో గడిపినందుకే చాలా చాలా అసౌకర్యానికి గురి అయ్యాం.
కాని, సునామీ బాధితుల గురించి ఆలోచిస్తే అయినవాళ్ళను, ఆస్తుల్ని పోగొట్టుకొని, ఉన్నదంతా నీళ్ళలో కొట్టుకుపోయి, తినడానికి తిండిలేక హెలికాఫ్టర్ల లోంచి జారివిడిచే ఆహార పొట్లల కోసం ఎదురుచూస్తూ, తాగడానికి కనీసం నీరు దొరకని దయనీయ పరిస్థితి. ఇదంతా ఆలోచించాక మనం ఎక్కవలసిన విమానం వారికి సహాయం చేయటానికే వెళ్ళాయి అనే విషయం మనసులో ఉన్న బాధను పోగొట్టి ఆనందాన్ని కలిగించింది. 
కామెంట్‌లు